దుబ్బాక ఫలితంపై హరీశ్‌రావు అనూహ్య వ్యాఖ్యలు -టీఆర్ఎస్ ఓటమితో మంత్రి భవితవ్యం?
''నన్ను చూసి ఓటెయ్యండి.... నేను చూసుకుంటా...''అంటూ దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు ఒక్కతీరుగా ప్రజల్ని వేడుకున్నారు. కానీ మంగళవారం వెలువడిన ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ ఓటమిపాలైంది. గులాబీ దళానికి పెట్టనకోట లాంటి దుబ్బాకలో కమలం వికసించింది. ఏళ్లపాటు కొనసాగిన టీఆర్ఎస్ ఆధిపత్యానికి గండి కొడుతూ దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. మెజార్టీ స్వల్పమే అయినా ఈ గెలుపు కమలనాథుల్లో కొండంత విశ్వాసాన్ని నింపింది. దుబ్బాక ఫలితంపై మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ అనూహ్య వ్యాఖ్యలు చేశారు..
రఘునందన్ విజయ రహస్యం చెప్పిన పవన్ కల్యాణ్ -బండిని ఆకాశానికెత్తుతూ -దుబ్బాక ఫలితంపై జనసేనాని

ఫలితంపై ఈసీ ట్విస్ట్..
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 198807 ఓట్లు ఉండగా, 164192 ఓట్లు పోలయ్యాయి. చివరిదైన 23వ రౌండ్ ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ 62,772 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత 61,302 ఓట్లు, కాంగ్రెస్ క్యాండిడేట్ చెరుకు శ్రీనివాస రెడ్డి 21,819 ఓట్లు సాధించారు. దీంతో 1118 ఓట్లతో రఘునందన్ విజేతగా నిలిచారని వార్తలు వచ్చాయి. కానీ ఈ గెలుపు ప్రకటన అధికారం కాదని, ఇంకా నాలుగు ఈవీఎంలలో నిక్షిప్తమైన 1669 ఓట్లను లెక్కించలేదని, సాంకేతిక సమస్యలు రావడంతో వీవీప్యాట్ స్లిప్పుల ద్వారా లెక్కింపు చెప్పట్టిన తర్వాతే విజేతను ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. ఎలా చూసినా బీజేపీ విజయం ఖరారైపోవడంతో నేతలు ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చారు..
దుబ్బాక ఫలితంపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు -బీజేపీ పేరెత్తకుండా ప్రెస్‌మీట్

ఓటమికి పూర్తి బాధ్యత నాదే..
‘‘దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి పూర్తి బాధ్యత నాదే. దుబ్బాక ప్రజాతీర్పును శిరసావహిస్తాం. ఎందుకు ఓడిపోయామనే కారణాలను త్వరలోనే సమీక్షించుకుని, లోపాలను సరిదిద్దుకుంటాం. టీఆర్ఎస్ ఓడిపోయినంత మాత్రాన దుబ్బాకకు దూరం కాబోను. ఇక్కడి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తాను. టీఆర్‌ఎస్‌కు ఓటేసిన దుబ్బాక ప్రజలకూ, ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు'' అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. అయితే..

హరీశ్ భవితవ్యం మారుతుందా?
2014 కంటే ముందు నుంచి కూడా తెలంగాణలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ హైకమాండ్ హరీశ్ రావునే తన తురుపుముక్కగా రంగంలోకి దింపుతూ వస్తోంది. అప్పగించిన పనిని అహోరాత్రులు కష్టపడి నిర్వహించే హరీశ్.. పార్టీని చాలా సార్లు విజయ తీరాలకు చేర్చేవారు. కానీ దుబ్బాకలో మాత్రం హరీశ్ ను కూడా కాదని ఓటర్లు బీజేపీ వైపు మొగ్గారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా బలమైన వర్గం పావులు కదుపుతూ, మంత్రి పదవి కూడా ఆలస్యంగా అప్పగించడంపై హరీశ్ ఏనాడూ పెదవి విప్పలేదు. దుబ్బాకలో గెలుపు ద్వారా తన ఉనికిని పార్టీలో మరోసారి చాటుదామనుకున్న హరీశ్‌కు ఈ ఫలితం పెద్ద దెబ్బే అని చెప్పాలి. నిజంగా ప్రతిపక్షాలు అన్నట్లు హరీశ్ రాజకీయ భవితవ్యం మసకబారుతుందా? లేక, దుబ్బాక ఫలితాన్ని టీఆర్‌ఎస్ లైట్‌గా తీసుకొని, హరీశ్ ప్రభ ఎప్పటిలాగే ఉంటుందా? అన్నది కాలమే తేల్చాలి..