గర్భవతి అయిన మాజీమంత్రి అఖిల ప్రియకు బెయిల్ వస్తుందా ? లేదా .. కోర్టులో విచారణపై ఉత్కంఠ
బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. ప్రస్తుతం బెయిల్ కోసం అఖిలప్రియ ప్రయత్నం చేస్తున్న క్రమంలో అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై ఈరోజు కోర్టులో వాదనలు జరగనున్నాయి. అఖిల ప్రియ గర్భవతి కావడంతో ఆమె బెయిల్ పై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.


చంచల్ గూడా జైల్లో అఖిలప్రియకు యూటీ 1509 నెంబర్
బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియను రిమాండ్ అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు. చంచల్ గూడా జైల్లో అఖిలప్రియకు యూటీ 1509 నెంబర్ ను అధికారులు కేటాయించారు. కరోనా నిబంధనల నేపథ్యంలో సింగిల్ బ్యారక్ లో అఖిలప్రియ ఉన్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చంచల్ గూడ జైలు అధికారులు తెలియజేశారు. చంచల్ గూడా మహిళా జైలు లో అఖిల ప్రియ ను అధికారుల అబ్జర్వేషన్లో ఉంచారు.

అఖిలప్రియను అన్యాయంగా ఇరికించారన్న కుటుంబ సభ్యులు
నిన్న రాత్రి నుండి జైలుకు వచ్చిన తర్వాత అఖిలప్రియ ఏమీ తినలేదని, ఈరోజు ఉదయం జూస్ మాత్రమే తాగారని జైలు అధికారులు చెబుతున్నారు.
ఇక బోయినపల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు విచారణ కొనసాగుతోంది . ఒక భూ వ్యవహారంలో ఈ కిడ్నాప్ జరిగిందని తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో అఖిలప్రియను అన్యాయంగా ఇరికించారు అని అఖిల ప్రియ తరపు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ఇంకా పరారీ లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది.

సికిందరాబాద్ కోర్టులో వాదనలు , బెయిల్ పై ఉత్కంఠ
భార్గవ్ రామ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తనకు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి అఖిల ప్రియ తాలూకా న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఈరోజు సికింద్రాబాద్ కోర్టులో వాదనలు జరగనున్నాయి. అఖిల ప్రియ అనారోగ్య సమస్య, ఆమె గర్భవతి కావడంతో బెయిల్ పిటిషన్ పై ఉత్కంఠ నెలకొంది. అయితే ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని జైలు అధికారులు చెప్తున్నారు. ఈ నేపధ్యంలో ఈరోజు అఖిల ప్రియ బెయిల్ కు కోర్టు అంగీకరిస్తుందా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.