రక్తమోడిన కామారెడ్డి రహదారులు.. రెండు ప్రమాదాల్లో 8 మంది మృత్యువాత
కామారెడ్డి జిల్లాలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. యాక్సిడెంట్లలో మొత్తం 8 మంది దుర్మరణం పాలయ్యారు. వారి కుటుంబాలకు తీరాని శోకాన్ని మిగిల్చారు. వేగం వద్దు ప్రాణం ముద్దు అని రవాణా శాఖ చెబుతున్న.. తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో అర్థాంతరంగా తనువు చాలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్ మండలం జగన్నాథపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో ఆరుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్వాలీస్ వాహనం లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి క్వాలీస్ వాహనం ఢీకొట్టింది. దీంతో క్వాలీస్ వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులందరూ హైదరాబాద్కు చెందిన వారుగా గుర్తించారు.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బిచ్కుంద నుంచి పిట్లం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వివరించారు. మృతుల వద్ద లభించిన గుర్తింపు కార్డుల ద్వారా వారి వివరాలను సేకరిస్తున్నారు.
జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించిన సంఘటన మరువక ముందే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. జుక్కల్ మండలం ఖండే బల్లుర్లో మరో యాక్సిడెంట్ జరిగింది. కల్టివేటర్ను బైక్ ఢీ కొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను కెంరాజ్ కల్లాలి గ్రామ వాసులుగా గుర్తించారు.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం జగన్నాథపల్లి గేట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందించాలని కోరారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు.