కోటి 40 లక్షల రూపాయల లంచం కేసు ... మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ పై వేటు ..మరో ముగ్గురిపై కూడా !!
భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పట్టుబడడం, తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 112 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇవ్వడం కోసం భారీగా లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిన మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ ను,ఆయనతో పాటు ఆర్డీవో అరుణా రెడ్డి, తహసిల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం అహమ్మద్, నగేష్ బినామీ జీవన్ గౌడ్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
కోటి 12 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన అడిషనల్ కలెక్టర్ .. తహసీల్దార్ నాగరాజు తరహాలోనే
తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అడిషనల్ కలెక్టర్ నగేష్ తో పాటుగా మరో ముగ్గురిపై వేటు వేసింది. ఏసీబీ కేసులో అరెస్ట్ అయిన మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ తో పాటు నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది ప్రభుత్వం . అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ , ఆర్డీవో అరుణా రెడ్డి, తహసిల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వాసిం అహ్మద్ ను సస్పెండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఒక కోటి 40 లక్షల రూపాయల లంచం ఇవ్వాలని బాధితులను డిమాండ్ చేసిన మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ పై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అవినీతి తిమింగలాన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే .
అడిషనల్ కలెక్టర్ నగేష్ ఆఫీస్ తో పాటుగా,ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారి ఇళ్లపై ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నర్సాపూర్ మండలంలోని తిప్పల్ తుర్తి గ్రామానికి చెందిన 112 ఎకరాలకు సంబంధించి ఎన్వోసీ కోసం కోటి 40 లక్షల రూపాయలను డిమాండ్ చేసిన వ్యవహారంలో కటకటాల పాలైన నగేష్ వ్యవహారం సీరియస్ గా తీసుకున్న సర్కార్ నేడు ఈ అవినీతి కేసులో నలుగురిపై వేటు వేసింది .