సలాం ఫ్యామిలీకి సీఎం జగన్ పరామర్శ.. కూతురికి జాబ్, అల్లుడి బదిలీ..
అబ్దుల్ సలాం ఫ్యామిలీ సూసైడ్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. నేతల మధ్య మాటల యుద్ధానికి కూడా దారితీసింది. అయితే ఇవాళ సీఎం జగన్ అబ్దుల్ సలాం కుటుంబాన్ని పరామర్శించారు. నంద్యాల ఏపీఎస్పీ గెస్ట్ హౌస్ వద్ద ఆటో డ్రైవర్ సలాం అత్త మాబున్నీసా, అల్లుడు శంషావలి, కూతురు సాజీదాను పరామర్శించారు. ఈ సందర్భంగా దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని మా బున్నీషా కుటుంబం ముఖ్యమంత్రిని కోరారు.
రాత్రి 10 గంటల తర్వాత ఇంటికి, తెల్ల కాగితంపై సంతకం చేయాలని..సలాం ఫ్యామిలీకి ఆగని వేధింపులు

దోషులపై కఠిన చర్యలు..
సలాం కుటుంబ ఆత్మహత్య కు కారకులైన దోషులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని మాబున్నీసాకు ధైర్యం చెప్పారు. సలాం అత్త మాబున్నీ కూతురు సాజీదాకు ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగాన్ని ఇవ్వాలని, అల్లుడు శంషావలిని అనంతపురం నుండి నంద్యాలకు బదిలీకి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జీ వీరపాండియన్‌ను సీఎం జగన్ ఆదేశించారు. సలాం అత్త కుటుంబానికి అండగా ఉండాలని ఎస్పీ డాక్టర్ కె ఫక్కీరప్పను ఆదేశించారు. కూతురు ఉద్యోగం, అల్లుడి బదిలీకి సంబంధించి సీఎం జగన్‌ను మా బున్నీ కోరగా.. ఆయన వెంటనే స్పందించారు.

క్షణాల్లో బదిలీ..
సీఎం జగన్ ఆదేశాలతో సలామ్ అత్త కొడుకు శంషావలిని అనంతపురం డీఎంహెచ్ఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ నుంచి నంద్యాల వైద్య ఆరోగ్య శాఖకు డెప్యూటేషన్ ఆర్డర్స్ ఇచ్చారు. సీఎం జగన్‌తో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, హఫీజ్ ఖాన్, కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ (సంక్షేమం) సయ్యద్ ఖాజా మొహిద్దీన్ ఉన్నారు

ఏం జరిగిందంటే..
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ అరెస్ట్ చేశారు. దొంగతనం కేసుకు సంబంధించి పోలీసులు వేధించారని అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు పోలీసుల తీరును వివరిస్తూ సెల్పీ వీడియో షూట్ చేశాడు. కుటుంబం సామూహిక ఆత్మహత్య తర్వాత వీడియో పోలీసులకు లభించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరలయ్యింది. కేసుతో సంబంధం ఉన్న సీఐ, హెడ్ కానిస్టేబుల్‌ను విధుల నుంచి తప్పించారు.