రాసలీలల మంత్రి ఔట్ .. క్యాబినెట్ లోకి కవిత ఇన్ ? తెలంగాణాలో ఆసక్తికర చర్చ
తెలంగాణ రాష్ట్రంలో మంత్రి రాసలీలల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతోంది. రాసలీలల మంత్రికి సంబంధించిన వ్యవహారాన్ని మీడియా ఛానల్స్ బయటపెట్టడంతో దీని వెనుక అనేక ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా కవిత ప్రమాణ స్వీకారం చేసిన ఒక్కరోజులోనే తెర మీదికి వచ్చిన ఈ వ్యవహారం కవితకు కలిసొస్తుంది అన్న ఆసక్తికర చర్చ జోరుగా సాగుతుంది .

కవితకు మంత్రిగా ఛాన్స్ ... కొంతకాలంగా ఆసక్తికర చర్చ
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన కవితను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. కవితను కేవలం ఎమ్మెల్సీగా మాత్రమే పరిమితం చేయకుండా, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సీఎం కేసీఆర్ మంత్రిగా కవితకు కీలక బాధ్యతలు అప్పజెప్తారని గులాబీ పార్టీలోనే ఆసక్తికర చర్చ జరిగింది. అయితే మంత్రిగా కవితకు అవకాశమిస్తే మంత్రివర్గం నుంచి అవుట్ అయ్యే ఆ నేత ఎవరు అన్నదానిపై గత కొంత కాలంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మంత్రి రాసలీలల వ్యవహారం .. సీఎం కేసీఆర్ సీరియస్ !!
తాజాగా ఓ మంత్రి రాసలీలల వ్యవహారం బయటపడడంతో, రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ సిబ్బంది పూర్తి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. సీఎం కేసీఆర్ కూడా మంత్రి రాసలీలల వ్యవహారం పై సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు మంత్రికి ఉద్వాసన పలికితే, కవిత కు లైన్ క్లియర్ అవుతుంది అన్న భావన వ్యక్తమవుతోంది. కవిత మంత్రి పదవి కోసమే ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారా అన్న అనుమానాలు కూడా పలువురు రాజకీయ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్సీగా కవిత ప్రమాణస్వీకారం చేసిన ఒక్కరోజులోనే బయటపడ్డ మంత్రి రాసలీలలు
ఎమ్మెల్సీగా కవిత ప్రమాణస్వీకారం చేసిన ఒక్కరోజులోనే మంత్రి రాసలీలల వ్యవహారం బయటకు రావడంపై
ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 18 మంది మంత్రులు మంత్రివర్గంలో ఉన్నారు. కవితకు స్థానం ఇవ్వాలంటే ఎవరైనా ఒక మంత్రిని మంత్రి పదవి నుండి తప్పించాల్సిన అవసరం ఉంది. అయితే ఎవరికి వారు మంత్రి పదవి వదులుకునే అవకాశం లేదు. సీఎం కేసీఆర్ తప్పుకోమని చెప్తే తప్పుకునే మంత్రులు ఉన్నప్పటికీ వారు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంటుంది. అకారణంగా వారిని పక్కన పెడితే అది ప్రతిపక్ష పార్టీలకు టార్గెట్ అవుతుంది .

రాసలీలల మంత్రి అవుట్ అయితే... కవిత క్యాబినెట్లోకి
ఈ క్రమంలో కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్న చందంగా మంత్రి రాసలీలల వ్యవహారం కవిత కు కలిసొచ్చేలా ఉందని టాక్ వినిపిస్తోంది.
ఎమ్మెల్సీగా ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా కవిత వ్యవహరించడానికి క్యాబినెట్ లో స్థానం కల్పిస్తేనే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మంత్రి రాసలీలల వ్యవహారం దుమారం రేపుతున్న నేపధ్యంలో కెసిఆర్ మంత్రి పదవి నుండి సదరు మంత్రి ని తొలగించినా, లేదా స్వయంగా మంత్రి చేత రాజీనామా చేయించినా కవితకు క్యాబినెట్లో బెర్త్ కు మార్గం సుగమం అయినట్టే. ఏదిఏమైనా క్యాబినెట్ మంత్రిగా కవితకు స్థానం పక్కా అని , రాసలీలలు మంత్రి అవుట్ అయితే క్యాబినెట్లోకి కవిత కూల్ గా ఇన్ అని జరుగుతున్న చర్చ ఇప్పుడు తెలంగాణా లో హాట్ టాపిక్ గా మారింది.