సముద్ర తీర ప్రాంతాల్లో ఫైటింగ్ .. చీరాలలో టెన్షన్ .. మత్స్యకారుల మధ్య ఘర్షణకు కారణం ఇదే !!
ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్రతీరం ఉద్రిక్తంగా మారింది. నిన్న వాడరేవు మత్స్యకారులపై, కఠారి వారి పాలెం మత్స్యకారులు దాడి చేశారు . ఒకరిపై ఒకరు కర్రలతో దాడులకు పాల్పడ్డారు.
వాడరేవు, కఠారి వారి పాలెం మత్స్యకారుల మధ్య ఘర్షణకు అసలు కారణం ఏంటి ? మత్స్య కారులు ఒకరిపై ఒకరు దాడులకు ఎందుకు పాల్పడుతున్నారు ?

రెండు నెలలుగా వాడరేవు ,కఠారి పాలెం మత్స్య కారుల మధ్య పోరు
ఇక అసలు విషయానికి వస్తే దాదాపు రెండు నెలలుగా వాడరేవు ,కఠారి పాలెం మత్స్య కారుల మధ్య పోరు నడుస్తోంది. చేపల వేటకు ఉపయోగించే వల విషయంలోనే అక్కడ వివాదం నెలకొంది.వాడరేవు మత్స్యకారులు బల్లవల ఉపయోగిస్తుండగా కఠారి పాలెం జాలరి అయిన ఐలవల వాడాలని వాదిస్తున్నారు. బల్లవల కారణంగా చేపలతోపాటు గుడ్లు కూడా బయటకొచ్చి మత్స్యసంపద నశించిపోతుందని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే బల్ల వల్ల వాడకానికి ప్రభుత్వ అనుమతి ఉన్నందున తాము అదే వాడుతామన్నది వాడరేవు మత్స్యకారుల వాదన.
ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం .. సముద్రంలో నుండి కొట్టుకొస్తుందని ఎగబడ్డ జనం

సముద్ర జలాల్లోనే సినీ తరహాలో ఛేజింగులు
ఈ క్రమంలో పరస్పరం వారు ఘర్షణకు దిగుతున్నారు. పడవలను, వలలను ఎత్తుకెళ్లిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. సముద్ర జలాల్లోనే సినీ తరహాలో ఛేజింగులు కూడా జరిగాయి. ఇటీవల ఈ నెల రెండవ తేదీన అధికారులు ఒంగోలులో ఇరుగ్రామాల మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఆ సమావేశంలో కూడా మత్స్యకారుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.సముద్ర తీరంలో ఇరు గ్రామాల మత్స్యకారుల మధ్య అదే పరిస్థితి కొనసాగింది. శుక్రవారం నాడు మరో ప్రయత్నం చేసే క్రమంలో అధికారులు కఠారి పాలెం వచ్చారు.

అధికారుల సమావేశానికి హాజరు కాని వాడరేవు మత్స్య కారులు ..కఠారి వారి పాలెం మత్స్యకారులు దాడి
వాడరేవు మత్స్యకారులు అధికారులు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి హాజరుకాకుండా వేటకు వెళ్లగా వారిని పట్టుకొస్తామంటూ అధికారులు, పోలీసుల ముందే కఠారి పాలెం వారు సముద్రంలోకి వెళ్లారు.ఆ తర్వాత గంటల వ్యవధిలోనే జరిగిన పరిణామాల నేపథ్యంలో వాడరేవు గ్రామంపై కఠారి వారి పాలెం మత్స్యకారులు దాడి చేసి పది మందిని గాయపరిచారు. భయానక వాతావరణం సృష్టించారు.
ఇంత జరుగుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు.

పలువురికి గాయాలతో తీవ్ర ఉద్రిక్తత .. సముద్రతీర ప్రాంతంలో టెన్షన్
ఈ దాడులలో మాజీ సర్పంచ్ రమణ సహా పలువురు మత్స్యకారులకు తీవ్రగాయాలయ్యాయి. మత్స్యకారుల మధ్య నెలకొన్న ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
వాడరేవు , కఠారి వారి పాలెం మత్స్యకారులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు దిగడంతో సముద్రతీర ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. స్పెషల్ పార్టీ పోలీసులతో వాడరేవు, కఠారి వారి పాలెం లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

అధికారులు , ప్రజా ప్రతినిధులు సమస్య పరిష్కరించకుంటే సముద్రంలో సమరమే !!
తమ ముందే సముద్రంలోకి వెళ్లిన కఠారి పాలెం మత్స్యకారులను అధికారులు, పోలీసులు వెళ్ళకుండా ఆపి ఉంటే గొడవ ఇంతవరకూ వచ్చేది కాదన్న చర్చ స్థానికంగా జరుగుతుంది . రెండు గ్రామాల మత్స్యకారుల మధ్య నెలకొన్న వివాదం పరిష్కరించేందుకు మత్స్యశాఖ అధికారులతో పాటూ మెరైన్ పోలీసులు కఠారివారిపాలెం చేరుకున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించకుంటే ముందు ముందు మరింత తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని, సముద్రంలో సమరం జరిగే అవకాశం లేకపోలేదని మత్స్యకారులు అంటున్నారు.