శేఖర్ రెడ్డి కంపెనీకి మేలు..? మరో 1300 హెక్టార్ల సిలికా మైన్లలోనూ.. చిన్న లీజు కంపెనీల గగ్గోలు..
నెల్లూరు జిల్లాలో గల సిలికా మైన్ల కేటాయింపుల్లో నిబంధనల మార్పు కొందరి మేలు కోసమేనని ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డికి చెందిన కంపెనీ అవంతిక ఎక్స్ పోర్టర్స్ వచ్చేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందనే విమర్శలు వస్తున్నాయి. శేఖర్ రెడ్డికి అనుకూలంగా నిబంధనలు మార్చడంతో జిల్లాలో గల చిన్న కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. ఇంతకీ కేటాయింపుల్లో ఏం జరిగింది.

వార్షిక టర్నోవర్ రూ.500 కోట్లు అని..
అంతకుముందు ఒక టన్నుకు రూ.135 చొప్పున ప్రభుత్వానికి లైసెన్సుదారులు రాయల్టీ చెల్లించేవారు. కానీ కొత్తగా టెండర్ల విధానం ప్రవేశపెట్టారు. దీంతో టన్నుకు శేఖర్‌రెడ్డి కంపెనీ రూ.212 కోడ్ చేసి టెండరు దక్కించుకుంది. కానీ టెండర్లలో పాల్గొనే అర్హత నిబంధనను మార్చివేశారు. టెండర్లలో పాల్గొనే కంపెనీకి వార్షిక మైనింగ్ టర్నోవర్ రూ.500 కోట్లు ఉండాలనే నిబంధన పెట్టారు. నెల్లూరు జిల్లా పరిధిలో లైసెన్సీలుగా ఉన్న చాలా కంపెనీలు అర్హత సాధించలేదు. గాలి జనార్ధన్‌రెడ్డి సోదరులు, శేఖర్‌రెడ్డి ఒకరిద్దరీ కంపెనీలకు మాత్రమే మైనింగ్‌లో వార్షిక టర్నోవర్ 500 కోట్లు ఉంది. అంటే శేఖర్‌రెడ్డి కంపెనీకి వచ్చేలా చూడటం కోసం రూ.500 కోట్ల టర్నోవర్ నిబంధన పెట్టినట్టు అర్థమవుతోంది.

చిన్న లీజుదారుల పాలిట శాపం..
నెల్లూరు జిల్లా చిల్లకూరు, కోట మండలాల పరిధిలో 1300 హెక్టార్లలో సిలికా మైన్లు ఉండగా.. 6 కంపెనీలు లీజుదారులుగా ఉన్నాయి. వీటిలో చాలా కంపెనీలు 1980 నుంచి లీజుదారులుగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి లీజు పీరియడ్ 10 నుంచి 20 ఏళ్లు ఉంది. కానీ ప్రభుత్వం లీజులను రద్దు చేయాలని నిర్ణయించింది. సిలికా మైన్లను ఏపీఎండీసీ పరిధిలోకి తీసుకొని.. కొత్తగా వాటికి టెండర్లు పిలవాలని భావిస్తోంది. తమ లీజు రద్దు చేయడం అన్యాయమని లైసెన్సీలు బోరుమంటున్నారు. మరో 300 హెక్టార్ల విస్తీర్ణంలో గల ప్రైవేట్ భూముల్లో గల మైనింగ్ లీజులను రద్దు చేస్తామని సంకేతాలు ఇచ్చారు. దీంతో శేఖర్‌రెడ్డి కంపెనీకి పాత లైసెన్సీల నుంచి పోటీ తప్పించాలనేది ప్రభుత్వం ఆలోచన అని అవగతమవుతోంది.

శేఖర్ రెడ్డి కంపెనీకే మేలు
ఉన్న లీజులను రద్దు చేసి.. టెండర్లు పిలిస్తే, భూములన్నీ శేఖర్‌రెడ్డి కంపెనీకో మరో కంపెనీకో దక్కుతాయనడంలో సందేహాం లేదు. దీనికి ఇటీవల జరిగిన టెండర్లే ఉదాహరణ అని చిన్న లైసెన్సీలు చెబుతున్నారు. ఇదే కాదు 1300 హెక్టార్ల టెండర్ల సమయంలో కూడా దీనిలాగే నిబంధనలు పెడితే పెద్ద కంపెనీలకు మాత్రమే టెండర్లలో పాల్గొనే అవకాశం వస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించాయని పేరు చెప్పి భారీగా ఫైన్ వేశారని తెలిపారు. సమస్యపై లీజుదారులు ప్రభుత్వాన్ని విన్నవించారు. కానీ ప్రభుత్వం మాత్రం వారి వాదనను వినిపించుకోకుండా ముందుకు సాగుతోంది.