కదనోత్సాహంలో ఉన్న కమల నేతల్లో కుమ్ములాటలు: ఎర్ర శేఖర్ రాజీనామా: బండి సంజయ్ పర్యటన వేళ
మహబూబ్ నగర్: తెలంగాణలో తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను సాధించి.. విజయోత్సాహంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కారణాలు స్పష్టంగా తెలియరావట్లేదు గానీ.. బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్.. తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన జిల్లా ప్రెస్‌క్లబ్‌కు ఓ లేఖను పంపించినట్లు చెబుతున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తోన్న సమయంలోనే ఆయన రాజీనామా చేయడం కలకం రేపుతోంది.
తెలంగాణలో రాక్షస పాలన: గర్జించు..గాండ్రించు: గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా: బండి సంజయ్

బండి సంజయ్ ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలిచిన మూడు వ్యవసాయ బిల్లులపై రైతులకు అవగాహన కల్పించడానికి ఆదివారం నారాయణ్‌పేట్ జిల్లాకు చేరుకున్నారు. కాస్సేపట్లో ఆయన రైతు అవగాహన సదస్సులో పాల్గొనాల్సి ఉంది. ఆయన అక్కడ పర్యటనలో ఉండగానే మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతానికి పార్టీ జిల్లా అధ్యక్ష స్థానం నుంచి వైదొలగుతున్నట్లు చెప్పారు. రాజీనామా చేయడానికి గల కారణాలను ఆయన వెల్లడించట్లేదు. వ్యక్తిగత, అనివార్య కారణాలను చూపుతున్నారు.

ఎర్ర శేఖర్ రాజీనామా చేయడం జిల్లా రాజకీయాలను కుదిపేస్తోంది. ఆయన రాజకీయంగా తదుపరి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరొచ్చనే అభిప్రాయాలు అప్పుడే ఊపందుకుంటున్నాయి కూడా. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసినప్పటికీ..ఓటమి పాలయ్యారు.
అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో బీజేపీలో చేరారు. ఇక తాజాగా ఆయన బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పడం కలకలం రేపుతోంది. బండి సంజయ్.. తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఎర్ర శేఖర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వస్తోన్న విషయాన్ని కూడా తనకు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి గానీ, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడి వద్ద నుంచి గానీ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన చెబుతున్నట్లు సమాచారం. దీనితో ఎర్ర శేఖర్ మనస్తాపానికి గురయ్యారని, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారనే ప్రచారం ఉంది.