క్షమాపణ చెప్పి, ముక్కునేలకు రాయాలి: కేటీఆర్‌పై షర్మిల ఫైర్
వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 64లక్షల రైతులకు రుణమాఫీ చేశారని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు.. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని తొలుత ఆలోచన చేసిన నేత వైఎస్ఆర్ అని చెప్పారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేశారని.. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించారని చెప్పారు. పేదింటి బిడ్డలు ఉన్నత విద్య అందించాలనే ఉద్దేశంతో ఎన్నో విద్యాసంస్థలు, యూనివర్సిటీలు నెలకొల్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఉచిత విద్య అందించారు.వైయస్ఆర్ హయాంలో ఎంతో మంది పేదలు.. డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. పేదవాడికి జబ్చు చేస్తే ఆ కుటుంబం మొత్తం అప్పుల పాలవుతుందని, ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించారు. ఫోన్ చేసిన 20 నిమిషాలకే పేద వాడి ఇంటి ముందు అంబులెన్స్ తెచ్చిన గొప్ప నాయకుడు మన వైఎస్ఆర్ అని చెప్పారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో నిరుద్యోగ నిరహార దీక్షను షర్మిల చేపట్టారు.

సాగునీరు
వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుత్పా ఆలీసాగర్ ప్రాజెక్టు నిర్మించి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారు. కాలువల ద్వారా నిజామాబాద్ ప్రజలకు తాగు నీరు అందించారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టింది కూడా వైయస్ఆర్ గారే. ఇప్పుడు కాళేశ్వరం అని చెప్పుకుంటున్న 22వ ప్యాకేజీ పనులకు అప్పట్లోనే వైయస్ఆర్ గారు శంకుస్థాపన చేశారు. బోధన్ ప్రజల 30 ఏండ్ల కల అయిన సాలూరు ప్రాజెక్టును నిర్మించింది కూడా మన వైయస్ఆర్ గారే. నిజామాబాద్‌కు ఎయిర్ పోర్టు తీసుకురావాలన్నది వైయస్ఆర్ గారి కల. ఈ జిల్లాకు ఐటీ ప్రాజెక్టులు కూడా తేవాలనుకున్నారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి, మళ్లీ పునర్ వైభవం తేవాలనుకున్నారు. టర్మరిక్ ఫ్యాక్టరీ పెట్టాలని, అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించింది కూడా వైఎస్ఆర్ అని చెప్పారు.

అనుకున్నది అనుకున్నట్టు..
వైఎస్ఆర్ బతికే ఉంటే ఆయన అనుకున్న ప్రతీ కార్యక్రమం జరిగేది. మన దురదృష్టం కొద్దీ ఆయన వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయాక ఇక్కడి పసుపు రైతుల గురించి పట్టించుకునే నాయకుడే లేడు. దేశంలోనే అత్యధికంగా పసుపు ఉత్పత్తి అయ్యే జిల్లాల్లో నిజామాబాద్ జిల్లా ఒకటి. అయినా ఇక్కడ పసుపు బోర్డు లేదు. ఇందుకు నిరసనగా గతంలో నిజామాబాద్ పసుపు రైతులు మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో నామినేషన్లు వేసి, యావత్ దేశాన్ని ఆకర్షించారు. దేశమంతా సమస్య తెలియజేశాలే చేశారు. ఇక్కడి రైతులకు అన్యాయం చేశారని ఏకంగా దొర బిడ్డనే ఓడించిన చరిత్ర నిజామాబాద్ రైతులది. ఇందుకు నిజామాబాద్ ప్రజలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రజా సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాలు సైతం అదే తోవలో ఉన్నాయి. ఇక్కడి బీజేపీ ఎంపీ ఎన్నికల సమయంలో మాటలతో చెప్తే నమ్మరని, బాండ్ పేపర్ రాసి పసుపు బోర్డు తెస్తానని చెప్పారు. కానీ ఎన్నికల్లో గెలిచాక.. తాటాకు అడిగితే ఈతాకు ఇచ్చినట్లుగా బీజేపీ ఎంపీ మాత్రం పసుపు బోర్డు తేలేదు.

షుగర్ ఫ్యాక్టరీ పేరు
ఉద్యమ సమయంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన కేసీఆర్, ఏడేండ్లుగా అధికారంలో ఉన్నా ఇటువైపు కన్నెత్తి చూడలేదు. ఇక్కడి కార్మికులకు ఉపాధి కరువై, గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. అక్కడ దురదృష్టవశాత్తు చనిపోతే, వారిని స్వదేశానికి తీసుకెచ్చే తీరిక కూడా కేసీఆర్ కు లేదు. కేసీఆర్ హయాంలో ఏడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వందలాది మంది నిరుద్యోగులు ప్రాణాలు తీసుకున్నారు. తెలంగాణలో దాదాపు 91శాతం మంది రైతులకు ఒక్కొక్కరిపై లక్షన్నర అప్పు ఉంది. కేసీఆర్ గారు 4లక్షల కోట్లు అప్పులు చేసినా రుణమాఫీకి పైసల్లేవు అంటున్నారు. ఆరోగ్యశ్రీకి, ఫీజు రీయింబర్స్ మెంట్‌కు నిధులు లేవు అంటున్నారు. సంక్షేమ పథకాలకు, ఉద్యోగుల జీతాలకు కూడా డబ్బులు లేవు అంటున్నారు. మరి ఇదంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది?

అప్పుల తెలంగాణ
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి గారు రాస్తే.. ఇప్పుడు కేసీఆర్ నా తెలంగాణ ఆత్మహత్యలు, అప్పుల తెలంగాణ అని రాస్తున్నారు. నా తెలంగాణ తాగుబోతుల, బీర్లు, బార్ల తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారు. కేసీఆర్ హయాంలో డిగ్రీలు, పీజీలు చదివిన వాళ్లంతా నేడు ఉద్యోగాలు లేక రోడ్ల మీద టిఫిన్ సెంటర్లు పెడుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్ముకుంటున్నారు. నిరుద్యోగులేమో హమాలీ పనులు చేసుకోవాలట.. కేసీఆర్, ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏలుతారట. అయిదో తరగతి చదివిన వాళ్లు మంత్రులు అవుతారట. ఇదెక్కడి న్యాయం?

క్షమాపణలు చెప్పాల్సిందే
మొన్న మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో రెండు శాతం కంటే ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పారు. ప్రజలకేమో రెండు శాతం దాటి ఉద్యోగాలు ఇవ్వరట.. కేసీఆర్ కుటుంబానికి మాత్రం వంద శాతం ఉద్యోగాలా? అసెంబ్లీలో కేటీఆర్ తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడారు. కష్టపడే తత్వం లేదని చెబుతున్నారు. తెలంగాణ ప్రజలు, యువకులు కష్టపడకుండానే తెలంగాణ సాధ్యమైందా? వాళ్లు కష్టపడితేనే కదా కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది? కేటీఆర్ భేషరతుగా ముక్కు నేలకు రాసి, క్షమాపణ చెప్పాలి. నిజానికి సోమరిపోతులు కేసీఆర్ . ఒక్కరోజు కూడా సచివాలయానికి రాకుండా ఫాం హౌజ్‌లో ఉంటూ పాలన సాగించారు. కేసీఆర్ మీకు చాతకాకపోతే రాజీనామా చేసి, దళితున్ని సీఎం చేయండి. కేసీఆర్ కు ఉద్యోగాలు ఇవ్వడం చేతకాదు. ఉపాధి కల్పించడం చేతకాదు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వడం చేతకాదు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడం చేతకాదు. ఇకనైనా కేసీఆర్ రాజీనామా చేసి, ఒక దళితున్ని ముఖ్యమంత్రిని చేసి, తెలంగాణ ప్రజల నెత్తిన పాలు పోయాలని డిమాండ్ చేశారు.

మేమున్నాం..
నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ తరఫున మేం పోరాటం చేస్తున్నాం అని షర్మిల వివరించారు. మీకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. హుజూరాబాద్ లో మేం వంద మందిని ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులను నామినేషన్లు వేస్తుంటే ఇది ఓర్వలేని ప్రభుత్వం వారిని బెదిరిస్తోంది. పోలీసులతో అరెస్టు చేయించి జైలులో పెడుతోంది.కేసీఆర్ ను వైయస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇకనైనా ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి. కొత్త జిల్లాలు, మండలాల్లో ఉన్న 3లక్షల 85వేల ఖాళీలను సైతం భర్తీ చేయాలి. నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇవ్వాలి. 54లక్షల మంది నిరుద్యోగులు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు చేయాలి. అర్హులకు కార్పొరేషన్ లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించాలి.

ఇళ్ల నిర్మాణం..
ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం 45లక్షల ఇండ్లు నిర్మిస్తే.. వైఎస్ఆర్ 46 లక్షల పక్కా ఇండ్లు కట్టించి ఇచ్చారన్నారు. ఒక్క చార్జీ కూడా పెంచకుండా సంక్షేమ పాలన అందించి రికార్డు ముఖ్యమంత్రి మన వైఎస్ఆర్ అని తెలిపారు. ఐదేళ్లలో మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి, లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. 2008లో జంబో డీఎస్సీతో 54వేల ఉద్యోగాలు భర్తీ చేసిన మహనీయుడు అని.. ప్రభుత్వ రంగంలోనే కాక ప్రైవేటు రంగంలోనూ 11లక్షల ఉద్యోగాలు సృష్టించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా పేదలకు లోన్లు ఇచ్చి, స్వయం ఉపాధి కల్పించారు. ఇలా అన్ని వర్గాల ప్రజలకు వైయస్ఆర్ గారు మేలు చేశారు. వైయస్ఆర్ హయాంలో ఏ ఒక్క విద్యార్థి గాని, ఏ ఒక్క నిరుద్యోగి గానీ ఆత్మహత్య చేసుకోలేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి నిరుద్యోగుల గురించి ఆలోచించారని ఫైరయ్యారు.

నిరుద్యోగం
మహిళలంటే పట్టింపు లేదు. పేదలంటే లెక్కలేదు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగం ఏడింతలు పెరిగిందన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి, కేవలం 3 లక్షల మందికి మాత్రమే చేశారు. ఇంకా 36 లక్షల మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. బ్యాంకుల్లో అప్పులు తీరక, కొత్తలోన్లు రాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు చదువుకుందామంటే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకుండా ప్రైవేటు హాస్పిటళ్లకు కోట్ల ఫీజులు దోచిపెట్టారు. వైద్యం కోసం పేదలు అల్లాడుతున్నా.. పట్టించుకోలేదు. కేసీఆర్ కు కరోనా వస్తే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకున్నారు. పేదలేమో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం అల్లాడిపోయారు.