పనిమనిషి,యజమానురాలు,ఆమె కుమార్తె... ముగ్గురిపై కామాంధుడి అత్యాచారం... కోర్టు సంచలన తీర్పు...
మొదట పనిమనిషితో పరిచయం... ఆమెను కలిసేందుకు వెళ్లే సాకుతో యజమానురాలు దుస్తులు మార్చుకుంటుండగా ఫోటోలు తీసిన దుర్మార్గుడు... ఆపై ఆమెను బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం... అక్కడితో ఆగక,యజమానురాలి కుమార్తెపై కూడా లైంగిక దాడి... ఇదే క్రమంలో పనిమనిషిపై కూడా అత్యాచారం... ఇలా ముగ్గురు మహిళలపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఓ కామాంధుడికి తాజాగా కోర్టు జీవిత ఖైదు విధించింది.

అసలేం జరిగింది...
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని హనుమాన్ బస్తీకి చెందిన షేక్ అన్వర్ అనే వ్యక్తికి 2017లో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో పనిచేసేది.
ఆమెను కలిసేందుకు అన్వర్ అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళ్లేవాడు.ఇదే క్రమంలో ఓరోజు ఆ ఇంటి యజమానురాలు దుస్తులు మార్చుకుంటుండగా రహస్యంగా ఫోటోలు చిత్రీకరించాడు. ఆపై ఆ ఫోటోలు లీక్ చేస్తానని ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. అయినప్పటికీ ఆమె లొంగకపోవడంతో కొడుకును చంపేస్తానని బెదిరించాడు. అలా ఆమెపై బలత్కారం చేశాడు.

ఆమె కుమార్తెపై కూడా అత్యాచారం...
కొద్దిరోజులకు ఆ యజమానురాలి నగ్న ఫోటోలను 9వ తరగతి చదువుతున్న ఆమె కుమార్తెకు పంపించాడు. తాను చెప్పినట్లు వినకపోతే నీ తల్లి ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. అలా ఆ బాలికపై కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఇద్దరితో పాటు ఆ పనిమనిషిపై కూడా అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. అన్వర్ వేధింపులు తాళలేక ఆ ముగ్గురు బాధితులు బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐ నాగరాజు నిందితుడు అన్వర్‌ను అరెస్ట్ చేసి అతని సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జీవిత ఖైదు విధించిన కోర్టు
కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడంతో.. ఆదిలాబాద్ కోర్టు తాజాగా దీనిపై విచారణ చేపట్టింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీరామ్ 16 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఆరో అదనపు అడిషనల్ సెషన్స్ కోర్టు (మహిళా కోర్టు) జడ్జి జయప్రసాద్ నిందితుడికి సెక్షన్-506 ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా, సెక్షన్-65 ప్రకారం మూడేళ్ల జైలు, రూ.50 వేల జరిమానా, సెక్షన్-66 (ఈ) సెక్షన్ ప్రకారం రెండేళ్ల జైలు, రూ.75 వేల జరిమానా, సెక్షన్-67, ఐటీ చట్టం ప్రకారం రెండేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. ఇది దేశంలోనే అరుదైన తీర్పు అని పేర్కొన్నారు.

మరో కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన ఓ మహిళపై అత్యాచార కేసులో నిందితుడికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. మార్చి 24,2015,రాత్రి 11.30గంటలకు ఆ మహిళ ఇంటికి వెళ్లిన నిందితుడు బాజీరావు(26) నీ భర్త మద్యం తాగి దారిలో పడిపోయాడని ఆమెతో చెప్పాడు. తనతో వస్తే ఇద్దరం కలిసి ఇంటికి తీసుకొద్దామని చెప్పాడు. ఆ మాటలు నమ్మి ఆమె బయలుదేరగా... మార్గమధ్యలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో కోర్టు అతనికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.26వేలు జరిమానా విధించింది.