సెమీ ఫైనల్ 2: బంగ్లాపై ఘన విజయం, కోహ్లీసేన ఫైనల్‌కు చేరిందిలా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 265 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 59 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. తాజా విజయంతో ఛాంపియన్స్‌ ట్రోఫీ పైనల్లో పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది.

265 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు చక్కటి శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(123; 129 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సు నాటౌట్), శిఖర్ ధావన్, (46; 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించారు. ధావన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి (96; 78 బంతుల్లో 13 ఫోర్లు నాటౌట్)లతో రాణించాడు.

 India Vs Bangladesh

ఈ మ్యాచ్‌లో ధావన్ తృటిలో అర్ధ సెంచరీ కోల్పోయినా రోహిత్ శర్మ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అతనికి కెప్టెన్ విరాట్ కోహ్లి నుంచి మంచి సహకారం లభించడంతో టీమిండియా గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. వీరిద్దరూ సునాయాసంగా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

వీరిద్దరూ చక్కటి కవర్ డ్రైవ్‌లు, స్ట్రయిట్ డ్రైవ్‌లతో అలరిస్తూ అద్భుతమైన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించారు. ఈ క్రమంలోనే తొలుత రోహిత్ శర్మ అర్ధ సెంచరీ సాధించగా, ఆపై కోహ్లీ కూడా అర్థ సెంచరీతో మెరిశాడు. వీరిద్దరూ రాణించడంతో విజయం ఏకపక్షమైంది. వీరి దూకుడును బంగ్లా బౌలర్లు ఏ దశలోనూ అడ్డుకోలేకపోయారు.

Rohit

భారత్ విజయ లక్ష్యం 265

అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఓపెన‌ర్లు త‌మీమ్ ఇక్బాల్ (70), ముష్ఫిక‌ర్ ర‌హీమ్ (61) అర్ధ సెంచ‌రీలతో రాణించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది.

దీంతో భారత్‌కు 265 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్ల నుంచి చక్కటి శుభారంభం లభించలేదు. ఓపెనర్‌ సౌమ్య సర్కార్‌ (0) జట్టు స్కోరు 1 వద్ద భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి బౌల్డ్ అయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షబ్బీర్‌ రెహ్మాన్‌ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భువీ బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. ఈ సమయంలో మ్యాచ్‌పై కోహ్లీసేన పట్టు బిగించింది అనుకున్న సమయంలో బంగ్లా అనూహ్యంగా పుంజుకుంది. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (70), ముష్ఫికర్‌ రహీమ్‌ (61) అద్భుత ప్రదర్శన చేశారు.

Kohli

పటిష్ట భారత బౌలింగ్‌ను ఎదుర్కొన్ని వీరిద్దరూ అర్ధసెంచరీలు సాధించారు. మూడో వికెట్‌కు 123 పరుగుల చక్కని భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే జట్టు స్కోరు 154 పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 154 పరుగుల వద్ద కేదార్ జాదవ్ బౌలింగ్‌లో తమీమ్ ఇక్బాల్ (70) వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు.

తమీమ్‌ ఇక్బాల్‌ (70) అవుటైన తర్వాత క్రీజులో వచ్చిన షకిబ్‌ అల్‌ హసన్‌ (15) జట్టు స్కోరు 177 వద్ద జడేజా బౌలింగ్‌లో ధోనికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కాసేపటికే 61 పరుగులు చేసిన ముష్పికర్ రహీం జాదవ్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో కోహ్లీ తన నాలుకని బయట చాపి అదోలా ముష్పికర్ రహీం వైపు చూస్తూ కుప్పిగంతులు వేశాడు.

మ్యాచ్‌పై కోహ్లీసేన మళ్లీ ఆధిపత్యం సాగిస్తుందనుకొంటే చివర్లో కెప్టెన్‌ మొర్తజా (30 నాటౌట్‌) 5 బౌండరీలు బాది జట్టు స్కోరుని 264 పరుగులకు చేర్చాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, బుమ్రా, కేదార్ జాదవ్ తలో రెండు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు. చివ‌ర్లో బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్ చేశాడు.

భారత్ Vs బంగ్లాదేశ్ మ్యాచ్ హైలెట్స్:

* ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో చివరి బంతికి బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్‌ని పేసర్ భువనేశ్వర్ కుమార్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు.
* మూడో స్దానంలో బ్యాటింగ్‌కు దిగిన షబ్బీర్ రెహ్మాన్ 21 బంతుల్లో 19 పరుగులు చేశాడు.
* భువీ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి రెహ్మాన్ పెవిలియన్‌కు చేరాడు.
* రెహ్మాన్ వికెట్ తీయడానికి ముందు భువీ, బుమ్రా ఇద్దరూ 13 డాట్ బాల్స్ వేశారు.
* తొలి 10 ఓవర్లలో బంగ్లాదేశ్ 46 పరుగులు చేసింది. ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీలోనే బంగ్లాదేశ్‌కు ఇదే అత్యధికం.
* ఈ టోర్నీలో ఇంతకముందు వరకు బంగ్లా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 36, 37, 24 పరుగులు చేసింది.
* హార్దిక్ పాండ్యా వేసిన తన తొలి ఓవర్‌లో తమీమ్ ఇక్బాల్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఇది నో బాల్ అయింది.
* తన తొలి ఓవర్‌లో పాండ్యా రెండు నో బాల్స్ వేశాడు. తద్వారా ఈ ఓవర్‌లో 14 పరుగులు సమర్పించుకున్నాడు.
* 62 బంతుల్లో తమీమ్ ఇక్బాల్ అర్ధ సెంచరీ నమోదు చేశాడు.
* గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసిన తమీమ్ ఇక్బాల్ ఈ మ్యాచ్‌లో బౌండరీతో అర్ధసెంచరీ సాధించాడు.
* మూడో వికెట్‌కు 104 బంతుల్లో ఇక్బాల్, రహీం ఇద్దరూ 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* ముష్ఫికర్ రహీం 61 బంతుల్లో అర్ధసెంచరీ నమోదు చేశాడు.
* 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తమీమ్ ఇక్బాల్‌ను కేదార్ జాదవ్ పెవిలియన్‌కు చేర్చాడు.
* తమీమ్ ఇక్బాల్ అవుట్‌తో రహీం-ఇక్బాల్‌ల 123 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
* రవీంద్ర జడేజా బౌలింగ్‌లో 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షకీబ్ ఉల్ హాసన్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చాడు.
* కేదార్ జాదవ్ బౌలింగ్‌లో కెప్టెన్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ముష్ఫికర్ రహీం పెవిలియన్‌కు చేరాడు.
* ఈ క్రమంలో కోహ్లీ తన నాలుకని బయట చాపి అదోలా ముష్పికర్ రహీం వైపు చూస్తూ కుప్పిగంతులు వేశాడు.
* ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో 10 ఓవర్ల స్పెల్‌ను పూర్తిగా వేసిన బౌలర్‌గా రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు.
* 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హొస్సైన్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా తొలి వికెట్ ఇది.
* ఇన్నింగ్స్‌లో అద్భుతమైన యార్కర్‌తో పేసర్ బుమ్రా.. మహముదుల్లాని రెండో వికెట్‌గా అవుట్ చేశాడు.
* ఈ టోర్నీలో 11 నుంచి 40 ఓవర్ల మధ్య టీమిండియా 19 వికెట్లు తీసి అగ్రస్ధానంలో నిలిచింది. 18 వికెట్లతో పాకిస్థాన్ రెండో స్ధానంలో నిలిచింది.
* 10 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 40 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.
* చివర్లో టస్కిమ్ మహ్మాద్‌తో కలిసి కెప్టెన్‌ మొర్తజా (30 నాటౌట్‌) 5 బౌండరీలు బాది స్కోరు బోర్డుని పరిగెత్తించాడు.
* ఈ మ్యాచ్‌లో మిడిల్ ఓవర్లలో 75 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి భారత్ అద్భుత ప్రదర్శన చేసింది.
* నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ 7 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది.
* భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, బుమ్రా, కేదార్ జాదవ్ తలో రెండు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bangladesh couldn't capitalise over the 123-run stand between Tamim Iqbal and Mushfiqur Rahim and managed to post 264/7 against India in the second semi-final of the Champions Trophy 2017 here on Thursday (June 15).
Please Wait while comments are loading...