వడ్డీ వ్యాపారులకు అర్వింద్ అండ, మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్‌కు చెందిన సురేష్ కుటుంబం అప్పులతో విజయవాడలో ఆత్మహత్యకు రాజకీయ రంగు పలుముకుంది. వడ్డీ వ్యాపారులు నలుగురు అని బయటకు రాగా.. వారి వెనక అధికార పార్టీ నేతలు అనే గుస గుస వినిపిస్తోంది. కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ నలుగురు వడ్డి వ్యాపారులేనని పేర్కొన్నారు. వడ్డి వ్యాపారులకు బీజేపీ ఎంపీ అరవింద్, టీఆర్ఎస్ నేత అండదండలు ఉన్నాయని ఆరోపించారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ సరికాదు
ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయురాలు కుటుంబాన్ని పరామర్శించకుండా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా పాతరపెడితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఉద్యోగ సంఘాలు కేసీఆర్ ఎంగిలి మెతుకులకు ఆశ పడవద్దని హితవు పలికారు. 317 జీవోను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సూసైడ్
నిజామాబాద్ వ్యాపారి కుటుంబం ఏపీలోని విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబం చావుకి నలుగురు కారణం అంటూ పప్పుల సురేశ్ లేఖ రాశారు. గణేశ్ కుమార్, వినీత, చంద్రశేఖర్, సాయిరాం మనోహర్ పేర్లను సూసైడ్ నోట్లో రాశారు. అప్పుల బాధలు.. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ఆగడాలు భరించలేక సురేష్ కుటుంబం బలవన్మరణానికి పాల్పడిందనే ఆరోపణలు వస్తున్నాయి. సురేశ్, శ్రీలత దంపతులు తమ ఇద్దరు కుమారులు అఖిల్, ఆశిష్‌తో కలసి నిజామాబాద్‌లోని గంగస్థాన్ ఫేజ్-2లోని ఓ అపార్ట్మెంట్లో ఉండేవారు.

మెడికల్ షాపులు
నిజామాబాద్‌లో రెండు మెడికల్ షాపులను సురేశ్ నిర్వహించేవాడు. పెద్ద కొడుకు అఖిల్ కొద్దికాలంగా ఓ పెట్రోల్ బంకు లీజుకు తీసుకున్నారు. చిన్న కొడుకు ఆశిష్ బీ ఫార్మసీ చదువుతున్నాడు. వ్యాపార రీత్యా సురేష్ కుటుంబానికి భారీగా అప్పులు పేరుకుపోయాయి. సుమారు రూ.4 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దికాలంగా అప్పులు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడం.. కొద్దిరోజుల కిందట కొడుకు నడిపిస్తున్న పెట్రోల్ బంకుకి వచ్చి కొందరు బెదిరించి వెళ్లడంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైనట్లు చెబుతున్నారు.

అమ్మవారి సేవలో
బెజవాడ దుర్గమ్మ దర్శనం కోసం సురేష్ కుటుంబం విజయవాడ వచ్చింది. స్థానిక కన్యకాపరమేశ్వరి సత్రంలో గది అద్దెకు తీసుకుంది. అదే సమయంలో నిజామాబాద్‌లో తాము నివాసం ఉంటున్న ఫ్లాట్‌ని ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ జప్తు చేసిందని తెలియడంతో కుటుంబం మానసికంగా కుంగిపోయింది. ఆ అవమానం భరించలేక.. తిరిగి ఇంటికి వెళ్లలేక అఘాయిత్యానికి పాల్పడింది. బంధువులకు మెసేజ్ చేసి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

ఆస్తులు అప్పులకే
ఆస్తులన్నీ అప్పులకే పోగా.. ఇంకా కట్టాల్సిన బకాయిల కోసం అప్పుల వాళ్లు ఎదురు చూస్తుండటంతో సురేశ్ కుటుంబం ఒత్తిడికి లోనైంది. అప్పులు తీర్చాలన్న ఒత్తిడి తీవ్రం కావడం, మరోవైపు ఇంటిని సీజ్ చేయడంతో అవమానంగా భావించిన సురేశ్ కుటుంబం అర్థాంతరంగా తనువు చాలించింది. తమ ఫ్లాట్‌పై సురేశ్ సుమారు రూ.30 లక్షల మేర అప్పు చేసినట్లు తెలిసింది. సురేశ్ కుటుంబం 15 రోజుల క్రితమే ఊరు వదిలి వచ్చినట్లు తెలిసింది. ఎంతో ఆనందంగా, అందరితో బాగా ఉండే సురేష్ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర వేదనకు గురి చేసిందని స్థానికులు కంటతడి పెట్టారు. వ్యాపారి కుటుంబం ఆత్మహత్య కేసులో ఓ రాజకీయ నేత పేరు బయటకు వచ్చింది. అప్పుల కోసం సురేశ్ కుటుంబాన్ని నలుగురు వ్యక్తులు వేధించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ నలుగురి పేర్లను పోలీసులు రికార్డులో నమోదు చేశారు.