యువకుడిని ఢీకొట్టిన ఇసుక లారీ.. కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత... పోలీసుల లాఠీచార్జి...
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం(డిసెంబర్ 28) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓ ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో విజయ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ప్రమాదానికి కారణమైన లారీ అద్దాలు ధ్వంసం చేసి నిప్పంటించారు. అదే సమయంలో రోడ్డుపై నిలిపివున్న మరో 12 లారీల అద్దాలను ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
డేటింగ్ యాప్‌లో పరిచయం... ట్రాప్... కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి రేప్...

అసలేం జరిగింది...
స్థానికుల కథనం ప్రకారం... బిచ్కుంద మండలంలోని గోపన్‌పల్లి గ్రామానికి చెందిన విజయ్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో సెలూన్ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి షాపు మూసి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో బిచ్‌కుంద్ ఎస్బీఐ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన లారీ విజయ్ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో విజయ్ తీవ్ర గాయాలపాలవగా... స్థానికులు గమనించి 108 అంబులెన్సులో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

12 లారీలు ధ్వంసం..
ప్రమాదంపై ఆగ్రహానికి గురైన స్థానికులు ఇందుకు కారణమైన ఇసుక లారీ అద్దాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. ఆ లారీ వెనకాలే నిలిచిపోయిన మరో 12 ఇసుక లారీల అద్దాల ధ్వంసం చేశారు. అనంతరం ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది.

పోలీసుల లాఠీచార్జి
ఆందోళనకారులు తిరగబడటంతో పోలీసులు లాఠీచార్జీ చేసి వారిని చెదరగొట్టారు. స్థానికుల ఆందోళనతో సుమారు 2 గంటల పాటు బిచ్కుందలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గాయపడ్డ యువకుడు విజయ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తమకు న్యాయం చేయాలని అతని కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేశారు.ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా్ప్తు చేస్తున్నారు. బిచ్కుంద మీదుగా అక్రమంగా ఇసుక రవాణా జోరుగా సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం లారీలు,ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. శనివారం(డిసెంబర్ 26) రాత్రి స్థానిక రెవెన్యూ అధికారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకోవడం గమనార్హం.