ఏపీలో బ్రిటీష్ రూల్... ఇన్సైడర్ ట్రేడింగ్ నిరూపించారా విశాఖపై మీ కన్ను అందుకే భూమా అఖిలప్రియ ఫైర్
టిడిపి నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వైసీపీ ప్రభుత్వ తీరుపై మరోసారి నిప్పులు చెరిగారు. అమరావతి ప్రాంత రైతులపై ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడిన అఖిలప్రియ, రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మూడు వందల రోజులుగా ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వంలో చలనం లేనట్లుగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రులే అవినీతి చేస్తే ప్రజలకేం న్యాయం చేస్తారు : ప్రశ్నించిన భూమా అఖిల ప్రియ

రాజధాని భూముల అవినీతి నిరూపించలేదేం
రాజధాని ప్రాంత రైతుల గోడును ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదని, రైతులను పేయిడ్ ఆర్టిస్టులు అంటూ నానా దుర్భాషలాడుతున్నారని భూమా అఖిలప్రియ మండిపడ్డారు. రైతును రాజును చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం రైతులను రోడ్లపైకి వచ్చి అడుక్కునేలా చేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎందుకు నిరూపించలేక పోయింది అని ప్రశ్నించారు భూమా అఖిలప్రియ.

విశాఖపై పాలకులు ఎందుకు కన్నేశారో అందరికీ తెలుసు
పాలకులు విశాఖపై ఎందుకు కన్నేశారో అందరికీ తెలుసని పేర్కొన్న భూమా అఖిలప్రియ విశాఖను రాజధానిగా ప్రకటించిన తర్వాత అక్కడ 72వేల రిజిస్ట్రేషన్లు జరిగాయంటూ తెలిపారు. ఇక రాయలసీమలో హైకోర్టు పెట్టినంత మాత్రాన, అక్కడి ప్రాంత యువతకు ఉద్యోగాలు వస్తాయా? రైతుల జీవితాలు బాగు పడతాయా ? అంటూ భూమా అఖిలప్రియ ప్రశ్నించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపాదనే ధ్యేయంగా పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భూమా అఖిలప్రియ రాష్ట్రాన్ని వైసీపీ విచ్చిన్నం చేస్తుందని మండిపడ్డారు.

ఏపీలో బ్రిటీష్ రూల్ .. అభివృద్ధి శూన్యంగా ఏపీ
కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజలు కొట్టుకొని తెచ్చేలా చేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. అధికార పార్టీ మాటలను ఏ ప్రాంత ప్రజలు నమ్మడం లేదని భూమా అఖిలప్రియ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు హయాంలో రాష్ట్ర అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడిందని చెప్పిన అఖిల ప్రియ, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి బ్రిటిష్ రూల్ కొనసాగుతుంది అంటూ నిప్పులు చెరిగారు . అభివృద్ధి శూన్యంగా తయారైందన్నారు .

వైసీపీకి ఓట్లేసిన వారంతా బాధ పడుతున్నారు
విభజించు పాలించు అనే విధానంలో రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని పేర్కొన్నారు భూమా అఖిల ప్రియ. వైసిపికి ఓటేసిన వాళ్లంతా ఇప్పుడు బాధ పడుతున్నారని, ఎందుకు ఓటేశామా అని తలలు పట్టుకుంటున్నారని చెప్పారు అఖిలప్రియ . 300 రోజులుగా రాజధాని అమరావతి కోసం ఆందోళన చేస్తున్నఅమరావతి ప్రాంత రైతులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందంటూ విజ్ఞప్తి చేశారు.