హైదరాబాద్: ఆసీస్ క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ ఉపయోగించిన బ్యాట్ కోల్‌కతాలోని మ్యూజియంలో కొలువుతీరనుంది. ఫనటిక్ స్పోర్ట్స్ మ్యూజియానికి ఈ బ్యాట్‌ను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకెల్ క్లార్క్ అందజేశాడు. ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
వీరితో పాటు ఈ సిరిస్‌కు సంబంధించి కామెంటేటర్స్ ప్యానెల్ కూడా భారత్‌లో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో మైకేల్ క్లార్క్ మంగళవారం స్పోర్ట్స్ మ్యూజియాన్ని సందర్శించాడు. 1947-48 సీజన్లో భారత జట్టు తొలిసారి ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఆ పర్యటనలో బ్రాడ్‌మన్ ఉపయోగించిన బ్యాట్‌ను క్లార్క్ మ్యూజియం నిర్వాహకులకు అందజేశాడు.
ఈ సందర్భంగా క్లార్క్ మాట్లాడుతూ ఇలాంటి బ్యాట్లతోనే తన కెరీర్లో 99.94 యావరేజిని బ్రాడ్‌మన్ సాధించాడని కొనియాడాడు. దీంతో పాటు 2012లో సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టులో క్లార్క్ 329 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందుకు సంబంధించిన ఓ పెయింటింగ్‌ని క్లార్క్ మ్యూజియానికి అందించాడు.
అనంతరం మ్యూజియంలో ఉన్న బ్యాట్ల మధ్య తేడాను ఆయన ఆసక్తిగా తిలకించాడు. ఈ మ్యూజియం బ్యాట్ కలెక్షన్లో డేవిడ్ వార్నర్, బ్రాడ్ హాగ్, మైకెల్ క్లార్క్ తదితర ఆసీస్ క్రికెటర్ల బ్యాట్లు కూడా ఉన్నాయి. ఇక, చెన్నైలో జరిగిన తొలి వన్డే ముగిసిన తర్వాత ఇరు జట్లు రెండో వన్డే కోసం కోల్‌కతాకు చేరుకున్నాయి. ఇరు జట్ల మధ్య గురువారం రెండో వన్డే జరగనుంది.