ఇక కేసీఆర్ కుర్చీకే ఎసరు! గోల్కొండపై కాషాయ జెండా, జీహెచ్ఎంసీ బీజేపీదే: బండి, కిషన్, డీకే అరుణ
హైదరాబాద్: ఎన్ని ఇబ్బందులు పెట్టిన దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దుబ్బాక ప్రజలు చైతన్యవంతులని అన్నారు. దుబ్బాక ప్రజలకు ఈ సందర్భంగా బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, బీజేపీ నేతలు ధన్యవాదాలు తెలిపారు.
టీఆర్ఎస్ కుట్రలను ఛేదించి.. కుటుంబపాలనకు అంతం: దుబ్బాక గెలుపుపై రాంమాధవ్

కేసీఆర్ ఫాంహౌస్ పాలనకు సమాధి..
దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు సందర్భంగా బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, తదితర నేతలు మాట్లాడారు. ఫాంహౌస్ పాలనకు దుబ్బాక ప్రజలు సమాధి కట్టారని, ఇక రాష్ట్ర ప్రజలు కూడా ఇదే అనుసరిస్తారని అన్నారు బండి సంజయ్. రామరాజ్యం కావాలంటే రాముని వారసులతోనే సాధ్యమవుతుందని అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీతోనే రామరాజ్యం సాధ్యవమతుందని నమ్ముతున్నారని చెప్పారు.

గోల్కొండ కోటపై కాషాయ జెండా..
దుబ్బాక ఫలితం హైదరాబాద్కు ఆత్మస్థైర్యం ఇచ్చిందని అన్నారు. నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసమే బీజేపీకి ప్రజలు విజయం అందించారని చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీ ఇదే విజయపరంపరను కొనసాగిస్తుందన్నారు. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించేందుకు టీఆర్ఎస్ యత్నించిందని, దుబ్బాక ప్రజలు నిజాయితీతో మంచి సందేశం ఇచ్చారన్నారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించని కేసీఆర్.. నిజాం సమాధి వద్ద మోకరిల్లారని విమర్శించారు.

దుబ్బాక నుంచే కేసీఆర్ టీఆర్ఎస్ పతనం
దుబ్బాక తీర్పుతో కేసీఆర్ అహంకారం తగ్గాలని.. లేకపోతే గుణపాఠం చెబుతామన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను, పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని.. లేదంటే తెలంగాణలో టీఆర్ఎస్ ఉండదన్నారు. దుబ్బాక నుంచి సీఎం కేసీఆర్పై వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. కేసీఆర్కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అని అన్నారు. వర్షాల ధాటికి హైదరాబాద్ మునిగిపోతే.. బయటకు రాని ముఖ్యమంత్రి దుబ్బాకకు ఏమైనా జరిగితే వస్తారా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తల అహంకారాన్ని దుబ్బాక ప్రజలు దెబ్బతీశారన్నారు. నిజాం పాలకులకు మోకరిల్లిన కేసీఆర్ను ప్రజలు తరిమికొట్టారన్నారు. ఈరోజు దుబ్బాక ప్రజలు సీఎం కేసీఆర్కు బుద్ధి చెప్పారని.. రానున్నరోజుల్లో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ప్రజలు వాస్తవాలకు ఓటువేసి గెలిపించారన్నారు.

కేసీఆర్ సర్కారు అరాచకాలకు పాల్పడింది..
అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక ఫలితంపై తెలంగాణ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తుననారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే.. తెలంగాణలో మాత్రం అధికార దుర్వినియోగం, అరాచకం చేసిందని టీఆర్ఎస్ సర్కారుపై మండిపడ్డారు. టీఆర్ఎస్ విధానాలకు దుబ్బాక ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. రఘునందన్ బంధువుల ఇళ్లపై దాడులు చేయడం, ఎన్నికలకు సంబంధం లేని హైదరాబాద్లోని బంధవులను కూడా వేధించారన్నారు. బీజేపీ నేతలను వేధింపులకు గురిచేశారన్నారు. అధికారులకు కూడా పక్షపాతంగా వ్యవహరించారని కిషన్ రెడ్డి అన్నారు. వారు టీఆర్ఎస్ పార్టీ శాశ్వతమనుకుంటూ అతిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అవకాశం వచ్చినప్పుడు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. నీతి నిజాయితీగా పోరటం చేస్తున్న రఘునందన్ రావుకు దుబ్బాక ప్రజలు పట్టంకట్టారన్నారు.
అక్రమ అరెస్టు చేసి బీజేపీ నేతలు, కార్యకర్తలను జైల్లోనే ఉంచారని, వారు అక్కడే సంబరాలు చేసుకున్నారన్నారు. నిన్న కూడా కొందర్ని అరెస్ట్ చేశారని అన్నారు. దుబ్బాక ప్రజలకు శిరస్సువంచి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. బీహార్ రాష్ట్రంలోనూ తిరిగి బీజేపీ-జేడీయూ ఎన్డీఏ ప్రభుత్వానికి అక్కడి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వచ్చినప్పటికీ.. జంగిల్ రాజ్ వద్దని ఎన్డీఏకు పట్టంకట్టారని తెలిపారు.

సీఎం కుర్చీకే ఎసరు.. కేసీఆర్ రాజీనామాకు డీకే అరుణ సవాల్
బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. దుబ్బాక ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాని తెలిపారు. సీఎం అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కేసీఆర్కు దుబ్బాకకు వచ్చే ముఖం లేదన్నారు. కేంద్రం ఇచ్చిన పది లక్షలతో కేసీఆర్ రైతు వేదికలను నిర్మిస్తున్నారని తెలిపారు. కేసీఆర్వన్నీ జుటా మాటలేనని అన్నారు. సీఎం కుర్చీలో కూర్చునే అర్హత కేసీఆర్కు లేదని డీకే అరుణ అన్నారు. దుబ్బాక ఫలితంతో కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలు వెళ్లాలన్నారు. రాజకీయ విలువలుంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. దుబ్బాక ప్రజలను భయపెట్టినా, డబ్బులు పంచినా టీఆర్ఎస్ను ఓడించారన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ను సీఎం కుర్చీ నుంచి దించేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వానికి బీహార్ ప్రజలు పట్టం కట్టారన్నారు. ప్రజలు నీతిమంతమైన పాలనను కోరుకుంటున్నారని, తెలంగాణలో అవినీతి టీఆర్ఎస్ పాలనను అంతం చేస్తారన్నారు. హైదరాబాద్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంటుందని అన్నారు. వరదలో ప్రజలు ఇబ్బందులు పడుతంటే కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. వరద బాధిత ప్రజలకు కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలకు డబ్బులు పంచారని డీకే అరుణ విమర్శించారు.