సిద్దిపేటకు కేసీఆర్ వరాలు: అల్లుడు ఆణిమత్యమంటూ ప్రశంసలు, అద్భుతంగా నియోజకవర్గం
సిద్దిపేట: ఆర్థిక మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. సిద్దిపేటలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన అనంతరం డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణను సిద్ధింపజేసిన గడ్డ సిద్దిపేటనేనని అన్నారు. సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడని, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

హరీశ్ ఆణిముత్యం లాంటి నాయకుడు
తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన సమయంలో ఎంతో దు:ఖించానని సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే, ఇక్కడ్నుంచి వెళ్లేటప్పుడు ఆణిముత్యం లాంటి నాయకుడిని ఇచ్చి వెళ్లానని మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి చెప్పారు. హరీశ్ తన పేరు కాపాడి అద్భుతమైన సిద్దిపేటను తయారు చేశారనే సంతోషం గుండెలనిండా ఉందని కేసీఆర్ కొనియాడారు.

సిద్దిపేటకు సీఎం కేసీఆర్ వరాలు
సిద్దిపేట మంచినీటి విధానాన్నే మిషన్ భగీరథ పేరుతో రాష్ట్రమంతా విస్తరించామని సీఎం కేసీఆర్ తెలిపారు. సిద్దిపేట నుంచి ఇల్లంతకుంట వరకు నాలుగు వరుసల రహదారిని మంజూరు చేస్తామని, దీనిపై రేపే ఉత్తర్వులు జారీ అవుతాయన్నారు. సిద్దిపేట డబుల్ బెడ్రూం ఇళ్లు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కొత్తగా మరో వెయ్యి ఇళ్లతోపాటు సిద్దిపేటకు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ. 161 కోట్లతో నియోజకవర్గం చుట్టూ మరో ఔటర్ రింగురోడ్డు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. టౌన్ హాల్ నిర్మాణానికి రూ. 50 కోట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం రూ. 25 కోట్లు కేటాయిస్తామని తెలిపారు.

సిద్దిపేటలో ఐటీ టవర్...
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. జిల్లాకు ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సొంత ఇల్లును ఎంత శ్రద్దగా నిర్మించుకుంటామో.. అంతే చిత్తశుద్ధితో ఇవాళ సకల హంగులు, అన్ని సౌకర్యాలతో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇచ్చామని సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్ల ప్రారంభోత్సవంలో తెలంగాణ ఆడబిడ్డలు ఆనందబాష్పాలు కారుస్తుంటే కడుపునిండినంత ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే 2480 డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేశామన్నారు. నిరుద్యోగ యువత కోసం అడగ్గానే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రూ. 45 కోట్లతో ఐటీ టవర్ మంజూరు చేశారని హరీశ్ రావు తెలిపారు. దీని ద్వారా 2వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉపాధి కలిగే అవకాశం ఉందన్నారు. ఐటీ టవర్స్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఇవాళ నాలుగు సంస్థలు ముందుకొచ్చాయన్నారు. ఇక ఇంజినీరింగ్ నిరుద్యోగుల కోసం రాబోయే రోజుల్లో టాస్క్ సెంటర్లలో అవసరమైన శిక్షణ ఇచ్చి, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.