కోటి 40లక్షల లంచం కేసు .. ఏసీబీ కార్యాలయానికి మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ తరలింపు
భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పట్టుబడడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. 112 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇవ్వడం కోసం భారీగా లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిన మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ ను ఏసీబీ అధికారులు ఈరోజు బంజారాహిల్స్ లోని ప్రధాన కార్యాలయానికి తరలించారు.
కోటి 12 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన అడిషనల్ కలెక్టర్ .. తహసీల్దార్ నాగరాజు తరహాలోనే
ఒక కోటి 40 లక్షల రూపాయల లంచం ఇవ్వాలని బాధితులను డిమాండ్ చేసిన మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ పై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు . అడిషనల్ కలెక్టర్ నగేష్ తోపాటు ఆర్డీవో అరుణా రెడ్డి, తహసిల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం అహమ్మద్, నగేష్ బినామీ జీవన్ గౌడ్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు, నగేష్ ను మినహాయించి మిగతా వారిని నిన్ననే ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.

అడిషనల్ కలెక్టర్ నగేష్ ఆఫీస్ తో పాటుగా,ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారి ఇళ్లపై ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు నేడు మాచవరంలోని క్యాంపు కార్యాలయం నుంచి నగేష్ ను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. నిన్న ఆయన కార్యాలయం తో పాటుగా ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నగేష్ నివాసంలో లాకర్ కీని కూడా స్వాధీనం చేసుకున్న అధికారులు ఆయన లాకర్లో ఉన్న ఆస్తులను గుర్తిస్తున్నారు .
ఆయన ఆస్తులకు సంబంధించి పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, నగేష్ అవినీతిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
నర్సాపూర్ మండలంలోని తిప్పల్ తుర్తి గ్రామానికి చెందిన 112 ఎకరాలకు సంబంధించి ఎన్వోసీ కోసం కోటి 40 లక్షల రూపాయలను డిమాండ్ చేసిన వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు .ఈ కేసులో ఇంకెవరైనా ఇతర ఉన్నత అధికారుల పాత్ర ఉందా అన్న కోణంలో కూడా నిందితులను ప్రశ్నిస్తున్నారు. నేడు ఐదుగురు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు అధికారులు.
తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వం ఎంతగా హెచ్చరిస్తున్నా అవినీతి అధికారులు తమ పంధా మార్చుకోవటం లేదు అన్న దానికి అడిషనల్ కలెక్టర్ నగేష్ వ్యవహారం ఒక ఉదాహరణ.