స్కూల్స్ లో కరోనా ... పునః ప్రారంభమైన రెండు రోజుల్లోనే.. ఆలోచనలో జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్స్ పునః ప్రారంభమైన రెండు రోజులకే కరోనా కలకలం సృష్టించడం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసింది. ప్రకాశం జిల్లాలో నాలుగు జడ్పీ హైస్కూల్స్ లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపింది. స్కూల్స్ లో కరోనా నిబంధనలను పాటించినప్పటికీ , స్కూల్స్ ప్రారంభించిన రెండు రోజులకే టీచర్లు ,విద్యార్థులు కోవిడ్ బాధితులుగా మారడంతో తల్లిదండ్రులకు టెన్షన్ పట్టుకుంది. స్కూల్స్ కు పంపించాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
ఏపీలో తొలిరోజు స్కూల్స్ .. కరోనా నిబంధనల్లోనూ 80 శాతం హాజరైన విద్యార్థులు : మంత్రి ఆదిమూలపు సురేష్

కరోనా కట్టడి కోసం ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
తాజా పరిస్థితిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. ప్రభుత్వ స్కూల్స్ లో కరోనా వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. దీని కోసం ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో స్కూల్స్ లో గుర్తించిన కేసులు రెండు రోజుల క్రితం టెస్ట్ నిర్వహించిన వారికి వచ్చిన కేసులుగా మంత్రి పేర్కొన్నారు . కరోనా పాజిటివ్ గా గుర్తించిన విద్యార్థులు, టీచర్లను వెంటనే ఐసోలేషన్ కు పంపించామని మంత్రి పేర్కొన్నారు.

కేసులు పెరిగితే తదుపరి నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి సురేష్
మూడు వారాల తర్వాత తొమ్మిది , పది తరగతుల నిర్వహణ పై సమీక్ష చేస్తామని మంత్రి చెప్పారు.
కరోనా కేసులు బాగా పెరుగుతుంటే, పెరుగుతున్న కేసులు దృష్టిలో పెట్టుకొని తదుపరి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని, కట్టుదిట్టంగా కోవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్తున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

స్కూల్స్ లో కరోనా కేసులు .. భయపడుతున్న తల్లిదండ్రులు
రాష్ట్రంలో నవంబర్ 2 న స్కూల్స్ ప్రారంభం అయ్యాయి . మొదటి రోజు బాగానే విద్యార్థులు హాజరు ఉండగా క్రమంగా హాజరు తగ్గుతూ వస్తుంది . దాదాపు వంద శాతం పాఠశాలలు తెరుచుకున్నాయి, అయినా కరోనా కారణంగా చాలా మంది ఇంకా భయపడుతున్నారు. గత రెండు రోజుల నుంచి సగటున 40 శాతం హాజరు ఉన్నట్లుగా మంత్రి చెప్పారు.
ఇక స్కూల్స్ లో కరోనా కేసులు పెరిగితే మాత్రం విద్యార్థులు స్కూల్స్ కు రావటం డౌటే అని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో తగిన చర్యలకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.