మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకసభ ఎన్నికలు 2019: మెదక్ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

By Staff
|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019: Medak Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

మెతుకుసీమగా పేరుగాంచిన మెదక్... తెలంగాణలో ప్రత్యేకంగా నిలుస్తోంది. కీలక నేతలను దేశానికి అందించిన ఘనత... మెదక్ పార్లమెంటరీ సెగ్మెంట్ సొంతం. ఇందిరాగాంధీ, బాగారెడ్డి, ఆలె నరేంద్ర, విజయశాంతి లాంటి ప్రముఖులు మెదక్ బరిలో నిలిచి గెలిచారు. స్థానికేతరులు ఇక్కడకొచ్చి పోటీచేసినా విజయం కట్టబెట్టారు ఈ లోక్‌సభ నియోజకవర్గం ఓటర్లు. అంతేకాదు తొలి ఎన్నికల నుంచి ఇప్పటివరకు చూసినట్లయితే ప్రతి పార్టీకి ప్రాతినిధ్యం కల్పించారు. మెదక్ పార్లమెంటరీ స్థానంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. సిద్దిపేట, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరు, దుబ్బాక... ఇవన్నీ కూడ జనరల్ కేటగిరీ స్థానాలే.

1952లో ఏర్పడ్డ మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ నుంచి ఎన్.ఎం.జయసూర్య తొలి ఎంపీగా గెలుపొందారు. 1957, 1962లో పి.హనుమంతరావు కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన సంగం లక్ష్మిబాయి గెలిచారు. 1971లో తెలంగాణ ప్రజా సమితి నుంచి గెలిచిన మల్లికార్జున్ 1977లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి మరోసారి విజయం సాధించారు. 1980లో జరిగిన ఎన్నికల్లో రాజకీయ సమీకరణాల కారణంగా ఇందిరాగాంధీ ఇక్కడ నుంచి పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో ఆమెకు పట్టం కట్టారు ఇక్కడి ఓటర్లు. 1984లో టీడీపీ అభ్యర్థి పి.మాణిక్ రెడ్డి ఎన్నికయ్యారు.

1989, 1991, 1996, 1998 లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.బాగారెడ్డి వరుసగా గెలుపొందడం విశేషం. 1999లో బీజేపీ అభ్యర్థిగా ఆలె నరేంద్ర విజయం సాధించారు. అయితే తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో 2004లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన నరేంద్ర తిరిగి గెలుపొందారు. 2009లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సినీనటి విజయశాంతి ఎన్నికయ్యారు. 2014లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో రాజకీయ శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ కు 2004 నుంచి ఇక్కడ ఎదురులేకుండా పోయింది. 2004, 2009, 2014.. అలా మూడు పర్యాయాలు టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు.

#LokSabhaElection2019: All about Medak Constituency

మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 15 లక్షల 36వేల 715. అందులో 7 లక్షల 75వేల 903 మంది పురుషులు, 7 లక్షల 60వేల 812 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే 6 లక్షల 6 వేల 863 పురుషులు, 5 లక్షల 84 వేల 233 మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

1952లో ఏర్పడ్డ మెదక్ పార్లమెంటరీ స్థానానికి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధికంగా తొమ్మిదిసార్లు గెలవగా, టీఆర్ఎస్ మూడుసార్లు, టీడీపీ, బీజేపీ, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్, తెలంగాణ ప్రజా సమితి పార్టీలు ఒక్కోసారి విజయం సాధించాయి. 2014లో టీఆర్ఎస్ అధినేత గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా, మెదక్ నుంచి ఎంపీగా పోటీచేశారు. అయితే రెండు స్థానాల్లోనూ గెలుపొందారు. తదనంతరం తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో మెదక్ పార్లమెంటరీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. కేసీఆర్ సన్నిహితుడు కొత్త ప్రభాకర్ రెడ్డి బై ఎలక్షన్స్ లో విజయం సాధించారు.

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి 3 లక్షల 61 వేల 277 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 11 లక్షల 91వేల 096 ఓట్లు పోలయితే, కొత్త ప్రభాకర్ రెడ్డికి 5 లక్షల 71వేల 800 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డికి 2 లక్షల 10వేల 523 ఓట్లు వచ్చాయి.

మెదక్ పార్లమెంటరీ స్థానంలో మొత్తం జనాభా 20 లక్షల 96 వేల 323 మంది కాగా, అందులో గ్రామీణ జనాభా 71.14 శాతం, పట్టణ జనాభా శాతం 28.86 గా ఉంది. ఇక ఎస్సీ జనాభా 16.55 పర్సంటేజీ ఉండగా 4.44 శాతం ఎస్టీ జనాభా ఉన్నారు. శిల్పకళా సౌందర్యం ప్రతిబింబించే ఆలయాలకు మెదక్ పుట్టిల్లులాంటిదని చెప్పొచ్చు.
ఆసియాలోనే అతిపెద్దదిగా మెదక్ కేథలిక్ చర్చి గుర్తింపు పొందింది. పోచారం అభయారణ్యం, సీగూర్ ఆనకట్ట, మెదక్ కోట, మంజీరా నది, నిజాం సాగర్ ఆనకట్ట, ఏడుపాయల దుర్గాభవాని గుడి మెదక్ కు మణిహారంలా నిలుస్తున్నాయి.

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్వతహాగా వ్యాపారస్థుడు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటారు. ఆ సమీకరణాలతోనే 2014లో టీఆర్ఎస్ టికెట్ దక్కింది. అయితే ఎంపీగా గెలిచాక సొంత వ్యాపారాలు చూసుకోవడమే తప్ప నియోజకవర్గాన్ని పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. పార్లమెంటులో కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్ గా ఉన్నా... రైతులకు ఆయన చేసిందేమీ లేదంటున్నారు స్థానికులు. ఆయన సొంతూరు ఇదే లోక్‌సభ పరిధిలోకి వచ్చినా.. పెద్దగా అభివృద్ధి చేయలేదనే వాదనలున్నాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడంలో విఫలమయ్యారనే అపవాదు మూటగట్టుకున్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ తో పాటు హరీశ్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సిద్దిపేటపైనే ప్రభాకర్ రెడ్డి దృష్టి పెట్టారని... మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లను పట్టించుకోరనే ఆరోపణలున్నాయి. సింగూరు ప్రాజెక్టు నీళ్లు ఎస్పారెస్పీకి తరలిపోతుంటే ఎంపీగా ఆయన అడ్డుకోలేకపోతున్నారనేది విపక్షనేతల వాదన. అంతేకాదు రైల్వే లైన్లు, జాతీయ రహదారుల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందే తప్ప ఆయన హయాంలో జరిగిందేమీ లేదంటున్నారు.

2014 లో మెదక్ ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన పార్లమెంట్ గణాంకాలు చూసినట్లయితే... డిసెంబర్ 2018 నాటికి 20 చర్చల్లో పాల్గొన్నారు. సభ ముందుకు 352 ప్రశ్నలు తీసుకొచ్చారు. లోక్‌సభలో ఆయన హాజరు 57 శాతంగా రికార్డయింది. ఇక ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో ప్రభాకర్ రెడ్డి వెనుకబడ్డారు. ఇప్పటివరకు కేవలం పదకొండున్నర కోట్లు మాత్రమే ఉపయోగించుకున్నారు. పటాన్‌చెరు అసెంబ్లీ సెగ్మెంట్ లోని లక్డారం గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎంపీ... పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. స్కూల్ భవనానికి నిధులు కేటాయించడంతో పాటు సీసీ రోడ్లు వేయించారు. బేగంపేట రోడ్డు శాంక్షన్ చేయించారు. అయితే ఎంపీలు తీసుకున్న దత్తత గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయారు. దీంతో డ్రైనేజీ సమస్య గ్రామస్థులను వేధిస్తోంది.

తెలంగాణలోనే ప్రత్యేకమైన లోక్‌సభగా గుర్తింపు పొందింది మెదక్. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు చోట్ల టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కేసీఆర్, హరీశ్ రావు, పద్మా దేవేందర్ రెడ్డి, రామలింగారెడ్డి తదితరులు శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం మొదలు ఇప్పటివరకు మెదక్ పార్లమెంటరీ స్థానం టీఆర్ఎస్ కు కంచుకోటలా మారింది. 2019 ఎన్నికల బరిలోనూ ఇక్కడ టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి ఫెడరల్ ఫ్రంట్ తెరపైకి తెచ్చిన నేపథ్యంలో ఆయన ఇక్కడినుంచి ఎంపీగా పోటీచేసే ఛాన్సుంది. లేదంటే ఆయన మేనల్లుడు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును మెదక్ ఎంపీగా పోటీచేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. హరీశ్ ను తనతో పాటు దేశ రాజకీయాల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవచ్చనే టాక్ నడుస్తోంది. అదలావుంటే మెదక్ బరిలో ఇప్పటివరకు తొమ్మిదిసార్లు గెలిచిన కాంగ్రెస్ మరోసారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అటు బీజేపీ నేతలకు ఇదివరకు ఒకసారి అవకాశం లభించడంతో ఈసారి కూడా ఇక్కడ గెలవాలనే తాపత్రయంతో ఉన్నారు. మొత్తానికి త్రిముఖ పోటీ అనివార్యమైనా... గెలుపు అవకాశాలు మాత్రం టీఆర్ఎస్ కు ఎక్కువుండే ఛాన్సుంది.

English summary
Lok Sabha Election 2019: Know detailed information on Medak Lok Sabha Constituency of Telangana. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Medak .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X