దుబ్బాకలో వికసించిన కమలం: ప్రత్యామ్నాయం బీజేపేనా..? రఘునందన్ రావుకు ఎలా సాధ్యం...?
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విక్టరీ ప్రత్యామ్నాయ శక్తి ఉందని ప్రపంచానికి చాటింది. అయితే కాంగ్రెస్‌ని కాదని బీజేపీకి దుబ్బాక ఓటర్లు పట్టం కట్టారు. మొదటినుంచి టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చెప్పుకుంటోంది. అనుకున్నట్టుగానే.. ఆ పార్టీ విజయం సాధించింది. పూర్తి మెజార్టీతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. విజయం కోసం అస్త్రశస్త్రాలను ప్రయోగించింది. కానీ విజ్ఞులైన దుబ్బాక ప్రజలు తమ అభీష్టాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.

తీర్పు.. అదిరింది...
దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ అహోరాత్రులు శ్రమించింది. అభ్యర్థిత్వాన్ని ప్రకటించక ముందే దుబ్బాకలో కాలికి బలపం కట్టుకొని మరీ తిరిగారు. ప్రభుత్వ వ్యతిరేక అంశాలను ప్రచారం చేశారు. ప్రచారంలో ఆటంకాలు ఎదురైనా.. నగదు పేరుతో వాహనాలను సీజ్ చేసినా వెన్నువిరవలేదు. తనదైనశైలిలో ప్రచారం చేశారు. చివరికీ అధికార పార్టీకి దెబ్బ కొట్టారు. 1470 స్వల్ప ఓట్ల తేడాతో గెలిచినా.. టీఆర్ఎస్ పార్టీ మైండ్ బ్లాంకయిపోయేట్టు ప్రజలు తీర్పిచ్చారు.

జర్నలిస్ట్ నుంచి ఎమ్మెల్యే వరకు
రఘునందన్ రావు.. జర్నలిస్ట్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగారు. రఘునందన్ రావుకు చిన్నప్పటి నుంచి రాజకీయాలపై అవగాహన ఉంది. డిగ్రీ వరకు సిద్దిపేటలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. విలేకరిగా మొదలైన జీవితం అడ్వకేట్ వయా ఎమ్మెల్యే స్థాయి వరకు వెళ్లింది. హైకోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా పనిచేశారు.

ఉప ఎన్నికలు..
వాస్తవానికి ఉప ఎన్నిక అంటే టీఆర్ఎస్కు జనం జై కొడతారు. మరీ ఈ సారి విచిత్రం జరిగింది. టీఆర్ఎస్ని కాదు అని రఘునందన్‌కు జై కొట్టారు. ఈ విజయం అధికార పార్టీ ప్రభ కాస్త తగ్గించేస్తోంది. ఇప్పటివరకు బై పోల్, ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ చాలా రోజుల తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది. అపజయంపై లోతైన విశ్లేషణ చేస్తామని కేటీఆర్ ప్రకటించారంటే.. ఆ పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది.