ఏపీలో 'నకిలీ సర్టిఫికెట్స్' దందా.. ఎవరా గ్యాంగ్,అసలేం చేస్తున్నారు... విస్తుపోయే విషయాలు...
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టయింది. ఏపీలోని 11 జిల్లాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేసుకుని దేశవ్యాప్తంగా ఫేక్ సర్టిఫికెట్ల దందా నడుపుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ(JNTU) పేరును పోలిన జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ సెంటర్(JNTC) అనే ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి దాదాపు 500 కోర్సులకు సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నారు. ఈ దందాకు సంబంధించి పోలీసులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఎవరా గ్యాంగ్....
జనాలను కన్ఫ్యూజ్ చేసి నకిలీ సర్టిఫికెట్లు విక్రయించేందుకే జేఎన్టీయూ పేరును పోలిన జేఎన్‌టీసీని ఏర్పాటు చేసినట్లు ప్రకాశం ఎస్పీ సిద్దార్థ కౌశల్ తెలిపారు. ఈ దందాకు సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇందులో జంపని వెంకటేశ్వర్లు(49),సిలారపు బాల శ్రీనివాసరావు(53),సిలారపు సుజాత(47),సిద్ది శ్రీనివాసరెడ్డి(25),కోడూరి ప్రదీప్ కుమార్(32),అనపర్తి క్రిస్టఫర్(47),బట్ట పోతుల వెంకటేశ్వరరావు(48) ఉన్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్లు 420,468,471ల కింద ఫోర్జరీ చీటింగ్,ఫోర్జరీ కేసులు నమోదు చేశారు.

500 కోర్సులు... ఇప్పటివరకూ 2400 సర్టిఫికెట్లు ఇష్యూ...
మూడు నెలల కోర్సుల నుంచి మూడేళ్ల డిగ్రీ వరకూ దాదాపు 500 కోర్సులకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను ఈ దందా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇందులో ఏవియేషన్,ఫైర్ సేఫ్టీ,హెల్త్ కేర్ వంటి కీలక రంగాలు కూడా ఉండటం గమనార్హం. ఇప్పటివరకూ 11 రాష్ట్రాల్లో దాదాపు 2400 నకిలీ సర్టిఫికెట్లను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 1900 సర్టిఫికెట్లు విక్రయించినట్లు గుర్తించారు. ఈ నంబర్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సర్టిఫికెట్లను ఉపయోగించి ప్రభుత్వ,ప్రైవేట్ సెక్టార్లలో అక్రమంగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉండటంతో... ప్రజాప్రయోజనాల రీత్యా వెనువెంటనే దీన్ని బహిర్గతం చేసినట్లు తెలిపారు.

కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ పేరుతో...
ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ ముఠాకు 155 బ్రాంచీలు ఉన్నట్లు గుర్తించారు. చాలాచోట్ల కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ లేదా ఆ తరహా సెటప్‌తో వీటిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒంగోలులో శ్రీనివాస కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ పేరుతో ఈ దందా నడుపుతున్నారని.... డబ్బులు తీసుకుని ల్యాబ్ టెక్నీషియన్ డిప్లోమా,డిప్లోమా ఇన్ అగ్రికల్చర్ తదితర కోర్సులకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ రాకెట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దాన్ని బయటపెట్టేందుకు ఆయా జిల్లాల పోలీసులను అప్రమత్తం చేసినట్లు ఒంగోలు ఎస్పీ తెలిపారు.

ఇలా బయటపడింది....
ఇటీవల ఫర్టిలైజర్ షాప్‌లో తనిఖీలకు వెళ్లిన సందర్భంగా పోలీసులు నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌ను గుర్తించారు. సాధారణంగా ఫర్టిలైజర్ షాప్ నిర్వహించేవారికి అగ్రికల్చర్ డిప్లొమా సర్టిఫికెట్ ఉండాలి. అయితే అతనిపై అనుమానం కలగడంతో అతని సర్టిఫికెట్‌ను పరిశీలించగా అది ఫేక్ డిప్లొమా సర్టిఫికెట్ అని తేలింది. దీంతో తీగ లాగగా డొంకంతా కదిలినట్లు.... కేసులో ముందుకెళ్తున్న కొద్ది పలు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. రూ.2వేలు మొదలు రూ.8వేలకే ఏ కోర్సు సర్టిఫికెట్ అయిన అందజేస్తున్నట్లు గుర్తించారు.

సిట్ దర్యాప్తు..?
ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి కుమారుడిగా గుర్తించారు. కేరళలో ఫేర్&సేఫ్టీ ట్రైనింగ్ రంగంలో పనిచేస్తున్నప్పుడు ఈ దందాకు తెరలేపినట్లు గుర్తించారు. ఇలా ఫైర్&సేఫ్టీ లాంటి ఫేక్ సర్టిఫికెట్లను పొంది పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేవారు... రేప్పొద్దున ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే ఎలా దాన్ని అరికట్టగలరని ఎస్పీ కౌశల్ ప్రశ్నిస్తున్నారు. ఏవియేషన్,హెల్త్ కేర్ వంటి కీలక రంగాల కోర్సులకు కూడా నకిలీ సర్టిఫికెట్లు ఇష్యూ చేయడం దారుణమన్నారు. ఈ కేసును సిట్‌తో దర్యాప్తు చేయించే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.