ప్రియుడి కోసం ఓ ఇల్లాలు క్రూరత్వం ... భర్త గుండెలో 12 సార్లు కత్తితో పొడిచి ఆపై..
ప్రియుడి మోజులో ఓ ఇల్లాలు భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. అంతేకాదు 10 గంటల పాటు శవంతో జాగారం చేసింది . ప్రియునిమోజులో 12 సార్లు గుండెలో పొడిచి హత్య చేసిన ఆ ఇల్లాలు శవాన్ని ప్లాస్టిక్ కవర్ లో మూటకట్టి అటవీ ప్రాంతంలో పారవేసిన ఘటన నిజామాబాద్ జిల్లాను ఒక్కసారి ఉలికిపాటుకు గురి చేసింది . శవాన్ని తరలిస్తూ.. సీసీ కెమెరాలకు చిక్కిన నిందితుల దృశ్యాలు ఈ కేసును చేదించటానికి పోలీసులకు ఉపయోగపడ్డాయి. నిజామాబాద్ లో సంచనం సృష్టించిన ప్లాస్టిక్ కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ నారాయణ హత్య కేసును చేధించిన పోలీసులు ఈ హత్యకు సంబంధించి వెల్లడించిన కీలక విషయాలు విస్తుపోయేలా చేశాయి.

భర్తను మోసం చేస్తూ అక్రమ సంబంధం కొనసాగించిన శిరీష
నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన నారాయణకు నగరానికి చెందిన శిరీష దగ్గరి బంధువులు. శిరీషకు గతంలో పెళ్లి జరగ్గా భర్త నుంచి విడాకులు తీసుకుంది. కొన్నేళ్ల క్రితం వరుసకు బావయ్యే నారాయణను రెండో పెళ్లి చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుని కష్టంగా సంసారం చేసింది. వినాయక్ నగర్ లో నివాసం ఉంటున్న సమయంలో ఇంటి పక్కనే ఉండే హెడ్ కానిస్టేబుల్ కుమారుడు ఫణింద్ర ప్రసాద్ అనే యువకునితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. అక్రమ సంబంధం విషయంలో భర్త నారాయణ భార్య శిరీషను నిలదీశాడు. నివాసాన్ని వినాయక్ నగర్ నుంచి సాయి ప్రియ నగర్ కు షిప్ట్ చేశాడు.

ప్రియుడి మోజులో .. భర్తను చంపాలని స్కెచ్
భర్తకు అనుమానం రాకుండా ప్రియునితో తన సంబంధాన్ని కొనసాగించింది భార్య శిరీష . నాలుగు సెల్ నెంబర్లు వినియోగిస్తూ ప్రియునితో మాట్లాడుతూ భర్తకు దొరక్కుండా జాగ్రత్త పడింది. భార్య ప్రవర్తనపై అనుమానం పడుతూ, వేధిస్తుండటంతో భర్తను హత్య చేయాలని ప్రియునితో కలిసి నాలుగు నెలల క్రితం స్కెచ్ వేసింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న భర్త నారాయణ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది. అనారోగ్యంతో ఈనెల 26న ఇంట్లో నిద్రిస్తున్న నారాయణను చంపేసింది.

12 సార్లు గుండెల్లో పొడిచి .. ప్లాస్టిక్ సంచిలో కుక్కి ..
ప్రియుడు తెచ్చిన పదునైన కత్తితో 12 సార్లు కసితీరా పొడిచింది. అక్కడే ఉన్న ప్రియుడు సైతం అదే కత్తితో నారాయణ గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు. శవాన్ని ప్లాస్టిక్ సంచిలో కుక్కి.. 10 గంటల పాటు బాత్ రూం లో ఉంచారు.భర్త నారాయణ శవంతో 10 గంటల పాటు జాగారం చేసింది భార్య శిరీష. అర్ధరాత్రి 12 నుంచి 1 గంట మధ్యలో ప్రియుడు ఫణింద్ర ప్రసాద్ అతన సోదరుడు మహేంద్ర ప్రసాద్ సహకారంతో శవాన్ని మోపాల్ మండలం మంచిప్ప అటవీ ప్రాంతంలోని ఓ గుంతలో పారేశారు.

సీసీ టీవీ కెమెరాలో శవాన్ని బండిపై తీసుకెళ్తున్న దృశ్యాలు
శవాన్ని బండిపై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. తీగ లాగితే డొంక కదిలింది. అనుమానంతో భార్యను విచారించగా.. అసలు నిజం బయట పడింది.పదునైన కత్తితో కడుపులో పొడిచి హత్య చేసినట్లు ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు. నిందితులు వినియోగించిన కత్తితో పాటు మృతదేహాన్ని తరలించడానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్య చేసిన భార్య ప్రియుడు, శవాన్ని మాయం చేసేందుకు అన్నకు సహకరించిన తమ్మన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

వివాహేతర సంబంధం .. పర్యవసానం ఇది
ప్రియుని మోజులో భర్తను అడ్డు తొలగించుకున్న భార్య చివరికి కటకటాల పాలైంది. చదువుకుని ఉద్యోగ వేటలో ఉన్న యువకుడు ప్రియురాలి కోసం హత్య చేసాడు. శవాన్ని మాయం చేసేందుకు తమ్ముని సాయం తీసుకుని అతని జీవితాన్ని అంధకారం చేశాడు. అక్రమ సంబంధం ఒకరి హత్యకు దారితీయగా.. ముగ్గురు జీవితాలను రోడ్డున పడేలా చేశాయి.