కోటి 12 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన అడిషనల్ కలెక్టర్ .. తహసీల్దార్ నాగరాజు తరహాలోనే
తెలంగాణ రాష్ట్రంలో లంచావతారాలు పెరిగిపోతున్నారు . మొన్నటికి మొన్న కీసర తహసిల్దార్ గా పనిచేసిన నాగరాజు భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన మరిచిపోకముందే నేడు మరో ఉన్నతాధికారి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పట్టుబడడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది.
గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి కీసర తహసీల్దార్ ?.. అవినీతిలో ఆయనే టాప్... మ్యాటర్ ఏంటంటే

112 ఎకరాల భూమికి సంబంధించి ఎన్వోసీ కోసం ఒక కోటి 40 లక్షల రూపాయల డిమాండ్
కీసర
తహసిల్దార్ గా పనిచేసిన నాగరాజు లంచం తీసుకున్న ఘటన మరిచిపోకముందే మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ కోటి 12 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు చిక్కారు. నర్సాపూర్ డివిజన్ లోని తిప్పల్ తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి సంబంధించి ఎన్వోసీ కోసం ఒక కోటి 40 లక్షల రూపాయలను డిమాండ్ చేసిన నగేష్, అందులో కోటి 12 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

కోటి 12 లక్షల నగదు, కోటి రూపాయల ప్రాపర్టీ కూడా .. ఏసీబీకి ఆధారాలతో అడ్డంగా దొరికి
భూమి వివాదం పరిష్కరించడం కోసం, ఒక వర్గానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశారు అడిషనల్ కలెక్టర్ నగేష్. అంతేకాదు లంచం డబ్బులు ఇవ్వడం కోసం ఏకంగా అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాడు సదరు ఉన్నతాధికారి.
చెక్ తో పాటు, ప్రాపర్టీ అగ్రిమెంట్, ఆడియో క్లిప్ లతో సహా నగేష్ దొరికిపోవడం ప్రస్తుతం కలకలంగా మారింది. ఒక కోటి 12 లక్షల నగదు తో పాటుగా, కోటి రూపాయల ప్రాపర్టీ కూడా నగేష్ రాయించుకున్న ట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించినట్లుగా సమాచారం.

మెదక్ అడిషనల్ కలెక్టర్ హోదాలో అవినీతి అధికారి .. కొనసాగుతున్న తనిఖీలు
మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ అవినీతి విషయంలో రంగంలోకి దిగిన అధికారులు మాచవరంలోని నగేష్ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 12 చోట్ల రైడ్స్ చేస్తున్న ఏసిబి అధికారులు నగేష్ అక్రమాస్తుల చిట్టా వెలికి తీసే పనిలో పడ్డారు.
ఒక ఉన్నతమైన పదవిలో పని చేస్తున్న నగేష్ ఇంత భారీ ఎత్తున లంచం తీసుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారిగా ఉండి ఇంత భారీ మొత్తంలో లంచం తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

అవినీతి అడిషనల్ కలెక్టర్ పై తెలంగాణలో చర్చ
కింది స్థాయి ఉద్యోగులను అవినీతికి పాల్పడకుండా సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన ఉన్నతోద్యోగులే అవినీతికి పాల్పడుతున్న తీరు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి వారిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వంపై ఉందని టాక్ వినిపిస్తుంది.
మొన్న కీసర తహసీల్దార్ మాత్రమే కాదు ఇంకా పెద్ద స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న తిమింగలాలు కూడా ఉన్నారని ఈ ఘటన ద్వారా తెలుస్తుంది.