కోర్టు ధిక్కరణ కేసు... సిద్దిపేట కలెక్టర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన హైకోర్టు...
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సిద్దిపేట కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి,ఆర్డీవో జయచంద్రారెడ్డిలకు మూడు నెలల జైలు శిక్ష విధించింది. పి.వెంకట్రామిరెడ్డికి కోర్టు 3 నెలల సాధారణ జైలు శిక్ష,రూ.2వేలు జరిమానా విధించింది. ఖర్చుల కింద పిటిషనర్లకు రూ.25వేలు చెల్లించాలని ఆదేశించింది. భూసేకరణ అధికారిగా వ్యవహరించిన జయచంద్రారెడ్డికి 4 నెలల జైలు శిక్ష,రూ.2వేలు జరిమానా విధించింది. వీరితో పాటు ప్రస్తుత సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గతంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన కృష్ణ భాస్కర్‌కు రూ.2వేలు జరిమానా విధించింది.
కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు హైకోర్టు ఈ శిక్ష విధించింది. వేములఘాట్కి చెందిన గాండ్ల తిరుపతితో పాటు మరొకరు జిల్లా కలెక్టర్ కోర్టు ఆదేశాలను అమలుచేయడం లేదని ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూసేకరణలో కోర్టు ఆదేశాలను పాటించకపోవడంపై హైకోర్టు సిద్దిపేట కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లకు చెందిన భూమికి సంబంధించి మే 21,2019న ఇచ్చిన డిక్లరేషన్,ఆ తర్వాత జారీ చేసిన అవార్డును కోర్టు రద్దు చేసింది.

తాజా తీర్పు జారీ అయిన 4 నెలల్లోగా కొత్త నోటిఫికకేషన్ జారీ చేసి నష్టపరిహారం,పునరావాస,పనర్నిర్మాణ ప్యాకేజీని అందించాలని కోర్టు కలెక్టర్‌ను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా పిటిషనర్లతో భూమి ఖాళీ చేయించడాన్ని కోర్టు తప్పు పట్టింది. తాజా ఆదేశాలపై అప్పీలుకు కలెక్టర్,ఆర్డీవో అధికారికి కోర్టు 6 వారాల గడువు ఇచ్చింది.
ఇటీవల కోర్టు ధిక్కరణ కేసులో సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు కూడా హైకోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. జిల్లాలోని అనంతగిరి రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించేంతవరకూ వారి భూములను ముంపుకు గురిచేయవద్దన్న కోర్టు ఆదేశాలను ధిక్కరించారన్న ఆరోపణలతో కలెక్టర్ డి.కృష్ణ భాస్కర్, గతంలో జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన యాస్మిన్ భాషా,భూసేకరణ అధికారి ఎన్.శ్రీనివాసరావులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.