కవితకు మంత్రుల శుభాకాంక్షల వెల్లువ ... ఎమ్మెల్సీగా రాష్ట్ర రాజకీయాల్లోకి స్వాగతం అంటూ
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కవితకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కవితకు స్వాగతం పలుకుతున్నారు. ఎమ్మెల్సీగా మండలిలో మహిళల బలోపేతానికి, రాష్ట్రంలో పార్టీని ముందుకు నడిపించడానికి కవిత కృషి చేస్తారని పలువురు మంత్రులు చెప్తున్నారు.
కవిత గెలుపు ...అన్ని ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ .. మంత్రులు హరీష్ ,ఎర్రబెల్లి మొదలెట్టేశారుగా!!

బీజేపీ కాంగ్రెస్ లకు డిపాజిట్లు రాలేదు .. కవిత గెలుపుపై మంత్రి ప్రశాంత్ రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత విజయం సాధించిన సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో సంబరాల్లో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కవితకు ఇంత ఘనవిజయాన్ని అందించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు చెప్పారు. పార్టీలకతీతంగా 90శాతం పైగా ఓట్లు కవితకు వేశారని సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. బీజేపీ కాంగ్రెస్ లకు డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు.

పార్లమెంట్ ఎన్నికల్లో పొరబాటు చేశామని ప్రజలకు ఇప్పుడు అర్ధమైందన్న మంత్రి
గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను, రైతులను డూప్లికేట్ బాండ్ పేపర్ లు రాసి మోసం చేసిన వ్యక్తిని గెలిపించి పొరబాటు చేశామని జిల్లా ప్రజలకు అర్థమై ఇప్పుడు కవితకు ఘనవిజయం కట్టబెట్టారని పేర్కొన్నారు. ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు తమ కంచెలను తెంచుకుని మరీ కవితకు మద్దతు పలికారని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బిజెపి రైతులను మోసగించిన పార్టీ అని, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయిందని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పార్టీ విజయం పై హర్షం వ్యక్తం చేశారు.

కవిత విజయంపై కొప్పుల ఈశ్వర్ ,సత్యవతి రాథోడ్ హర్షం
కవిత విజయం పై మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతోషం వ్యక్తం చేశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని తాజాగా నిజామాబాదు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తీర్పుతో అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు ఏవి జరిగినా కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు గల్లంతే అంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
కల్వకుంట్ల కవిత నేడు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించడం పట్ల అభినందనలు తెలిపారు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. తెలంగాణ శాసన మండలిలో కవిత రాక మహిళలకు మరింత బలం చేకూరుస్తుందని ,మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రిగా కవితగారిని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాని తెలిపారు.

కేవలం స్వార్ధ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాల రాజకీయాలు
రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు టి.ఆర్.ఎస్ దేనని మరోసారి కవిత విజయం నిరూపించిందని, త్వరలో జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే విజయం పునరావృతం అవుతుందన్నారు.
సిఎం కేసీఆర్ పాలన పట్ల ప్రజలు సంతోషంతో ఉన్నారని ,ప్రజలు చూపుతున్న ఈ నమ్మకం, విశ్వాసంతో ముఖ్యమంత్రి కేసిఆర్ మరిన్ని ప్రజపయోగ కార్యక్రమాలు చేపడుతూ నిత్యం తెలంగాణ ప్రజలకు దగ్గరవుతున్నారని సత్యవతి రాథోడ్ కేసీఆర్ పాలనకు కితాబిచ్చారు .
కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తూ, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలు రోజురోజుకు ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు .