వైసీపీ ఎంపీ ఆదాలకు అరుదైన గుర్తింపు: ఆ జాబితాలో నంబర్-2: రాహుల్ గాంధీ కూడా వెనక్కి
నెల్లూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డికి అరుదైన గుర్తింపు లభించింది. దేశ రాజధానికి చెందిన ఓ సంస్థ నిర్వహించన సర్వేలో ఆయనకు రెండో స్థానం లభించింది. భారతీయ జనతా పార్టీ ఎంపీ తొలి స్థానంలో నిలిచారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మాజీ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ మూడో స్థానాన్ని అందుకున్నారు. ఈ సర్వేలో టాప్ టెన్‌లో నిలిచిన జాబితాను ఆ సంస్థ ప్రకటించింది.

లాక్డౌన్ సమయంలో..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసిన లాక్డౌన్ పరిస్థితుల్లో తమ నియోజకవర్గ ప్రజలను గరిష్ఠ స్థాయిలో ఆదుకున్న లోక్‌సభ సభ్యుల కోసం ఈ సర్వే నిర్వహించారు. న్యూఢిల్లీకి చెందిన గవర్న్‌ఐ సిస్టమ్స్ అనే సంస్థ దీన్ని చేపట్టింది.ఈ ఏడాది అక్టోబర్్ 1వ తేదీన ఈ సర్వేను చేపట్టిందా సంస్థ. దేశవ్యాప్తంగా తమకు ఉన్న నెట్వర్క్, ప్రతినిధుల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించింది. వాటన్నింటినీ క్రోడీకరించి- తుది 10 మంది ఎంపీల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది.

తొలి అయిదు స్థానాల్లో
ఈ జాబితాలో బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా తొలి స్థానాన్ని ఆక్రమించారు. ఆయన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. రెండో స్థానంలో వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నిలిచారు. గత ఏడాది నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మూడో స్థానాన్ని అందుకున్నారు. కేరళలోని వయనాడ్ స్థానం నుంచి ఆయన విజయం సాధించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, బీజేపీకే చెందిన బెంగళూరు దక్షిణ నియోజకవర్గం ఎంపీ తేజస్వి సూర్య తొలి అయిదుమందిలో చోటు దక్కించుకున్నారు.

చివరి అయిదు స్థానాల్లో..
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న శివసేన ఎంపీ హేమంత్ తుకారాం గాడ్సే (నాసిక్-మహారాష్ట్ర), శిరోమణి అకాలీదళ్‌కు చెందిన సుఖ్బీర్ సింగ్ బాదల్ (ఫిరోజ్‌పూర్-పంజాబ్), బీజేపీ ఎంపీ శంకర్ లల్వాణీ (ఇండోర్-మధ్యప్రదేశ్), డీఎంకే ఎంపీ డాక్టర్ టీ సుమతి తంగపాండియన్ (చెన్నై సౌత్), బీజేపీ ఎంపీ, కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి (నాగ్‌పూర్-మహారాష్ట్ర) చివరి అయిదు స్థానాలో నిలిచారు.

ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్..
ఆయా ఎంపీలందరూ లాక్డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న తమ నియోజకవర్గ ప్రజలను గరిష్ఠస్థాయిలో ఆదుకున్నారని గవర్న్‌ఐ సిస్టమ్స్ సర్వే సంస్థ వెల్లడించింది. అలాగే- తమ నియోజకవర్గం మీదుగా నడిచి వెళ్తోన్న వలస కార్మికులకు సహాయం చేశారని పేర్కొంది. లోక్‌సభ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని తాము ఈ సర్వేను చేపట్టినట్లు వివరించింది. అన్‌లాక్ తరువాత ప్రజల అభిప్రాయాలను సేకరించామని తెలిపింది. వాటన్నింటినీ క్రోడీకరించిన అనంతరం అత్యుత్తమంగా సేవలను అందించిన 10 మంది ఎంపీల పేర్లతో ఈ జాబితాను రూపొందించినట్లు స్పష్టం చేసింది.