న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీసేనకు తిరుగులేదు: 3-0తో ఐదు వన్డేల సిరిస్‌ కైవసం

By Nageshwara Rao

హైదరాబాద్: ఇండోర్ వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 294 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 13 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే 3-0తో భారత్ కైవసం చేసుకుంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీతో ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది. ఆసీస్ నిర్దేశించిన 294 పరుగుల లక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించడం విశేషం. ఓపెనర్లు రహానే (70), రోహిత్‌ శర్మ (70) అద్భుత ఆరంభాన్ని ఇవ్వగా, హార్దిక్‌ పాండ్యా(78) చక్కటి ఇన్నింగ్స్‌‌తో భారత విజయంలో మరోసారి కీలక పాత్ర పోషించాడు.

మనీష్‌ పాండేతో చెలరేగిన పాండ్యా 45 బంతుల్లో కెరీర్‌ నాలుగో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విజయానికి 10 పరుగుల దూరంలో ఉండగా పాండ్యా 78(72 బంతులు; 5 ఫోర్లు, 4 సిక్సులు) కమిన్స్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని(2), మనీష్‌ పాండే(36)లు భారత్‌కు 13 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందించారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ రెండు వికెట్లు తీయగా, కౌల్టర్ నైల్, రిచర్డ్‌సన్, అగర్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో వరుస తొమ్మిది వన్డేల్లో విజయం సాధించిన కెప్టెన్‌గా ధోని రికార్డును కోహ్లి సమం చేశాడు. నాలుగో వన్డే ఈ నెల 28న బెంగళూరు వేదికగా జరగనుంది.

భారత్ ఇన్నింగ్స్ సాగిందిలా:

మూడో వన్డే: హార్ధిక్ పాండ్యా హాఫ్ సెంచరీ
ఇండోర్ వేదికగా ఆస్టేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 45 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. మరో ఎండ్‌లో ఉన్న మనీష్ పాండే (11) పరుగులతో నిలకడగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం 40 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. పాండే 11, పాండ్యా 53 పరుగులతో క్రీజులో ఉన్నారు.

వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్
294 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కెప్టెన్ కోహ్లీ, కేదార్ జాదవ్ రూపంలో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 203 పరుగుల వద్ద అగర్ బౌలింగ్‌లో కోహ్లీ (28) అవుటవగా ఆ తర్వాత మరో మూడు పరుగులు జోడించాక కేదార్ జాదవ్‌ (2)ను కానె రిచర్డ్‌సన్ పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం 36 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. భారత్ విజయానికి 84 బంతుల్లో 88 పరుగులు చేయాల్సి ఉంది.

విరాట్ కోహ్లీ అవుట్
ఇండోర్ వేదికగా ఆస్టేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 203 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ (28) రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. అగర్ బౌలింగ్‌లో ఆరోన్ ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ వెనుదిరిగాడు. ప్రస్తుతం 35 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కోహ్లీ అవుటైన తర్వాత కేదార్ జాదవ్ క్రీజులోకి వచ్చాడు.

Kohli

రెండో వికెట్ కోల్పోయిన భారత్
ఇండోర్ వేదికగా ఆస్టేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 139 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన భారత్ రహానే (70) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో రహానే వికెట్ల ముందు దొరికిపోయాడు. 8 పరుగుల తేడాతో భారత్ రెండో వికెట్ కోల్పోవడంతో స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. ప్రస్తుతం 24 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కోహ్లీ 2, పాండ్యా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన భారత్

ఇండోర్ వేదికగా ఆస్టేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 139 పరుగుల వద్ద రోహిత్ శర్మ (71) అవుటయ్యాడు. ఆసీస్ బౌలర్ కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో కార్ట్ రైట్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 22 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 141 పరుగులు చేసింది. రహానే 66, కెప్టెన్ కోహ్లీ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

మూడో వన్డే: ఫోర్‌తో రోహానే హాఫ్ సెంచరీ
మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగా, మరో ఓపెనర్ రహానే కూడా 50 బంతుల్లో 7 ఫోర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ 56 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 67 పరుగులతో చెలరేగుతున్నాడు. ప్రస్తుతం భారత్ 18 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 67, రహానే 51 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి
ఆస్ట్రేలియా నిర్దేశించిన 294 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు రహానే, రోహిత్ శర్మలు చెలరేగి ఆడుతున్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 42 బంతుల్లో 3 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో హఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రహానే (35) పరుగులు చేశాడు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 52, రహానే 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ 84 బంతుల్లో 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

5 ఓవర్లకు భారత్ 23/0
ఆస్ట్రేలియా నిర్దేశించిన 294 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 5 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. రహానె (10), రోహిత్‌ శర్మ (10) పరగులతో క్రీజులో ఉన్నారు. కమిన్స్‌ బౌలింగ్‌లో రోహిత్‌ ఓ అద్భుతమైన సిక్స్ బాదాడు.

భారత్ విజయ లక్ష్యం 294

ఇండోర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది. దీంతో కోహ్లీసేనకు 294 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ ఆరోన్ ఫించ్ (124) సెంచరీ, కెప్టెన్ స్మిత్ (63) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.

37 ఓవర్లలో వికెట్ నష్టానికి 220 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఆసీస్‌ను చివర్లో భారత బౌలర్లు కుప్పకూల్చారు. 224 పరుగుల దగ్గర ఫించ్ అవుట్ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత 243 పరుగుల దగ్గర స్మిత్, మ్యాక్స్‌వెల్ (5) అవుటయ్యారు. దీంతో ఆసీస్ భారీ స్కోరు చేసే ఛాన్స్ మిస్ చేసుకుంది. భారత బౌలర్లలో బుమ్రా, కుల్‌దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు.

ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 260 పరుగుల వద్ద ట్రావిస్ హెడ్ (4) రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 46 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ ఐదు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. స్టోయినస్ (12), హ్యాండ్స్‌కోంబ్ (1) పరుగులతో క్రీజులో ఉన్నారు.

వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో కెప్టెన్ స్మిత్ (63), చాహల్ బౌలింగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (5) అవుటయ్యారు. ప్రస్తుతం 43 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (1), మార్కస్ స్టోయిన్స్ (1) క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. సెంచరీ వీరుడు అరోన్ ఫించ్ (124) అవుటయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో కేదార్ జాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఫించ్ పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 38 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (51), మ్యాక్స్ వెల్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నాడు.

ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ భారీ లక్ష్యం దిశగా సాగుతోంది. అరోన్ ఫించ్, స్మిత్‌లు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఫించ్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. మరో వైపు కెప్టెన్ స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 55 బంతుల్లో 4 ఫోర్లతో 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం 37 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 221 పరుగులు చేసింది. ఫించ్ 122, స్మిత్ 50 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ కలిసి 141 బంతుల్లో 151 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

steve smith

ఆరోన్ ఫించ్ సెంచరీ
గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్ సెంచరీ పూర్తి చేశాడు. 110 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 101 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు. ఫించ్‌కి ఇది 8వ సెంచరీ. ప్రస్తుతం 34 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 197 పరుగులు చేసింది. ఫించ్ (107), స్టీవ్ స్మిత్ (44) పరుగులు చేసి హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు.

వికెట్ల కోసం కష్టపడుతున్న భారత బౌలర్లు
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ భారీ లక్ష్యం దిశగా సాగుతోంది. 70 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన తర్వాత బరిలోకి దిగిన కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌తో కలిసి అరోన్ ఫించ్ నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తిస్తున్నారు. 64 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఫించ్ ప్రస్తుతం 80 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం 29 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది. మరోవైపు భారత కెప్టెన్ కోహ్లీ బౌలర్లను మారుస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్, బుమ్రా, చాహల్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ పెద్దగా ప్రభావం చూపడం లేదు.

ఫలించిన స్మిత్ వ్యూహం: చెలరేగుతున్న ఫించ్
మూడో వన్డేలో ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ వ్యూహం ఫలించింది. గత రెండు వన్డేల్లోనూ ఓపెనర్‌గా వచ్చిన హిల్టన్ కార్ట్‌రైట్‌ను తప్పించి ఆరోన్ ఫించ్‌ను జట్టులోకి తీసుకోవడం ఆసీస్‌కి కలిసొచ్చింది. చెన్నై, కోల్‌కతాల్లో జరిగిన రెండు వన్డేల్లోనూ ఓపెనర్లు హిల్టన్ కార్ట్‌రైట్, వార్నర్ విఫలమైన సంగతి తెలిసిందే.

Steve Smith elects to bat in a must-win game in Indore

కార్ట్‌రైట్ అయితే మరీ ఘోరంగా రెండు వన్డేల్లో కలిపి కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మూడో వన్డేలో అతడిపై వేటువేసి ఫించ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేశాడు. ముడో వన్డేలో ఫించ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (42) వద్ద అవుటయ్యాడు.

వార్నర్‌ను హార్దిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫించ్, వార్నర్ కలసి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. ప్రస్తుతం 30 ఓవర్లకు గాను ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 171 పరుగులు చేసింది. ఫించ్ (91), స్మిత్ (34) పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఆరోన్ ఫించ్ హాఫ్ సెంచరీ

గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన ఆసీస్‌ ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 66 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 55 పరుగులు చేశాడు. ఫించ్‌కి ఇది 17వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. నిలకడగా ఆడుతూ బౌండరీలు సాధిస్తున్నాడు. ప్రస్తుతం 22 ఓవర్లుకు గాను ఆసీస్ వికెట్ నష్టానికి 117 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్‌ (55), స్టీవ్‌స్మిత్‌ (16) పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 70 పరుగుల వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్ (42) అవుటయ్యాడు. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (42)ను పెవిలియన్‌ పంపించాడు. పాండ్యా వేసిన 13.3వ బంతికి ఊహించిన విధంగా మిడిల్‌ స్టంప్‌ ఎగిరిపోయింది. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్‌ (25), స్టీవ్‌స్మిత్‌ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు.

10 ఓవర్లకు ఆస్ట్రేలియా 49/0
ఇండోర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు ఇద్దరూ నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ వికెట్‌ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (24), ఆరోన్‌ ఫించ్‌ (22) క్రీజులో ఉన్నారు.

టాస్ గెలిచిన స్మిత్, సిరిస్‌పై కన్నేసిన భారత్

ఐదు వన్డేల సిరిస్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో వన్డే ప్రారంభమైంది. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరిస్‌లో వరుసగా రెండు వన్డేలు గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకోవాలని చూస్తోంది.

ఈ సిరిస్‌లో తొలి రెండు వన్డేల్లో కోహ్లీసేన టాస్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు ఇండోర్ పిచ్ అనుకూలంగా ఉండనుంది. రెండో ఇన్నింగ్స్‌కు పిచ్ స్వభావం కాస్త మారే అవకాశం ఉంది. టాస్ నెగ్గి ఉంటే తాను కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాడినని కోహ్లీ అన్నాడు.

Steve Smith elects to bat in a must-win game in Indore

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇండోర్ స్టేడియంలో జరిగిన ఏ వన్డేలోనూ భారత్ ఓడిపోలేదు. ఈ రికార్డును కొనసాగించాలని కూడా కోహ్లి సేన పట్టుదలగా ఉంది. మరి ఈ వన్డేలోనైనా ఆసీస్ పుంజుకుని భారత్‌కు గట్టి పోటీనిస్తుందేమో చూడాలి. కాగా, మూడో వన్డేకు ఆసీస్ జట్టులో రెండు మార్పులు జరిగాయి.

కార్ట్‌రైట్, కీపర్ వేడ్ స్థానాల్లో ఫించ్, హ్యాండ్స్‌కాంబ్ జట్టులో చేరారు. మరోవైపు మూడో వన్డేకు కూడా ఎటువంటి మార్పుల్లేకుండా కోహ్లీసేన బరిలోకి దిగుతోంది. ఈ సిరిస్‌లో వరుసగా రెండు వన్డేలు గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకోవాలని చూస్తోంది.

భారత్:

రోహిత్ శర్మ, ఆజింక్య రహానే, విరాట్ కోహ్లి (కెప్టెన్), మనీష్ పాండే, కేదార్ జాదవ్, ఎం.ఎస్.ధోనీ, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, యజ్వేంద్ర చాహల్

ఆస్ట్రేలియా:

ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టాయినిస్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్సన్, నాథన్ కౌల్టర్‌నైల్, కేన్ రిచర్డ్‌సన్

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X