చంద్రబాబు బుజ్జగించినా..డోన్ట్‌కేర్: వైసీపీలోకి మాజీమంత్రి శిద్ధా రాఘవరావు: కండువా రేపే
ఒంగోలు: కరోనా కల్లోలాన్ని రేపుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కకావికలమౌతోంది. వలసల బెడదను ఎదుర్కొంటోంది. గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో ఆరంభమైన ఈ వలసల పరంపరకు కరోనా కొంతకాలం పాటు కామా పెట్టగలిగిందేమో గానీ బ్రేక్ వేయలేకపోయింది. లాక్డౌన్ సడలింపులతో పాటు టీడీపీ నుంచి వలసల పర్వమూ మళ్లీ ప్రారంభమైంది.

శిద్ధా రాఘవరావు రేపే..
తాజాగా- తెలుగుదేశం పార్టీకే చెందిన మరో సీనియర్ నాయకుడు, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పబోతున్నారు. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకోబోతున్నారు. తన కుమారుడు సుధీర్‌తో కలిసి శిద్ధా రాఘవరావు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే వార్తలు ప్రకాశం జిల్లాలో గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ఆయన విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఒంగోలు లోక్‌సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డితో మంతనాలు సాగిస్తున్నారని చెబుతున్నారు.

ప్రకాశంలో టీడీపీ దాదాపుగా ఖాళీ..
శిద్ధా రాఘవరావు గుడ్‌బై చెప్పబోతున్నారంటూ వస్తోన్న వార్తలు ప్రకాశం జిల్లా టీడీపీలో కలకలం పుట్టిస్తున్నాయి. కనిగిరి మాజీ ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడైన కదిరి బాబురావు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ మరుసటి రోజే జిల్లాకే చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్, మాజీమంత్రి పాలేటి రామారావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ కండువాను కప్పుకొన్నారు. పార్టీ ఆవిర్బావం నుంచీ ఉంటోన్న కరణం బలరాం సైతం ముఖ్యమంత్రిని కలిశారు. తన మద్దతు తెలిపారు.

కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే..
శిద్ధా రాఘవరావు తన కుమారుడు సుధీర్ కుమార్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పార్టీ ఫిరాయిస్తున్నారని అంటున్నారు ప్రకాశం జిల్లావాసులు. భవిష్యత్తులో శిద్ధా రాఘవరావు తనకు బదులుగా తన కుమారుడిని రాజకీయ తెరపైకి తీసుకుని వస్తారని చెబుతున్నారు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన శిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్ కుమార్ ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి రాఘవరావు, కనిగిరి అసెంబ్లీ సీటు నుంచి సుధీర్ కుమార్ పోటీ చేసి ఓడిపోయారు.

పార్టీకి దూరంగా..
ఎన్నికల్లో పరాజయాన్ని చవి చూసిన అనంతరం శిద్ధా రాఘవరావు కుటుంబం టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించింది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడం, కరణం బలరా వంటి నాయకుడే పార్టీని ఫిరాయించాల్సిన పరిస్థితి ఎదురు కావడంతో.. శిద్ధా రాఘవరావు కూడా ఆయన బాటలోనే నడవాలని, కుమారుడితో కలిసి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

చంద్రబాబు బుజ్జగించినా..
నిజానికి- మార్చిలోనే శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరాల్సి ఉండేది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభం కావడంతో ఆయన చేరికకు బ్రేక్ పడింది. ఆయన పార్టీ ఫిరాయిస్తున్నారనే సమాచారం అందడంతో చంద్రబాబు నాయుడు బుజ్జగించారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించుకుని మరీ నచ్చజెప్పారు. అప్పట్లో తాను పార్టీ మారబోవట్లేదంటూ శిద్ధా రాఘవరావు స్పష్టం చేశారు. చంద్రబాబు ముందు తాను కొన్ని డిమాండ్లు ఉంచానని వాటిని నెరవేర్చితే, పార్టీలోనే కొనసాగుతానని అన్నారు. అవేవీ తీరకపోవడం వల్లే పార్టీలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నట్లు సమాాచారం.