• search
  • Live TV
సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దుబ్బాక ఉప ఎన్నికపై ఈసీ ప్రకటన - సోలిపేట వారసులెవరు? - డైలమాలో బీజేపీ! -కాంగ్రెస్ నుంచి ఫైర్‌బ్రాండ్

|

ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో మళ్లీ రాజకీయ సందడి మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి ఇటీవల గుండెజ‌బ్బుతో కన్నుమూసిన నేపథ్యంలో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. బీహార్ సాదారణ అసెంబ్లీ ఎన్నికలతోపాటే దేశంలోని 64 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తామని ఈసీ స్పష్టంచేసింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్ల తర్వాత జరగనున్న ఉప ఎన్నిక కావడంతో దుబ్బాకపై అన్ని పార్టీలూ ఫోకస్ పెంచాయి.

 సెంటిమెంట్‌కు మంగళం..

సెంటిమెంట్‌కు మంగళం..

సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైనా చనిపోతే, ఆ స్థానంలో ప్రత్యర్థులు పోటీకి దిగకపోవడమనే సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఉండేది. అయితే, 2016లో పాలేరు ఎమ్మెల్యే రాంరెండ్డి వెంకటరెడ్డి అకాల మరణం తర్వాత ఆ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి(తుమ్మల నాగేశ్వరరావు)ని నిలబెట్టడంతో సెంటిమెంట్ కు మంగళంపాడినట్లయింది. తాజాగా దుబ్బాక స్థానంలోనూ అలాంటి సీనే రిపీట్ అవుతోంది. సౌమ్యుడిగా, జర్నలిస్టుగా సోలిపేట రామ‌లింగారెడ్డి అందరికీ ఇష్టమైన వ్యక్తే అయినప్పటికీ, ఆయన మరణంతో ఖాళీ అయిన స్థానంలో పోటీకి అన్ని పార్టీలూ సిద్దమవుతున్నాయి.

మంత్రి హరీశ్ నేతృత్వంలో..

మంత్రి హరీశ్ నేతృత్వంలో..

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున సోలిపేట సతీమణికిగానీ, కొడుకుకుగానీ అవకాశం కల్పిస్తారని ప్రచారం సాగుతోంది. ఇందుకు పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నా, అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉప ఎన్నిక అనివార్యమైన పరిస్థితిలో.. ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జీ, రాష్ర్ట ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్ రావు ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయిలో పార్టీ అభ్య‌ర్థి విజ‌యానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. అభ్యర్థి ఇంకా ఖరారు కానప్పటికీ.. ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యేలా మంత్రి హ‌రీశ్‌రావు ప్రచార బాధ్యతలు తలకెత్తుకున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ నుంచి విజయశాంతి?

కాంగ్రెస్ నుంచి విజయశాంతి?

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా పోటీకి దిగుతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదివరకే స్పష్టం చేశారు. 2018లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మద్దుల నాగేశ్వరరెడ్డినే మరోసారి బరిలోకి దిగుతారని అంతా భావిస్తుండగా.. సడెన్ గా పార్టీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది. గతంలో మెదక్ ఎంపీగానూ పనిచేసిన ఆమెకు స్థానికంగా మంచి ఆదరణ ఉందని, టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ విధానాలను ఎండగట్టడంలో విజయశాంతి అనుసరిస్తోన్న దూకుడు కూడా కాంగ్రెస్ కు కలిసొస్తుందని, అందుకే దుబ్బాక స్థానంలో ఆమెను అభ్యర్థిగా నిలబెట్టాలని పార్టీ యోచిస్తున్నట్లు గత మూడు రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే, మద్దుల నాగేశ్వరెడ్డి వర్గం మాత్రం టికెట్ తమదేననే విశ్వాసంతో ఇప్పటికే ప్రచారంలో మునిగిపోయింది.

రఘునందన్ అభ్యర్థిత్వానికి ఒకేనా?

రఘునందన్ అభ్యర్థిత్వానికి ఒకేనా?

సోలిపేట మరణం తర్వాత దుబ్బాక ఉప ఎన్నికపై జరుగుతోన్న చర్చలో బీజేపీ నేత రఘునందన్ రావు పేరు అందరినోటా నానుతోంది. బీజేపీ అభ్యర్థిగా 2014లో 9.8శాతం ఓట్లు, సాదించిన రఘునందన్.. 2018లో 13.75 శాతం ఓట్లు రాబట్టారు. ఉప ఎన్నికల్లోనూ పోటీకి సిద్ధమనడానికి సంకేతంగా ఆయన ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే, దుబ్బాక ఉప పోరులో పోటీపై బీజేపీలో డైలమా నెలకొన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ గనుక సోలిపేట కుటుంబీకులకు టికెట్ ఇస్తే కమలదళం నుంచి అభ్యర్థిని పోటీకి దింపాలా? వద్దా? అని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో సోలిపేట వైఫల్యం చెందానే భావన స్థానికుల్లో ఉందని, రాష్ట్రమంతటా కేసీఆర్ కు వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా మారుతోన్న వాతావరణం కూడా దుబ్బాకలో ఉపకరిస్తుందని రఘునందన్ వర్గీయులు వాదిస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వానికి హైకమాండ్ ఒకే చెబుతుందా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లో స్పష్టతరానుంది.

English summary
The Election Commission of India (ECI) on Friday said it has decided to conduct assembly elections in Bihar and by-polls to 65 assembly and parliamentary seats in various states simultaneously. Dubbaka Assembly is one of the constituency in that list. The sudden demise of four-time MLA and journalist Solipeta Ramalinga Reddy has left a deep void in Dubbaka Assembly constituency’s political atmosphere.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X