దుబ్బాకలో రోటీమేకర్ దెబ్బకు గ్రేటర్ ఎన్నికలపై టీఆర్ఎస్ ముందు జాగ్రత్త .. ఆ గుర్తులపై విజ్ఞప్తి
దుబ్బాక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. దుబ్బాక ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థిని సుజాత పై 1,118 ఓట్ల తేడాతో విజయం సాధించారు . దీంతో ఎన్నికల్లో ఓటమి పై సమీక్షించుకున్న టిఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన గుర్తు టిఆర్ఎస్ పార్టీ కొంపముంచినట్లుగా గుర్తించారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేలా ఇప్పటి నుండే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దుబ్బాక ఫలితాల జోష్ .. ఏపీలో బీజేపీకి బూస్ట్ .. బీజేపీకి ప్లస్ అయ్యే అంశాలివే !!

ఎన్నికల కమీషనర్ ను కలిసిన టీఆర్ఎస్ నేతలు .. గ్రేటర్ ఎన్నికల్లో ఆ గుర్తులపై అభ్యంతరం
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్, టిఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల్లో గుర్తులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తో భేటీ అయ్యారు. కారు గుర్తును పోలిన గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు ఇవ్వడం వల్ల టిఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందని వారు ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కొన్ని గుర్తులపై అభ్యంతరం తెలిపి వాటిని గ్రేటర్ ఎన్నికల్లో తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమికి రోటీ మేకర్ కారణం
ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి స్వతంత్ర అభ్యర్థి రోటి మేకర్ గుర్తు కారణమైందని రాజకీయ నిపుణులు అంచనా వేశారు. సూర్యాపేట బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన బండారు నాగరాజు దుబ్బాక ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. ఆయనకు ఎన్నికల సంఘం రోటి మేకర్ గుర్తును కేటాయించింది. రోటి మేకర్ గుర్తు కారు గుర్తుకు దగ్గరగా ఉండటంతో చాలామంది రోటి మేకర్ కు ఓట్లు వేసినట్లుగా గుర్తించారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు.

గ్రేటర్ లోనష్టం జరగకముందే అప్రమత్తం అయిన గులాబీ నేతలు
ఈ ఎన్నికల్లో నాగరాజుకు 3570 ఓట్లు రావడం ప్రతి ఒక్కరిని విస్మయపరిచింది. రోటి మేకర్ వల్లే టిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని గుర్తించిన టిఆర్ఎస్ నాయకులు గ్రేటర్ ఎన్నికల విషయంలో ఇప్పటి నుంచే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి కారు గుర్తును పోలిన అన్ని గుర్తులను తొలగించాలని, కారు గుర్తును పోలిన గుర్తులను కేటాయించకూడదు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికే పలు మార్లు టీఆర్ఎస్ పార్టీ ఇలా స్వతంత్రులకు కేటాయించిన గుర్తు కారుకు దగ్గరగా ఉండటం వల్ల నష్టపోయింది. దీంతో ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో నష్టం జరగకుండా ముందే ఎన్నికల సంఘాన్ని కారును పోలిన గుర్తులను తీసెయ్యాలని కోరుతున్నారు.