గన్తో మాజీ మంత్రి బెదిరింపులు .. కేసు నమోదు.. తెలంగాణాలో హాట్ టాపిక్
నల్గొండ లో మాజీ మంత్రి హల్చల్ సృష్టించారు. ఏకంగా తుపాకి తీసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. నా పొలం పక్కనుండి కాలువ పనులు జరగడానికి వీలు లేదంటూ అక్కడికి వచ్చిన సైట్ ఇంజనీర్ ల మీద, జెసిబి డ్రైవర్ ల మీద నిప్పులు చెరిగారు . ఆపుతారా లేదా అంటూ గన్ గురిపెట్టారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక ప్రజా ప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి తీరు ఇలా ఉంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు నల్గొండ వాసులు.

ణా పొలం పక్క నుండే కాలువ తవ్వుతారా .. మాజీ మంత్రి వీరంగం
ఇంతకీ అసలు కథ విషయానికొస్తే నల్గొండ జిల్లా ఉరుమడ్ల గ్రామంలో ఓ కాలువ నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్న క్రమంలో, అక్కడ సైట్ ఇంజినీర్లు జెసిబి డ్రైవర్లు కాలువను ఎలా తవ్వాలో, ఏ దిశగా తవ్వాలో మ్యాప్ ఆధారంగా చూసుకుంటున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి నా పొలం పక్కనుండే కాలువ తవ్వుతారా అంటూ విరుచుకుపడ్డారు. నా భూమి పక్కనుండి కాలువ తవ్వడానికి వీలు లేదు అని అధికారులపై మండిపడ్డారు.

గన్ గురిపెట్టి బెదిరింపులు ... బాధితుల ఫిర్యాదు
పనులు నిలిపివేయాలంటూ వాగ్వాదానికి దిగిన మాజీ మంత్రి ఓ దశలో రెచ్చిపోయి ఏకంగా గన్ తీసి పనులు ఆపుతారా లేదా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మాజీ మంత్రి చర్యకు షాక్ తిన్నారు సైట్ ఇంజనీర్లు ,అధికారులు , జేసీబీ డ్రైవర్లు . బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మాజీ మంత్రివర్యుల తుపాకీ బెదిరింపులు ఏకంగా జిల్లా ఎస్పీ దాకా చేరాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకే, రూల్స్ ప్రకారమే కాలువ తవ్వుతున్నామని చెప్పినప్పటికీ అధికారుల మాట ఆయన వినిపించుకోలేదు.

చిట్యాల పీఎస్ లో కేసు నమోదు ..లైసెన్సుడ్ గన్ తో పాటు 25 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం
ఒక ప్రజాప్రతినిధిగా ఉండి వారిపై తుపాకీ గురిపెట్టడం, బెదిరించడం చేసిన
గుత్తా మోహన్ రెడ్డి పై చిట్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆయనపై ఆయుధ చట్టం, 1959, మరియు భారత శిక్షాస్మృతిలోని సంబంధిత విభాగాల కింద కేసు నమోదైంది. ఆయన వద్ద ఉన్న లైసెన్సుడ్ గన్ తో పాటు 25 రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పనులకు ఆటంకం కలిగించినందుకుగాను గుత్తా మోహన్ రెడ్డిని అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. గుత్తా మోహన్ రెడ్డికి సంబంధించిన 820 చదరపు గజాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక కాలువ నిర్మాణం కోసం తీసుకుందని, ఆయనకు పరిహారం చెల్లించినట్టు చిట్యాల పోలీసులు తెలిపారు.

ఒకప్పుడు నల్గొండ రాజకీయాల్లో కీలకంగా .. మంత్రిగా పని చేసిన గుత్తా మోహన్ రెడ్డి
గుత్తా మోహన్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నేతగా కొనసాగుతున్న గుత్తా సుఖేందర్ రెడ్డి బంధువని తెలుస్తుంది. అయినప్పటికీ ఈ ఘటనకు గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని సమాచారం.
గుత్తా మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన నాదెండ్ల భాస్కర్ రావు హయాంలో మంత్రిగా పని చేశారు. 1978,83లలో ఎమ్మెల్యేగా గెలిచారు గుత్తా మోహన్ రెడ్డి . ఒకప్పుడు నల్గొండ రాజకీయాలలో కీలకంగా ఆయన పని చేశారు . ప్రస్తుతం ఆయన అధికారులతో ప్రవర్తించిన తీరు, ఏకంగా గన్ గురిపెట్టి బెదిరింపులకు పాల్పడడం స్థానికంగా చర్చనీయాంశమైంది.