దుబ్బాకలో ఓడిందెవరు?: మాస్ లీడర్ ఛరిష్మా ఏమైంది? కల్వకుంట్ల కోటపై కాషాయ జెండా: పతన సంకేతం?
సిద్ధిపేట్: ఊహించినట్టే.. తెలంగాణలోని సిద్ధిపేట్ జిల్లా దుబ్బాక ఉప ఎన్నక ఫలితం వెలువడింది. ఈ స్థానంపై కాషాయ జెండా ఎగిరింది. ఈ నియోజకవర్గంలో పాగా వేసింది. తెలంగాణ వ్యాప్తంగా పార్టీ బలపడుతోందనే సంకేతాలను పంపించింది. ఏ రాష్ట్రంలోనైనా ఉప ఎన్నికలు జరిగాయంటే అవి అధికార పార్టీకి అనుకూలంగా వెళ్తుంటాయి. మెజారిటీ రాష్ట్రాల్లో జరిగే ప్రక్రియే ఇది. అలాంటిది- ప్రత్యేక తెలంగాణ సాధించిన మొనగాడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సారథ్యంలోని టీఆర్ఎస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక ఉప ఎన్నిక ఫలితం వెలువడటం అనేది అసాధారణంగా భావిస్తున్నారు.

టీఆర్ఎస్కు డేంజర్ బెల్స్..
అలాంటి అసాధారణ పరిస్థితులను ఎదిరించి, ప్రతికూల వాతావరణాన్ని అధిగమించి మరీ బీజేపీ ఈ ఎన్నికలో విజయం సాధించింది. అసెంబ్లీలో తన సీట్ల సంఖ్యను ఒకటి నుంచి రెండుకు పెంచుకోగలిగింది. ఈ సంఖ్య నామమాత్రమే అయినప్పటికీ.. పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేనప్పటికీ.. చాపకింద నీరులా బీజేపీ బలపడుతోందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఒకవంక అధికార పార్టీ నేతల మంత్రాంగం.. మరోవంక సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఏర్పడిన సానుభూతి పవనాలను తట్టుకుని మరీ.. కమలనాథులు దుబ్బాక నియోజకవర్గంపై తమ కాషాయ జెండాను ఎగురవేయగలిగారంటే.. టీఆర్ఎస్కు డేంజర్ బెల్స్‌ను పంపించినట్టే. టీఆర్ఎస్ పతనానికి నాంది పలికినట్టే.

భవిష్యత్ రాజకీయ పరిణామాలకు అద్దం..
దుబ్బాక ఎన్నిక ఫలితం- తెలంగాణ భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు నిలువుటద్దంలా మారిందడనంలో సందేహాలు అక్కర్లేదు. టీఆర్ఎస్కు గ్రామస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతోందనడానికి ఈ ఓటమి ఓ బెస్ట్ ఎగ్జాంపుల్. టీఆర్ఎస్కు గుండెకాయగా చెప్పుకొనే సిద్ధిపేట్ జిల్లాలో ఎదురైనా ఈ దారుణ పరాభవాన్ని ఆ పార్టీ నాయకులు ఇప్పట్లో జీర్ణించుకోలేకపోవచ్చు. సాక్సాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా ఇది. 1985 నుంచి ఇప్పటిదాకా మరో నాయకుడిని ఆదరించని సిద్ధిపేట్ నియోజకవర్గానికి ఆనుకునే ఉంటుందీ దుబ్బాక. కేసీఆర్ కుటుంబానికి కంచుకోట.. సిద్ధిపేట్. అలాంటి జిల్లాలో.. అధికారంలో ఉండీ.. సానుభూతి పవనాలు వీస్తున్నప్పటికీ.. పార్టీ ఓటమి పాలవ్వడానికి మించిన అవమానం మరొకటి ఉండకపోవచ్చు.

మాస్ లీడర్ ఛరిష్మా ఏమైంది?
అధికార పార్టీలో మాస్ లీడర్‌గా, ఛరిష్మా గల నేతగా, క్రౌడ్ పుల్లింగ్ ఇమేజ్ ఉన్న హరీష్ రావు ప్రస్తుతం సిద్ధిపేట్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. స్వయంగా ఆయనే దుబ్బాక ఎన్నికలను పర్యవేక్షించారు. దుబ్బాకలో లక్ష కంటే తక్కువ మెజారిటీతో తాము గెలిస్తే.. ఓడిపోయినట్టేననే స్టేట్మెంట్ ఇచ్చారు హరీష్ రావు. పరిస్థితి తీవ్రతను ముందే పసిగట్టడం వల్ల హరీష్ రావుతో పాటు కేటీఆర్, ఇతర సీనియర్ నేతలు దుబ్బాకలో మకాం వేశారు. సర్వశక్తులనూ ఒడ్డారు. అయినప్పటికీ.. దుబ్బాక ఫలితం వారికి హైఓల్టేజ్ షాక్ ఇచ్చింది. బొటాబొటీ మెజారిటీతోనైనా గట్టెక్కుతామనే ఆశలను నీరుగార్చింది.

మేల్కొనకపోతే అంతే సంగతులు..
దుబ్బాక నియోజవర్గం పరిధిలో టీఆర్ఎస్ గట్టిపోటీ ఇవ్వగలిగిందంటే అది కేవలం మైనారిటీల ఓటుబ్యాంకు వల్లే అనేది స్పష్టమౌతోంది. దౌల్తాబాద్, మిర్దొడ్డి వంటి నియోజకవర్గాలపై పట్టు ఉంది. అవే కొంతవరకు బీజేపీకి-టీఆర్ఎస్కు మధ్య ఉన్న ఓట్ల అంతర్యాన్ని తగ్గించినట్టయింది. టీఆర్ఎస్కు ఈ ఓటమి ఓ మేల్కొలుపు వంటిదే. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. మున్ముందు రాజకీయపరమైన ఇబ్బందులను ఎదుర్కొనక తప్పకపోవచ్చు. ప్రతికూల పరిస్థితుల మధ్య బీజేపీ గెలవడం అంటే- టీఆర్ఎస్కు ప్రత్యామ్యాయంగా క్షేత్రస్థాయిలో ఆ పార్టీ వేళ్లూనుకుంటోందనే అర్థం.

కాంగ్రెస్ కథేంటీ? .
వన్ షాట్.. టూ బర్డ్స్. ఈ ఒక్క గెలుపుతో బీజేపీ కొమ్ములు తిరిగిన రెండు పార్టీలకు ముఖం పగిలే సమాధానం ఇచ్చినట్టయింది. కాంగ్రెస్ స్థాయి ఏమిటో.. ఆ పార్టీ ఎలాంటి దీనావస్థకు చేరుకుందో స్పష్టం చేస్తోంది. టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇవ్వాల్సింది పోయి.. ఆ స్థానాన్ని బీజేపీకి ధారాదాత్తం చేసుకున్నట్టయింది కాంగ్రెస్‌కు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తామే ఎదుగుతున్నామంటూ ఆ పార్టీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యానాలకు దుబ్బాకలో కాంగ్రెస్ పరిస్థితి మరింత బలాన్ని చేకూర్చింది. మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. ఈ రెండు పార్టీలతో పోల్చుకుంటే కాంగ్రెస్‌కు పోల్ అయిన ఓట్లు చాలా తక్కువ.

గ్రేటర్‌పై కన్నేసిన కమలం..
ఈ గెలుపు- బీజేపీ క్యాడర్లో నూతనోత్తేజాన్ని నింపింది. 2018 ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమై డీలా పడ్డ నేతలు, కార్యకర్తలను రీఫ్రెష్ చేసింది. గట్టిగా పోరాడితే విజయం సాధించి తీరుతామనే ధీమాను కల్పించింది. బీజేపీ నెక్స్ట్ టాస్క్.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. గ్రేటర్పైనే వారి కన్ను పడినట్టే. మెజారిటీ డివిజన్లను కైవసం చేసుకోవడానికి చెమటోడ్చక తప్పని పరిస్థితి టీఆర్ఎస్ కు ఎదురైంది. సహజంగానే గ్రేటర్ పరిధిలో బీజేపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటుబ్యాంకు ఉంది. సంప్రదాయ ఓటుబ్యాంకును కాపాడుకుంటూనే.. తటస్థులను తమవైపు మార్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తదుపరి ఎన్నికలు గ్రేటర్‌లోనివే కావడంతో.. టీఆర్ఎస్ అసలు ప్రత్యర్థి ఎవరనేది తేలుతుందిక్కడ.