సినిమాలు చేసుకుంటే ఏ గోల ఉండదు కానీ.: ‘జై జనసేన’ అననంటూ పవన్ కళ్యాణ్
ప్రకాశం: తాను కూడా ఒంగోలు గోపాల్నగర్లో కొంత కాలం ఉన్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. బుధవారం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. కనిగిరిలో తాను ఉన్నప్పుడు నీళ్లలో ప్లోరైడ్ ఉందని.. తాగొద్దని అనేవారని.. ఆ సమస్య ఇప్పటి వరకు తీరకపోవడం బాధ కలిగిస్తోందన్నారు.
జగన్కు సీబీఐ కేసుల భయం, ఢిల్లీలో అందుకే రాజీ..: పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు
తాను సీఎం కావాలని పార్టీ పెట్టలేదని, ముఖ్యమంత్రిని అవుతానంటూ ఎప్పుడూ పగటి కలలు కనలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను 25ఏళ్ల కమిట్మెంట్తోనే రాజకీయ పార్టీని పెట్టానని, ఏదైనా సాధించాలంటే సమయం కావాలని అన్నారు. తాను కావాలనుకుంటే ఎమ్మెల్యేను, మంత్రిని అయ్యేవాడినేనని.. కానీ ప్రజలందరి కోసమే పార్టీ పెట్టానని చెప్పారు.
జగన్! అప్పుడే రోడ్లపైకి వచ్చేలా చేశారు: జనసేన ఓడిపోలేదంటూ పవన్ కళ్యాణ్

సినిమాలు చేసుకుంటే ఏ గోల ఉండదు..
ప్రస్తుతం రాజకీయాలు డబ్బులతో ముడిపడిపోయాయని.. పెద్దవాళ్ల చేతిలో ఇరుక్కుపోయిందని పవన్ అన్నారు. దాన్ని బద్దలుకొట్టాలంటే అందరి సహకారం కావాలన్నారు. తాను సినిమాలు చేసుకుంటే తనకు ఏ గోల ఉండేది కాదని.. కానీ బాధ్యత గల పౌరుడిగా తాను ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.

అలాంటి వ్యక్తిని కాదు..
ప్రకాశం జిల్లా నుంచి ఎంతో మంది నాయకులు వచ్చారు కానీ.. ఇక్కడి నుంచి వలసలు మాత్రం తగ్గలేదన్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమలు లేవని అన్నారు. తాను ఎన్నికల్లో ఓడిపోతే బెంబేలెత్తిపోయే వ్యక్తిని కాదని.. తన బలం మరింత పెరిగిపోతుందని అన్నారు.
బలమైన భావజాలంతో బతికే వ్యక్తిననని, ఆశయాలతో వచ్చానని చెప్పుకొచ్చారు.
టీడీపీ లాంటి పార్టీలకు భావజాలం లేదని, వ్యక్తులు బలంగా ఉన్నప్పుడే పార్టీలు ఉంటాయని.. ఆ తర్వాత ఉండవన్నారు.

ఎవరికీ తలవంచను..
తాను 25ఏళ్ల లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని.. తన తర్వాత కూడా పార్టీలో నాయకులు ఉండాలని, పార్టీని నడిపించాలని అన్నారు. డబ్బులు, సారా పంచని నాయకులు తమ పార్టీకి కావాలన్నారు. తాను కలలు కంటూనే ఉంటానన్నారు. అంతిమ శ్వాస వరకు పార్టీని నడుపుతానని, గెలిచినా ఓడినా ఎవరికీ తలవంచనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

జై జనసేన అనను అందుకే..
తాను జాతీయభావంతో పెరిగానని, తనకు దేశం, సమాజం ముఖ్యమని.. ఆ తర్వాతే పార్టీ అని పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే తాను తన ప్రసంగం ముగించేటప్పుడు జై జనసేన అనని.. జై హింద్.. భారత్ మాతాకీ జై అంటానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
పార్టీల కోసం దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టొద్దని అన్నారు.

అలాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే..
నేరాలు, ఆర్థిక నేరాలు చేసినవారు అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడాల్సి వస్తుందని అన్నారు పవన్ కళ్యాణ్. సీఎం జగన్కు ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని.., సీబీఐ కేసులున్న ఇలాంటి వ్యక్తులు రాష్ట్ర ప్రయోజనాల కోసం డిమాండ్ కూడా చేయలేరని అన్నారు. అయితే, తనకు జగన్మోహన్ రెడ్డితో గానీ, చంద్రబాబునాయుడుతో గానీ వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవన్నారు.

నేరాలు పెరిగిపోతున్నాయంటూ..
సీబీఐ కేసులున్న వ్యక్తి సీఎంగా ఉండటంతో ఇక రాష్ట్రంలో మంత్రులు, ఆ పార్టీ నేతలు ఎలా ఉంటారో తెలుసుకోవచ్చన్నారు. నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఓ పత్రికా విలేకిరపై దాడి చేశారని, మహిళా అధికారి మీద కూడా దాడి చేశారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని పొడిచారని అన్నారు. రాస్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!