కాకినాడ డీఆర్సీ సమావేశం రసాభాస- వైసీపీ ఎంపీ పిల్లి వర్సెస్ ఎమ్మెల్యే ద్వారంపూడి
వైసీపీలో ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మొన్న విశాఖ డీఆర్సీ సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డిని వైసీపీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ టార్గెట్ చేసిన వ్యవహారం సద్దుగణిగిందని భావిస్తున్న తరుణంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన డీఆర్సీ సమావేశం మరో ఆధిపత్య పోరుకు వేదికైంది.
కాకినాడలో ఇవాళ జరిగిన డీఆర్సీ సమావేశంలో టిడ్కో ఇళ్ల వ్యవహారం ఎంపీ, ఎమ్మెల్యే మధ్య మాటలయుద్ధానికి కారణమైంది. వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి పరస్పరం మాటల తూటాలు పేల్చారు. టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి జరిగిందని ఎంపీ పిల్లి ఆరోపించగా.. ఎమ్మెల్యే ద్వారంపూడి ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఎవరు అవినీతి చేశారో వారి పేర్లు తనకు ఇవ్వాలని ద్వారంపూడి ఎంపీని కోరారు.

ఎంపీ పిల్లి అవినీతి వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే ద్వారంపూడి టీడీపీ హయాంలోనే అవినీతి జరిగిందన్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు జోగేశ్వరరావు, చినరాజప్ప అభ్యంతరం వ్యక్తం చేశారు. మెడలైన్ వంతెన నిర్మాణం విషయంలోనూ ఎంపీ పిల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. కాకినాడ సిటీతో పాటు గ్రామీణ ప్రాంతం ముంపుకు కారణమవుతున్న ఈ వంతెన నిర్మాణం ఆపేయాలని సూచించారు.
దీనిపైనా ఎమ్మెల్యే ద్వారంపూడి అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి వాదోపవాదాల మధ్యే కలెక్టర్ డీఆర్సీ మీటింగ్‌ను అర్ధాంతరంగా వాయిదా వేసి వెళ్లిపోయారు.