ప్రియుడి కోసం పేగు బంధాన్నే మరిచి ..కన్నకొడుకునే కడతేర్చిన కసాయి తల్లి
వివాహేతర సంబంధాలు పేగు తెంచుకుని పుట్టిన అనుబంధాలను సైతం మరిచిపోయేలా చేస్తున్నాయి. రోజురోజుకు సమాజంలో పెరిగిపోతున్న పోకడలు మనుషులలో కర్కశత్వాన్ని మరింత పెంచుతున్నాయి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఓ తల్లి నవమాసాలు మోసి కనిపెంచిన నాలుగేళ్ల కొడుకుని కడతేర్చిన ఘటన అమ్మతనానికి తీరని కళంకం తెస్తోంది. నవమాసాలు మోసి , భరించలేని నొప్పులను భరించి కని ,పెంచి, పెద్ద చేసిన కన్నతల్లి కొడుకుపై కసాయి తనం చూపించింది .
కన్నతల్లి బరువైందని కొడుకు కసాయితనం ... కడపలో అమానుషం

కొడుకును చంపి దెయ్యాలు తన కొడుకును చంపాయని తల్లి కట్టుకథ
నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనలో ఓ తల్లి తన నాలుగేళ్ల కుమారుని అత్యంత పాశవికంగా హతమార్చి అమ్మతనానికి మాయని మచ్చ తెచ్చింది. అంతేకాదు తమకు దెయ్యం పూనింది అని, దెయ్యాలు మీద పడి తన కొడుకును చంపాయి అని చెప్పి బాలుడి తల్లి ఆరోపిస్తోంది . ఇంట్లో వాళ్ళను , గ్రామస్తులను, పోలీసులను నమ్మించేలా పెద్ద కట్టుకథ అల్లింది. అయితే తల్లి అబద్ధం చెప్తుంది అని గుర్తించిన పోలీసులు ఆమె పై అనుమానంతో విచారణ సాగిస్తే విషయమంతా బయటపడింది.

ప్రియుడితో పారిపోయేందుకు కొడుకు అడ్డుగా ఉన్నాడని
నిజామాబాద్ జిల్లా ఏరుట్ల మండలం తొర్తిలో గురువారం అనుమానాస్పదస్థితిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన కేసులో తల్లి హంతకురాలు అని తేలింది. తొర్తికి చెందిన నవ్యకు ఐదేళ్ల క్రితం వివాహం కాగా ఇష్టం లేని వివాహం చేసిన కారణంతో ఆమె భర్తతో సజావుగా కాపురం సాగించలేదు . నవ్య డిగ్రీ చదువుతున్న సమయంలో ఓ ప్రేమ వ్యవహారం నడిపినట్లు గా సమాచారం. భార్యాభర్తల మధ్య తరచూ ఈ విషయానికి సంబంధించి గొడవలు జరుగుతూ ఉండేవి. పెద్దల పంచాయితీలు పెట్టి పలుమార్లు మందలించి ఇద్దరినీ కలిసి ఉండాలని చెప్పారని సమాచారం .

బాలుడి మెడకు చున్నీతో కట్టి ఫ్యాన్ కు ఉరి వేసి హత్య
అయినప్పటికీ ఏ మాత్రం మారని నవ్య తీరుతో విసిగిపోయిన భర్త అభిషేక్ ఆమెను పుట్టింటికి పంపించేశాడు. ఇదే అదునుగా భావించిన నవ్య ప్రియుడితో పారిపోవాలని నిర్ణయించుకుంది. భాగంగా నాలుగేళ్ల కన్నబిడ్డను పేగు బంధాన్ని మరచిన ఆ కసాయి తల్లి అత్యంత పాశవికంగా హతమార్చింది. బాలుడి మెడకు చున్నీతో కట్టి ఫ్యాన్ కు ఉరి వేసి చంపినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ కేసుకు సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతోంది.

అమ్మ అన్న మాటకే కళంకం తెచ్చేలా ఘాతుకం
విచారణ ముగిసిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నా, హంతకురాలు మాత్రం తల్లే అని తేలిపోయింది. కేవలం వివాహేతర సంబంధం కోసం ఇంతటి దారుణానికి తల్లి ఒడి కట్టడం స్థానికంగా సంచలనం సృష్టించింది. అమ్మ అన్న పదానికి కళంకం తెచ్చేలా ప్రవర్తించిన ఈ కసాయి తల్లి కి కఠినంగా శిక్ష పడాలి అని ఈ ఘటన తెలిసిన వారంతా అంటున్నారు. అభం శుభం తెలియని, ముక్కుపచ్చలారని నాలుగేళ్ల కన్న కొడుకుని హతమార్చిన తీరుతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.