హర్షకుమార్ తిరిగి సొంతగూటికే! రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్లో చేరనున్న మాజీ ఎంపీ
రాజమహేంద్రవరం: మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ తిరిగి సొంతగూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. తిరిగి రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై ఉత్తరప్రదేశ్ పోలీసులు దాడిని ఖండిస్తున్నామని హర్షకుమార్ అన్నారు.

కేంద్రం, రాష్ట్రంలో అరాచక పాలన
ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అరాచక పాలన సాగుతోందని, దళితులపై దాడులు పెరిగిపోయాయని హర్షకుమార్ ఆరోపించారు. ఏపీలో దళితులపై దాడులు, శిరోముండనం, ఇద్దరు దళిత యువకుల్ని పోలీసులు అన్యాయంగా చంపేశారని అన్నారు. ఏపీలో దళితుల సమస్యలపై పోరాటం చేస్తామని అన్నారు.

కేసుల మాఫీ కోసం సాష్టాంగ పడుతున్నారు..
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ, బీజేపీ మాత్రం పార్లమెంటు సాక్షిగా హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలని చెప్పి మాట తప్పిందన్నారు. ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదాను విస్మరించిందన్నారు. కేసుల మాఫీ కోసం ఢిల్లీలో సాంష్టాంగ పడుతున్నారని ధ్వజమెత్తారు. రాహుల్, ప్రియాంకలు దళితుల పక్షాన చేస్తున్న పోరాటంతో కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని అన్నారు.

తిరిగి కాంగ్రెస్ పార్టీలోకే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని హర్షకుమార్ వ్యాఖ్యానించారు. త్వరలోనే రాహుల్ గాంధీని కలుస్తానని, ఏపీలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి వైభవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తిరిగి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు ఆ పార్టీలో చేరతానని ఆయన తెలిపారు. అయితే, తనను పార్టీలోకి తీసుకోవాలా? వద్దా? అన్నది పార్టీ నిర్ణయిస్తుందని హర్షకుమార్ తెలిపారు.

టీడీపీ, వైసీపీలో ఇమడలేక... తిరిగి సొంతగూటికే..
కాగా, రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క అసెంబ్లీ, పార్లమెంటు గానీ గెలవని విషయం తెలిసిందే. ఏపీలో విభజన ముందు వరకు కీలక రాజకీయ నేతగా ఉన్న హర్షకుమార్ 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. అమలాపురం ఎంపీ సీటు దక్కకపోవడంతో.. ఆ తర్వాత వైసీపీలో చేరారు. అక్కడ కూడా ఆశించిన స్థానం దక్కకపోవడంతో వైసీపీకి కూడా దూరమయ్యారు. అప్పట్నుంచి ఆయన రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. అయితే, అవకాశం దొరికినప్పుడల్లా ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.