నెల్లూరులో దారుణం-కూతురి నోట్లో కుంకుమ కుక్కి చంపేసిన తండ్రి- మూఢనమ్మకాలతో
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాచుకోవాల్సిన కన్నతండ్రే బాలిక పాలిట యముడయ్యాడు. మూఢనమ్మకాలతో కళ్లముందే కన్నకూతురిని కాటేశాడు. నోట్లో కుంకుమ కుక్కి మరీ చంపేశాడు. ఆ తర్వాత తీరిగ్గా కటకటాలు లెక్కిస్తున్నాడు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని పేరారెడ్డిపల్లిలో ఆర్ధికంగా నష్టపోయిన వేణుగోపాల్ అనే వ్యక్తి మూఢనమ్మకాలతో తనకు చుట్టుకున్న చెడును వదిలించుకునే క్రమంలో కన్నకూతురు ప్రాణాలకే ముప్పు తెచ్చాడు. తనకు పట్టిన చెడు వదిలించుకునేందుకు మూడేళ్ల కూతురును పూజగదిలో ఉంచి పసుపునీళ్లు పోశాడు. అనంతరం నోట్లో కుంకుమ కుక్కాడు. దీంతో ఆ చిన్నారి ఊపిరాడక కేకలు పెట్టింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని ఆ కసాయి తండ్రి నుంచి కూతురుని రక్షించేందుకు విఫలయత్నం చేశారు. వెంటనే ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్ధితి విషమం కావడంతో నెల్లూరు, అనంతరం చెన్నైకు కూడా తరలించినా ఆ చిన్నారిని బతికించలేకపోయారు.


పూజల పేరుతో కన్న కూతురిని పొట్టనబెట్టుకున్న కసాయితండ్రి వేణుగోపాల్ పై స్ధానికులు మండిపడుతున్నారు. ఘటన జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న స్ధానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. మూఢనమ్మకాలతో కన్నకూతురు నోట్లో కుంకుమ కుక్కి చంపేసిన తండ్రి వేణుగోపాల్ ను కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని కోరుతున్నారు. పోలీసులు కూడా ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసే పనిలో ఉన్నారు. ఈ దారుణానికి సహకరించిన తల్లిపై కూడా కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.