రుయాఘటన తర్వాత నెల్లూరుజిల్లాలో మరో ఘటన; బైక్ పైనే కొడుకుశవాన్నితీసుకెళ్ళిన తండ్రి
తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో బాలుడి శవాన్ని తండ్రి బైక్ మీద తీసుకువెళ్ళిన హృదయ విదారక ఘటన మరిచిపోకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి నుంచి కొడుకు మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి 108 సిబ్బంది నిరాకరించడంతో ఓ తండ్రి తన బైక్ పైన కొడుకు శవాన్ని ఇంటికి తీసుకు వెళ్ళాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వివరాలను చూస్తే
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో బుధవారం నాడు ఎనిమిది సంవత్సరాల శ్రీరామ్, 10 సంవత్సరాల ఈశ్వర్ అనే ఇద్దరు పిల్లలు బహిర్భూమికి వెళ్లి కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తు మునిగిపోయారు. ఈ ఘటనలో ఈశ్వర్ మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న శ్రీరామ్ ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అయితే శ్రీరామ్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. శ్రీరామ్ తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలని 108 సిబ్బందిని బ్రతిమిలాడాడు. అయితే నిబంధనలు అంగీకరించవని 108 సిబ్బంది మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లడానికి నిరాకరించారు.

సమీపంలో మహాప్రస్థానం వాహనం కూడా అందుబాటులో లేకపోవడంతో, ఆటోలు, ఇతర వాహనాల ద్వారా మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో కొడుకు చనిపోయిన పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి తండ్రి తన బైక్ పైనే కొడుకు శ్రీరామ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంతకుముందు రుయా ఆసుపత్రి లో కూడా అంబులెన్స్ మాఫియా తీరుతో తండ్రి కొడుకు మృతదేహాన్ని 90 కిలోమీటర్ల మేర బైక్ పైన ఇంటికి తీసుకువెళ్లాడు. ఇది ఏపీలో చర్చనీయాంశం అయ్యింది. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు కారణం అయ్యింది.
ఇప్పుడు మళ్లీ అటువంటి ఘటన చోటు చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రిలో జరుగుతున్న దారుణ ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. ఆసుపత్రులలో అంబులెన్స్ సిబ్బంది అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు అన్న చర్చ జరుగుతుంది. మరి తాజా ఘటనపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.