ధర్మశాల టెస్టు: కుల్దీప్ దెబ్బకు కుదేలైన ఆసీస్, 300 ఆలౌట్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న చివరి టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక ఓవర్ ఆడి ఖాతా తెరవలేదు. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్‌లో పరుగులేమీ చేయకుండా ఉన్నారు. అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (4/68) అద్భుత ప్రదర్శనతో ధర్మశాల టెస్టులో టీమిండియా పట్టు బిగించింది.

ఆస్ట్రేలియా 300 ఆలౌట్
ధర్మశాల వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా 300 పరుగులకే ఆలౌటైంది. అరంగేట్రం టెస్టులోనే భారత్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేసి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌ను భారత బౌలర్లు ఏ దశలోనూ కుదురుకోనివ్వలేదు.

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ (111)తో చెలరేగగా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (56), వేడ్ (57) అర్ధసెంచరీలతో రాణించారు. ఇక రెన్ షా (1), మార్ష్ (4), పీటర్ హ్యాండ్స్ కోంబ్ (8), మ్యాక్స్ వెల్ (8), కమ్మిన్స్ (21), ఓకీఫ్ (8), లియాన్ (13) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు, ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీసుకోగా భువనేశ్వర్ కుమార్, అశ్విన్, జడేజా తలో వికెట్ తీసుకున్నారు.

ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్
ధర్మశాల వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓకీఫ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఓకీఫ్ అవుటైన తర్వాత నాథన్ లియాన్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం ఆసీస్ 84 ఓవర్లకు గాను ఎనిమిది వికెట్ల కోల్పోయి 283 పరుగులు చేసింది. వేడ్ 50, లియాన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్
ధర్మశాల వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ నాలుగో వికెట్ తీశాడు. డేవిడ్‌ వార్నర్‌ (56), పీటర్‌ హాండ్స్‌ కోంబ్ (8), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (8)ను పెవిలియన్‌ను పంపించిన కుల్దీప్ జట్టు స్కోరు 245 వద్ద కమిన్స్‌ను 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపాడు. కుల్దీప్ వేసిన 72.4వ బంతిని ఎదుర్కొన్న కమిన్స్‌ నేరుగా అతడికే క్యాచ్‌ ఇచ్చాడు. భారత బౌలర్లలో కుల్దీప్ నాలుగు, ఉమేశ్ యాదవ్‌ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు. ఇప్పటికే 17 ఓవర్లు వేసిన కుల్‌దీప్‌ 44 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. వరుసగా వికెట్లు పడుతుండటంతో ఆసీస్ ఆటగాళ్లు ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం ఆసీస్ 77 ఓవర్లకు గాను ఏడు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. వేడ్ 43, ఓకీఫ్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టీ విరామానికి ఆసీస్ 208/6
ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ టీ విరామానికి ఆరు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ప్రస్తుతం వేడ్ 13, కమ్మిన్స్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. భారత్ బౌలర్లలో కుల్దీప్ మూడు, ఉమేశ్ యాదవ్‌ 2, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు. వరుసగా వికెట్లు పడుతుండటంతో ఆసీస్ ఆటగాళ్లు ఆచితూచి అడుగులేస్తున్నారు

ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్
ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. సెంచరీ అనంతరం 111 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్‌లో కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ అవుటయ్యాడు. అశ్విన్ వేసిన బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న రహానేకు క్యాచ్ ఇచ్చి స్మిత్ పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఆసీస్ 61 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. వేడ్ 13, కమ్మిన్స్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

ఆసీస్‌ను వణికిస్తున్న కుల్దీప్ 

ధర్మశాల టెస్టులో కుల్దీప్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్‌ మూడు వికెట్లు తీసి ఆస్ట్రేలియాను కష్టాల్లోకి నెట్టాడు. తన టెస్టు కెరీర్ తొలి వికెట్‌గా డేవిడ్ వార్నర్(56)ను అవుట్ చేసిన కుల్దీప్ ఆ తరువాత కాసేపటికి మరో ఆటగాడు హ్యాండ్స్ కోంబ్‌ని 8 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఆ తర్వాత 48వ ఓవర్‌ నాలుగో బంతికి మాక్స్‌వెల్‌(8)కు నాలుగు పరుగులు ఇచ్చిన కుల్‌దీప్‌.. అదే ఓవర్‌ చివరి బంతికి క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా లంచ్‌ తర్వాత నాలుగు వికెట్లు కోల్పోయింది.

India-Australia 4th Test:

20వ టెస్టు సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్
ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ నమోదు చేశాడు. 150 బంతులను ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్ 13 ఫోర్ల సాయంతో సెంచరీని పూర్తి చేశాడు. టెస్టుల్లో స్టీవ్ స్మిత్‌కి ఇది 20వ సెంచరీ. ఈ సిరిస్‌లో స్టీవ్ స్మిత్‌కు ఇది మూడో టెస్టు సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం ఆసీస్ 55 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. స్మిత్ 104, వేడ్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కుల్దీప్ మ్యాజిక్: ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్
ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. తొలి టెస్టు ఆడుతున్న కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో ఆసీస్‌ను కష్టాల్లోకి నెట్టాడు. 8 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌ను కుల్దీప్ అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఎండ్‌లో స్మిత్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం ఆసీస్ 49 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. స్మిత్ 95, వేడ్ ఖాతా తెరవకుండా క్రీజులో ఉన్నారు. అంతకముందు ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో వార్నర్ 58, రెన్‌షా 1, మార్ష్ 4, హ్యాండ్స్‌కోంబ్‌ 8 పరుగులు చేసి అవుటయ్యారు.

నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్

చివరి టెస్టులో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన హ్యాండ్స్‌కోంబ్‌ను కుల్దీప్ అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఎండ్‌లో స్టీవ్ స్మిత్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం ఆసీస్ 47 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. స్మిత్ 94, మ్యాక్స్‌వెల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఉమేష్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్

చివరి టెస్టులో ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసిన మార్ష్‌ను ఉమేష్ పెవిలియన్‌కు పంపాడు. మరో ఎండ్‌లో స్మిత్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం ఆసీస్ 38 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. స్మిత్ 86, హ్యాండ్స్‌కోంబ్ ఖాతా తెరవకుండా క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఉమేష్ రెండు వికెట్లు తీసుకోగా, కుల్దీప్ ఒక వికెట్ తీసుకున్నారు.

రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్

చివరి టెస్టులో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న కుల్దీప్ యాదవ్‌ ఓ అద్భుత బంతికి ఆసీస్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌‌ను అవుట్ చేశాడు. దీంతో 87 బంతలను ఎదుర్కొన్న వార్నర్ 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవలియన్‌‌కు చేరాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 34.1వ బంతిని వార్నర్‌ బ్యాక్‌ఫుట్‌ తీసుకొని ఆడగా బంతి ఎడ్జ్‌కు తగిలి స్లిప్‌లో ఉన్న కెప్టెన్‌ రహానే చేతిలో పడింది. దీంతో వార్నర్ పెవిలియన్‌కు చేరాడు.

అరంగేట్రం చేసిన టెస్టులోనే వార్నర్ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ని అవుట్ కుల్దీప్ అవుట్ చేయడంతో జట్టు సభ్యులందరూ అతడిని అభినందించారు. మరోవైపు టెస్టుల్లో తొలి వికెట్ తీసిన ఆనందంలో భావోద్వేగానికి గురైన కుల్దీప్... కెప్టెన్ రహానేను హత్తుకున్నాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి కుంబ్లే, కోహ్లీ చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు. 35 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

లంచ్ విరామానికి ఆసీస్ 131/1
ధర్మశాల వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టులో లంచ్ విరామానికి ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్ వార్నర్, కెప్టెన్ స్మిత్ ఇద్దరు అర్ధసెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్ద‌రూ రెండవ వికెట్‌కు 121 పరుగులు జోడించారు. తొలి రోజు తొలి సెషన్‌లో మాత్రం భార‌త బౌల‌ర్లు విఫ‌ల‌మ‌య్యారు. స్పిన్న‌ర్ అశ్విన్ ఆసీస్ బ్యాట్స్‌మెన్‌పై పెద్ద ప్రభావం చూప‌లేక‌పోయారు. ప్రస్తుతం వార్నర్ 54, స్మిత్ 72 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఫామ్‌లోకి వార్నర్: అర్ధసెంచరీ
చివరి టెస్టులో ఆసీస్ ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌ అర్ధ సెంచరీ చేశాడు. ఈ సిరిస్‌లో వరుసగా విఫలమవుతున్న వార్నర్.. చివరి టెస్టులో తిరిగి ఫామ్‌లోకొచ్చాడు. 72 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో కెరీర్‌లో 24వ అర్ధ సెంచరీ చేశాడు. ఇక కెప్టెన్ స్మిత్‌ కూడా అర్థ సెంచరీ చేయడంతో ప్రస్తుతం ఆసీస్‌ స్కోరు 100 పరుగులు దాటింది. 29 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ ఒక వికెట్‌ నష్టానికి 125 పరుగులు చేసింది. స్మిత్‌ 67, వార్నర్‌ 53 క్రీజులో ఉన్నారు.

స్టీవ్ స్మిత్ అర్ధసెంచరీ
చివరి టెస్టులో ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అర్ధ సెంచరీ సాధించాడు. 67 బంతుల్లో స్మిత్‌ 50 పరుగులు పూర్తి చేశాడు. టెస్టుల్లో స్మిత్‌కు ఇది 21 అర్ధ సెంచరీ. 19వ ఓవర్లో అశ్విన్‌ వేసిన చివరి బంతిని ఎదుర్కొన్న స్మిత్‌ ఒక్క పరుగు చేసి అర్ధ సెంచరీని సాధించాడు. దీంతో 23 ఓవర్లు ముగిసే సరికి ఆసిస్‌ ఒక వికెట్‌ నష్టానికి 90 పరుగులు పూర్తిచేసింది. ప్రస్తుతం స్మిత్‌ 57, వార్నర్‌ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.

నిలకడగా వార్నర్, స్టీవ్ స్మిత్
ధర్మశాల టెస్టులో ఓపెనర్ వార్నర్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ నిలకడగా ఆడుతున్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. వార్నర్ 26, స్మిత్ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు.

డ్రింక్స్ బాయ్‌గా కోహ్లీ
చివరి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డ్రింక్స్ బాయ్‌గా మారాడు. మ్యాచ్ ఆడుతున్న క్రికెటర్లకు విరామంలో డ్రింక్స్ అందిస్తూ రహానేకు విలువైన సూచనలు చేస్తున్నాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆసిస్‌
చివరి టెస్టులో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఆసీస్‌కు భారత బౌలర్ ఉమేష్ షాకిచ్చాడు. 1.4 ఓవర్‌ వద్ద రెన్‌ షా అవుటయ్యాడు. ఒకే ఒక్క పరుగు సాధించిన రెన్‌షా ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్, మొదటి బంతికే వార్నర్ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. భువనేశ్వర్ వేసిన మొదటి ఓవర్‌లో వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను థర్డ్ స్లిప్‌లో ఉన్న నాయర్ జారవిడిచాడు. ప్రస్తుతం ఆసీస్ మూడు ఓవర్లులో వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. ప్రస్తుతం వార్నర్‌ (10), స్మిత్‌ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన ధర్మశాల టెస్టు ప్రారంభమైంది. టెస్టు ఆరంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. చివరి టెస్టుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. గాయం కార‌ణంగా ధ‌ర్మ‌శాల టెస్టులో కోహ్లీ ఆడ‌టం లేద‌ని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజ‌య్ బాంగ‌ర్ స్ప‌ష్టం చేశారు.

దీంతో జట్టు బాధ్యతలను రహానేకి అప్పగించారు. భార‌త టెస్టు జట్టు త‌ర‌పున కెప్టెన్సీ చేపట్టిన 33వ టెస్ట్ ప్లేయ‌ర్‌గా ర‌హానే నిలిచాడు. కెప్టెన్ వేసుకునే బ్లేజ‌ర్ దుస్తుల్లో ర‌హానే టాస్ వేసేందుకు స్టేడియంలోకి వచ్చాడు. కోహ్లీ స్ధానంలో కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్నారు. ఇక పేసర్ ఇషాంత్‌ శర్మ స్థానంలో భువనేశ్వర్‌ కుమార్‌ చోటు దక్కించుకున్నాడు.

కుల్దీప్‌కు ఇదే తొలి టెస్టు మ్యాచ్ కాగా, కెప్టెన్‌గా రహానేకు కూడా తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఇక టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా మాత్రం రాంచీలో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ సిరిస్‌లో ఇరు జట్లు చెరో టెస్టుని గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి.

రాంచీ టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ధర్మశాల టెస్టు సిరిస్‌ నిర్ణయాత్మంగా మారింది. ఇక పిచ్ విషయానికి వస్తే ధర్మశాల పిచ్‌ సహజంగానే పేసర్లకు అనుకూలిస్తుంది. ఫాస్ట్‌ బౌలర్లు మంచి పేస్‌, బౌన్స్‌ను రాబట్టగలుగుతారు. అయితే, గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో వికెట్‌ స్లోగా, స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది.

సిరిస్ ఫలితాలు:
1st Test: Australia won by 333 runs
2nd Test: India won by 75 runs
3rd Test: Draw

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India's captain Virat Kohli was ruled out of the 4th Test against Australia as Ajinkya Rahane stepped in to lead the side today (March 25) at the HPCA Stadium. Australia captain Steve Smith won the toss and opted to bat first.
Please Wait while comments are loading...