కేసీఆర్‌కు సంక్రాంతి గిఫ్ట్ ఖాయం... పాతబస్తీ పన్ను లెక్కంత.. ఖజానా ఖర్చంతా అక్కడే : బండి సంజయ్
దుబ్బాక గెలుపు కమలనాథుల్లో ఫుల్ జోష్ నింపింది. సీఎం సొంత జిల్లా సిద్దిపేట నుంచే టీఆర్ఎస్పై తమ దండయాత్ర మొదలైందని బీజేపీ నేతలు చెప్తున్నారు. దుబ్బాక గెలుపు ఇచ్చిన స్పూర్తితో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు సంక్రాంతి గిఫ్ట్ కూడా ఇస్తారని పేర్కొన్నారు. బుధవారం(నవంబర్ 11) జూమ్ యాప్ ద్వారా జరిగిన పార్టీ కార్యక్రమంలో సంజయ్ మాట్లాడారు.

కేసీఆర్‌కు సంక్రాంతి గిఫ్ట్...
దుబ్బాక ఉపఎన్నికలో అక్కడి ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దీపావళి గిఫ్ట్ ఇచ్చారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అలాగే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు సంక్రాంతి గిఫ్ట్ కూడా ఇస్తారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందని కేసీఆర్ మాట్లాడారని... ఇప్పుడు ఆయన సొంత జిల్లా సిద్దిపేటలోనే తమ ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పారు. ఇప్పటికే కేసీఆర్ తన విధానాలపై ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.

పాత బస్తీ పైనే ఖజానా ఖర్చు...
తెలంగాణలో కేసీఆర్ రైతులను మోసం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో రైతులకు సన్న బియ్యం పండించమని చెప్పి... ఆయన మాత్రం తన ఫాంహౌస్‌లో దొడ్డు బియ్యం పండిస్తున్నాడని ఆరోపించారు. అటు ఎల్ఆర్ఎస్ పేరుతోనూ ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. అసలు హైదరాబాద్ పాతబస్తీలో ఎంత పన్ను వసూలు చేస్తున్నారో ప్రభుత్వం లెక్కలు చెప్పట్లేదన్నారు. రాష్ట్ర ఖజానా మొత్తాన్ని పాతబస్తీలో ఖర్చుపెడుతున్నారని ఆరోపించారు.

గ్రేటర్లో గెలిచేది మేమే...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు కోసమే రూ.10వేలు చొప్పున నగదు పంచుతున్నారని ఆరోపించారు. లాక్ డౌన్‌తో ఎంతోమంది పేదల జీవితాలు నాశనమయ్యాయని... ప్రభుత్వం వారిని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. 2023లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని అన్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచి తీరుతుందని అన్ని సర్వేలు చెప్తున్నాయన్నారు. హైదరాబాద్ అభివృద్ది కేంద్ర ప్రభుత్వం వల్లే సాధ్యమైందన్నారు.

కేసీఆర్‌ను బొందపెడుతామన్న సంజయ్...
దుబ్బాక ఉపఎన్నిక ఫలితం తర్వాత బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే.తాము ఛత్రపతి శివాజీ వారసులమైతే... కేసీఆర్ లాడెన్, బాబర్, అక్బర్‌ల వారసుడని సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కేసీఆర్‌ను బొంద పెడతామని, హిందువులను అవమానిస్తున్న ఎంఐఎంకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.