సీఎం ఆఫీసు నుంచి వచ్చా.. ఎమ్మార్వో చైర్లో కూర్చుని హల్చల్, చివరకు కటకటాల్లోకి
రాజమహేంద్రవరం: ఓ నకిలీ అధికారి బాగోతం బట్టబయలైంది. సచివాలయాల పరిశీలనకు వచ్చిన ప్రత్యేక అధికారినంటూ ఓ వ్యక్తి స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, వార్డు సచివాలయాల్లో సోమవారం హల్చల్ చేశాడు. ఆ తర్వాత అనుమానం వచ్చి అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడటంతో అతని నాటకం బయటపడింది. దీంతో అతడు కటకటాల పాలయ్యాడు.

సీఎం ఆఫీసు నుంచి వచ్చా..
వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి బాలాజీపేటకు చెందిన 40వ వార్డు సచివాలయ కార్యదర్శులను వెంటబెట్టుకుని ఓ వ్యక్తి వచ్చాడు. అంతేగాక, నేరుగా తహసీల్దార్ గదిలోకి వెళ్లి ఆయన సీట్లో కూర్చున్నాడు. తాను సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ప్రత్యేక అధికారిని అని చెప్పుకున్నాడు. ప్రభుత్వమే తనను నియమించిందని తెలిపాడు. ఓ ఐడీ కార్డు కూడా చూపించాడు. తన పేరు ఉపేంద్ర రోషన్ అని, తన మొబైల్ నెంబర్ 6301814060 అని చెప్పుకొచ్చాడు.

అనుమానం వచ్చి ఆరా తీయగా..
తహసీల్దార్ లేకపోవడంతో డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజును పిలిపించి సంబంధిత వివరాలు అడిగాడు. అంతేగాక, బుధవారం మళ్లీ వస్తానని, అప్పటి వరకు అన్ని రికార్డులు సిద్ధం చేసి ఉంచాలని వెళ్లిపోయాడు. అయితే, అతని వ్యవహారం కొంత అనుమానాస్పదంగా ఉండటంతో డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆరా తీయగా అటువంటి వ్యక్తి ఎవరూ లేరని సమాధానం వచ్చింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం సదరు నకిలీ అధికారికి ఫోన్ వెంటనే తహసీల్దార్ కార్యాలయానికి రావాలని కోరాడు డిప్యూటీ తహసీల్దార్. తొలుత వీలుపడదని చెప్పిన.. నకిలీ అధికారి.. ఆ తర్వాత డిప్యూటీ తహసీల్దార్ గట్టిగా చెప్పడంతో రాత్రి 7 గంటల వరకు వచ్చాడు.

చివరకు కటకటాలపాలు..
అప్పటికే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. నకిలీ అధికారిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ నకిలీ అధికారి రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామానికి చెందిన వాడని, బీఎడ్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. కాగా, జిల్లాలోని రెవెన్యూ కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన అధికారుల ఫోన్ నెంబర్లన్నీ అతడి ఫోన్లో ఉండటం గమనార్హం.