తాడేపల్లికి చేరిన పర్చూరు పంచాయితీ ... రామనాధంబాబు టార్గెట్
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రోడ్డున పడుతున్నాయి. పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పొగ పెడుతూ రామనాథంబాబును పార్టీలో చేర్చుకోవడం పై దగ్గుపాటి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఏకంగా పర్చూరు నియోజకవర్గ ఇంచార్జ్ పంచాయతీని తాడేపల్లికి తీసుకువచ్చారు దగ్గుపాటి అనుయాయులు.

హాట్ హాట్ గా పర్చూరు రాజకీయాలు
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ నియామక వ్యవహారం ఇప్పుడు చిలికిచిలికి గాలివానలా మారింది. పంచాయితీ రాజధానికి చేరింది. ఇంచార్జ్ ఎంపికపై గత కొన్ని రోజులుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం అందరికీ తెలుసు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ పర్చూరు నియోజకవర్గంలో పట్టుకోసం,కుమారుడు హితేష్ చెంచురాం రాజకీయ భవిష్యత్తు కోసం దగ్గుపాటి వెంకటేశ్వర రావు పర్చూరు నియోజకవర్గంలో కీలకంగా పనిచేస్తున్నారు.
వైసీపీలో చేరికపై స్పందించిన దగ్గుపాటి పురంధరేశ్వరి ... ఒత్తిడి నిజమే కానీ ...

దగ్గుపాటికి తలనొప్పిగా ఇంచార్జ్ నియామక వ్యవహారం
ఇక ఇదే సమయంలో ఆయన వ్యవహార శైలి నచ్చని కొందరు వైసిపి నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గుపాటి వెంకటేశ్వర రావు ఒంటెద్దు పోకడలపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పరిణామాలలో భాగంగా దగ్గుపాటి వైసీపీ లో చేరడానికి ముందు వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జ్ అయిన రావి రామనాథంబాబు పర్చూరు నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించారు. దగ్గుపాటి చేరికను వ్యతిరేకిస్తూ ఆయన ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు.

రావి రామనాధంబాబు ఎంట్రీతో రసవత్తర రాజకీయం
ఇక తాజాగా రావి రామనాథం బాబును తిరిగి వైసిపి లోకి చేర్చుకోవడం,అదేవిధంగా దగ్గుపాటి ఫ్యామిలీ అంతా ఒకే పార్టీలో ఉండాలని షరతు విధించడం, నియోజకవర్గ ఇంచార్జ్ ఎవరు అనేదానిపై ఎటూ తేల్చకపోవడం వంటి అంశాలు దగ్గుపాటి వెంకటేశ్వర రావుకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఎప్పుడైతే రావి రామనాథం బాబు ఎంట్రీ ఇచ్చారో అప్పటినుండి దగ్గుపాటి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఇదే సమయంలో పురందరేశ్వరి పార్టీలోకి తీసుకురావాలని దగ్గుపాటిపై ఒత్తిడి కూడా పెట్టినట్లుగా తెలుస్తుంది.ఈ నేపథ్యంలోనే దగ్గుపాటి ప్రత్యక్ష రాజకీయాలనుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

పర్చూరు పంచాయితీపై రంగంలోకి వైవీ సుబ్బారెడ్డి, సజ్జల
ఇదే సమయంలో పర్చూరు పంచాయితీ తాడేపల్లి కి చేరింది. దగ్గుబాటి వెంకటేశ్వర రావు మద్దతుదారులు రావి రామనాథం బాబుకు నియోజకవర్గ ఇంచార్జ్ అవకాశం ఇస్తే ఊరుకోమని ఆందోళనకు దిగారు. గొట్టిపాటి భరత్ కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని కొందరు నేతలు సైతం పట్టుబడుతున్నారు.మరి కొందరు నేతలు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కి జై కొడుతున్నారు. అయితే ఈ పంచాయతీని పరిష్కరించాలని, హై కమాండ్ సజ్జల రామకృష్ణా రెడ్డి కి, వై వి సుబ్బారెడ్డి కి బాధ్యతలు అప్పగించినట్లు గా తెలుస్తుంది. వై వి సుబ్బారెడ్డి ,సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యకర్తల అభిప్రాయం తీసుకుని జగన్మోహన్ రెడ్డితో చర్చించనున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!