దుబ్బాక : టీఆర్ఎస్ కొంపముంచిన ఆ 'నాలుగు' హైలైట్స్.. లెక్క తప్పింది అక్కడే...
ఐపీఎల్‌ని మించిన ఉత్కంఠ... రౌండ్ రౌండ్‌కి రసవత్తరంగా మారిన పోరు... మొదటి నుంచి చివరిదాకా దోబూచులాడిన ఆధిపత్యం... చివరాఖరికి దుబ్బాక గెలుపు వాకిట్లో బీజేపీ జెండానే ఎగిరింది. బహుశా ఒక ఉపఎన్నిక ఫలితాల కోసం జనం ఇంత ఉత్కంఠగా ఎదురుచూసిన సందర్భం చరిత్రలో మరొకటి లేదేమో. జాతీయ రాజకీయాలను ప్రభావం చేసే అవకాశం ఉన్న బిహార్ ఎన్నికల ఫలితాలను సైతం పట్టించుకోకుండా... తెలుగు ప్రజానీకం మంగళవారం(నవంబర్ 10) పూర్తిగా టీవీలకే అతుక్కుపోయి 'దుబ్బాక' కౌంటింగ్‌ను వీక్షించారు. టీ-20 థ్రిల్లింగ్ మ్యాచ్‌ని మించేలా.. రౌండ్ రౌండ్‌కు ఫలితం ఎవరి టర్న్ తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నడుమ దుబ్బాక కౌంటింగ్ సాగింది. గతంలో రెండు పర్యాయాలు పరాజయం పాలైన రఘునందన్ రావు ఎట్టకేలకు విజయం సాధించారు. తెలంగాణలో ఉపఎన్నిక అంటే టీఆర్ఎస్దే గెలుపు అన్న నానుడిని బ్రేక్ చేశారు. ఇంతకీ టీఆర్ఎస్ లెక్క ఎక్కడ తప్పినట్లు...

యువత...
దుబ్బాక ఉపఎన్నిక కోసం బీజేపీ ఈ రెండు అస్త్రాలను బలంగా ప్రయోగించింది. అదే సమయంలో టీఆర్ఎస్ ఈ రెండింటిని లైట్ తీసుకుని గెలుపు వాకిట్లో బొక్కబోర్లా పడింది. యువకులతో ఏమవుతుందిలే అన్న అలసత్వ ధోరణి అధికార పార్టీ కొంపముంచింది. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న నిరుద్యోగ యువత... టీఆర్ఎస్ నాయకులు తమ శక్తిని తక్కువగా అంచనా వేయడాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నారు. అటు బీజేపీ నాయకత్వం కూడా స్థానిక యువత గంపగుత్తగా కమలానికే ఓటేసేలా అందరినీ ఏకం చేయగలిగింది. దీంతో దుబ్బాక నియోజకవర్గంలోని దాదాపుగా ప్రతీ గ్రామంలో ఉన్న యువత టీఆర్ఎస్ను ఓడించేందుకు కంకణం కట్టుకున్నారు. అనుకున్నట్లుగానే టీఆర్ఎస్ను గెలుపుకు ఆమడ దూరంలో నిలువరించగలిగారు.

సోషల్ మీడియా...
తొలి నుంచి బీజేపీ డిజిటల్ క్యాంపెయిన్‌లో ధిట్ట. దుబ్బాక ఉపఎన్నికలోనూ బీజేపీ డిజిటల్ క్యాంపెయిన్ బాగా పనిచేసింది. ముఖ్యంగా ఎన్నికలకు రెండు,మూడు రోజుల ముందు... రఘునందన్ రావు ఇంట్లో సోదాలు,డబ్బు సంచుల వివాదం,బండి సంజయ్ అరెస్ట్ తదితర పరిణామాలను సోషల్ మీడియా వేదికగా బలంగా దుబ్బాక జనంలోకి తీసుకెళ్లగలిగింది. టీఆర్ఎస్ అధికార యంత్రాంగ్రాన్ని ఉపయోగించి తమపై దౌర్జన్యాలకు,కుట్రలకు తెరలేపుతోందని సోషల్ మీడియా ద్వారా హైలైట్ చేసింది. అప్పటికే రఘునందన్ రావుపై ఉన్న సానుభూతికి ఇది మరింత తోడైంది. మరోవైపు టీఆర్ఎస్ మాత్రం... దుబ్బాక ఉపఎన్నిక కోసం సోషల్ మీడియాను పెద్దగా ఉపయోగించుకోలేదు. కేవలం ప్రెస్ మీట్లు,ఎన్నికల ప్రచారంలో సవాళ్లు తప్పితే... సోషల్ మీడియాను పూర్తిగా విస్మరించారు. ఈ ఓటమితో సోషల్ మీడియా శక్తి ఏంటో టీఆర్ఎస్కు మరోసారి తెలిసివచ్చి ఉంటుంది.

మల్లన్నసాగర్లో ఓట్లు...
నిజానికి దుబ్బాకలో ప్రజలు టీఆర్ఎస్ను పూర్తిగా విస్మరించారని చెప్పడానికి లేదు. అయితే బీజేపీ పుంజుకోవడం వల్ల టీఆర్ఎస్కు దెబ్బపడింది. తొలి రౌండ్ నుంచి 12వ రౌండ్ వరకు రఘునందన్ రావు వరుసగా ఆధిక్యాన్ని కనబరుస్తూ రాగా... 13 నుంచి 19 రౌండ్ వరకు టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కనబర్చింది. మధ్యలో 12వ రౌండ్లో అనూహ్యంగా కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్లో మల్లన్నసాగర్‌కి సంబంధించిన ఓట్లను లెక్కించారు. 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి తమకు అన్యాయం చేశారన్న కారణంతో ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఒకవేళ ఇక్కడి ఓట్లు టీఆర్ఎస్కు పోలై ఉంటే... ఫలితం మరోలా ఉండేది.

కరోనా,ఎల్ఆర్ఎస్.... టీఆర్ఎస్ అతివిశ్వాసం
కరోనా సంక్షోభ కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాం హౌస్‌కే పరిమితమవడం... పూర్తిగా చేతులెత్తేసినట్లుగా వ్యవహరించడం కూడా దుబ్బాక ఉపఎన్నికపై ప్రభావం చూపించిందన్న వాదన ఉంది. అసలే జనం కరోనా కష్టాల్లో ఉన్న వేళ... ఎల్ఆర్ఎస్ డెడ్ లైన్ విధించి సామాన్యులపై మరింత భారం మోపారన్న ఆగ్రహం కూడా ఈ ఎన్నికలో ప్రభావం చూపించిందంటున్నారు. అన్నింటికి మించి టీఆర్ఎస్ అతి విశ్వాసం ఆ పార్టీని తీవ్రంగా దెబ్బకొట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు బాధ్యతలు అప్పగించి... గెలుస్తామన్న ధీమాతో కేసీఆర్ ఫాం హౌస్‌కే పరిమితమవడం,కేటీఆర్ కూడా అటువైపు చూడకపోవడం కొంపముంచిందన్న వాదన వినిపిస్తోంది. ఏదేమైనా విజయాలకు పొంగిపోము,అపజయాలకు కుంగిపోము అని మంత్రి కేటీఆర్ హుందాగా ఒక ప్రకటన చేశారు. ఈ ఓటమి నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారో వేచి చూడాలి.