ధర్మశాల టెస్టులో భారత్ విజయం: 2-1తో టెస్టు సిరిస్ కైవసం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో భారత్ దక్కించుకుంది.

మరోవైపు స్వదేశంలో వరుసగా ఏడు టెస్టు సిరిస్‌లను టీమిండియా కైవసం చేసుకుంది. 106 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 23.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ చేసిన కేఎల్ రాహుల్, రెండో ఇన్నింగ్స్‌లో కూడా మరో అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

ప్రస్తుతం కేఎల్ రాహుల్ 52, రహానే 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. నాలుగో రోజు ఉదయం ఓపెనర్ విజయ్ (8), పుజారా(0) ఒకే ఓవర్‌లో అవుట్ కావడంతో భారత అభిమానులు కాస్త ఆందోళన చెందారు. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన రహానే ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీలతో చెలరేగాడు.

కమిన్స్ బౌలింగ్‌లో రహానే వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. వేగంగా పరుగులు రావడంతో భారత్‌పై ఒత్తిడి తొలగింది. తొలి ఇన్నింగ్స్‌లో సాహాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన జడేజా రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆసీస్ పతనంలోనూ తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఈ సిరిస్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆరు అర్ధ సెంచరీలతో చెలరేగాడు.

నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పూణెలో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలై 0-1తో భారత్ వెనుకబడినా ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న తీరు అద్భుతం. బెంగుళూరులో టెస్టులో విజయం సాధించి సిరిస్ను 1-1తో డ్రా చేసుకుంది. ఆ తర్వాత రాంచీలో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది.

దీంతో ధర్మశాల టెస్టు నిర్ణయాత్మకంగా మారింది. చివరి టెస్టుకు కెప్టెన్ కోహ్లీ దూరమైనా జట్టు ఏమాత్రం ఆందోళన చెందలేదు. తాత్కాలిక కెప్టెన్ రహానే స్ఫూర్తిదాయక కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. కోహ్లీ లేని లోటు తెలియకుండా జట్టంతా సమిష్టిగా రాణించింది. ముఖ్యంగా చివరి టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు.

ధర్మశాల టెస్టు స్కోర్లు:
తొలి ఇన్నింగ్స్:
ఆస్ట్రేలియా 300, భారత్ 332
రెండో ఇన్నింగ్స్:
ఆస్ట్రేలియా 137, భారత్ 106/2

మ్యాచ్ ఫలితం: 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం

విజయానికి 4 పరుగుల దూరంలో టీమిండియా
ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్‌ విజయానికి చేరువైంది. 106 పరుగులు విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా 23 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. మరో 4 పరుగులు చేస్తే భారత్ విజయం సాధిస్తుంది. ప్రస్తుతం ఓపెనర్‌ రాహుల్‌ 48, కెప్టెన్‌ రహానే 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
ధర్మశాల వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్‌లో భారత్ రెండో వికెట్‌ కోల్పోయింది. కమిన్స్‌ వేసిన ఒకే ఓవర్లో మురళీ విజయ్, పుజారాలు పెవిలియన్‌కు చేరారు. 14వ ఓవర్‌లో కమిన్స్‌ వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న విజయ్‌.. వేడ్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరగా, ఆ తర్వాత విజయ్‌ స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకు వచ్చిన పుజారా అదే ఓవర్లో చివరి బంతిని ఎదుర్కొని పరుగు తీసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆసీస్‌ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ బంతిని అందుకుని నేరుగా వికెట్లకు విసిరాడు. దీంతో పుజారా డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు.

తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
ధర్మశాల వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌ కోల్పోయింది. కమిన్స్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ మురళీ విజయ్‌ వికెట్‌(8) కీపర్‌ వేడ్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. నాలుగో రోజు ఆటలో భాగంగా మురళీ విజయ్-రాహుల్‌ల జోడీ చక్కటి శుభారంభాన్నిచ్చింది. 13.3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్‌ నష్టానికి 46 పరుగులు చేసింది. ప్రస్తుతం రాహుల్‌ (33), పుజారా పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

ధర్మశాల వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. 19/0 ఓవర్ నైట్ స్కోరుతో భారత ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్‌లు మంగళవారం ఆటను ప్రారంభించారు. 11 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 29, మురళీ విజయ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

India Vs Australia, 4th Test, Day 4: India 87 runs short of Test series-win

చివరి టెస్టులో భారత్ విజయానికి ఇంకా 66 పరుగులు కావాల్సి ఉంది. టీమిండియా చేతిలో పది వికెట్లు ఉన్నాయి. ధర్మశాల టెస్టులో ఒక్క రోజులో అంతా మారిపోయింది. తొలి రెండు రోజులు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో మూడో రోజు భారత్ పైచేయి సాధించింది.

మూడో రోజు ఆసీస్‌పై భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి గెలుపు దిశగా పయనిస్తోంది. ఈరోజు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆస్ట్రేలియా ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టం. నాలుగో రోజు లంచ్‌ సమయానికి కొంచెం అటుఇటుగా టీమిండియా విజయం సాధించడం ఖాయం.

ఎందుకంటే భారత్ విజయం సాధించడానికి గాను చేయాల్సింది 87 పరుగులే. పది వికెట్లు చేతిలో ఉన్న టీమిండియాను అడ్డుకోవడం కంగారూలకు చాలా కష్టమైన పనే. మూడోరోజైన సోమవారం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 137 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ మూడో రోజు ఆట ముగిసేసరికి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు భారత్ తొలిఇన్నింగ్స్‌లో 332 పరుగులకు ఆలౌటైంది. దీంతో 32 పరుగుల ఆధిక్యం లభించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India need another 87 runs to win the deciding fourth final Test and thus clinch the four-match series against Australia as they come out to bat at the Himachal Pradesh Cricket Association (HPCA) stadium here on Tuesday (March 28).
Please Wait while comments are loading...