ex minister bhuma akhila priya tdp bhuma mounika reddy ycp panchayat elections discussion భూమా అఖిల ప్రియ టిడిపి భూమా మౌనికా రెడ్డి వైసిపి పంచాయతీ ఎన్నికలు చర్చ ఏవీ సుబ్బారెడ్డి politics
భూమా అఖిల ప్రియ అరెస్ట్ తో మారుతున్న ఆళ్లగడ్డ రాజకీయం .. రంగంలోకి మౌనికా రెడ్డి
మాజీమంత్రి టీడీపీ నేత భూమా అఖిలప్రియ అరెస్టుతో ఆళ్లగడ్డ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భూమా అఖిలప్రియ అరెస్టుతో భూమా వర్గీయులను టార్గెట్ చేసుకొని అధికార పార్టీ పావులు కదుపుతోంది. రానున్న పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఆళ్లగడ్డలో పావులు కదుపుతున్న వైసిపి నేతల నుండి క్యాడర్ ను కాపాడుకోవడం కోసం అఖిల ప్రియ సోదరి భూమా మౌనిక రంగంలోకి దిగారు. పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు తానున్నానని భరోసా ఇస్తున్నారు.

అఖిల ప్రియను బయటకు తీసుకురావటం కోసం సోదరి మౌనికా రెడ్డి ప్రయత్నాలు
హఫీజ్ పేట భూవివాదం నేపధ్యంలో జరిగిన బోయినపల్లి సోదరుల కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ ను ఏ వన్ నిందితురాలిగా పోలీసులు అరెస్ట్ చేసి ఆమెను జైలుకు తరలించారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న భూమా అఖిలప్రియను పోలీసులు విచారిస్తున్నారు. మూడో రోజు అఖిల ప్రియ విచారణ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే అఖిల ప్రియను బయటకు తీసుకురావడం కోసం ఆమె సోదరి మౌనిక తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు అదే సమయంలో క్యాడర్ ను కాపాడుకోవడానికి కూడా ప్రయత్నిస్తోంది .

పంచాయితీ ఎన్నికలకు భూమా క్యాడర్ టార్గెట్ గా పావులు కదుపుతున్న వైసీపీ
మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రస్తుతం భూమా అఖిలప్రియ జైలుకు వెళ్లిన పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్న వైసీపీ నేతలు భూమా వర్గీయులను టార్గెట్ చేస్తున్నట్లుగా సమాచారం. కొందరిని ప్రలోభపెట్టి మరికొందరిని రాజకీయంగా ఆర్థికంగా ఒత్తిడులకు గురి చేసి పార్టీ మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో రంగంలోకి దిగిన మౌనిక రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారని తెలుస్తుంది.

కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించిన మౌనిక రెడ్డి.. తానున్నానని భరోసా
అఖిల ప్రియ నివాసంలో కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించిన మౌనిక రెడ్డి అఖిల ప్రియ జైలుకు వెళ్లిన నేపథ్యంలో కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దని, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, కార్యకర్తల బాధ్యత తాను తీసుకుంటానని మౌనిక రెడ్డి భరోసా ఇచ్చారని తెలుస్తుంది. అంతేకాదు తమ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్న పలువురు నేతలను సైతం రంగంలోకి దింపి పార్టీ కేడర్ ను కాపాడుకునే పనిలో ఉన్నారు. ఇక ఇదే సమయంలో ఈ కేసులో ప్రమేయం ఉన్న ఏవీ సుబ్బారెడ్డి వ్యవహారశైలిపై కూడా ఆళ్లగడ్డ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

ఏవీ సుబ్బారెడ్డి భూమా కుటుంబానికి అనుకూలమా? ప్రతికూలమా
గతంలో భూమా అఖిల ప్రియ కు, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య వివాదాలు చోటు చేసుకున్న క్రమంలో ప్రస్తుతం సుబ్బారెడ్డి పేరును ఏ వన్ నుంచి ఏ 2 కు మార్చడంతో ఇది కూడా స్థానికంగా ఆసక్తికర చర్చకు కారణమవుతుంది. ప్రస్తుతం కేసుల్లో ఇరుక్కున్న భూమా కుటుంబానికి అండగా ఏవీ సుబ్బారెడ్డి పని చేస్తారా, లేక విభేదించి మరిన్ని వివాదాలకు కారణం అవుతారా అన్న చర్చ కూడా ఆళ్లగడ్డ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తోంది.