రాంచీ టెస్టు, డే2: ఆసీస్ 451 ఆలౌట్, టీమిండియా 120/1

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నిలకడగా ఆడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. మురళీ విజయ్ 42, పుజారా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకా 331 పరుగుల వెనుకంజలో ఉంది. ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ మ‌రోసారి అర్ధ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. మ‌రో ఓపెన‌ర్ విజ‌య్‌తో క‌లిసి తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్‌కు ఒక వికెట్ లభించింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 451 పరుగులకు ఆలౌటైంది.

 

తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
రాంచీ టెస్టులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. కమిన్స్‌ వేసిన 31.2వ బంతిని ఆడబోయి కీపర్‌ మాథ్యూవేడ్‌కు క్యాచ్ ఇచ్చాడు. నిలకడగా ఆడుతున్న భారత ఆటగాళ్లను అవుట్ చేసేందుకు ఆసీస్‌ బౌలర్లు మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు విసురుతున్నారు. రాహుల్ అవుటైన తర్వాత పుజారా క్రీజులోకి వచ్చాడు. 32 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టానికి 93 పరుగులు చేసింది.

కేఎల్ రాహుల్ అర్ధసెంచరీ: నిలకడగా టీమిండియా
రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధసెంచరీని నమోదు చేశాడు. లియాన్ వేసిన 22వ ఓవర్‌ ఆఖరి బంతిని స్వీప్‌చేసి బౌండరీతో అర్ధసెంచరీ సాధించాడు. ఈ సిరిస్‌లో రాహుల్‌కి ఇది నాలుగు అర్ధసెంచరీ. మరోవైపు మురళీ విజయ్ 21 పరుగులతో నిలకడగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీంతో 23 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ కోల్పోకుండా 73 పరుగులు చేసింది. ప్రస్తుతం రాహుల్ 52, మురళీ విజయ్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.


తొలి ఇన్నింగ్స్: ఆస్ట్రేలియా 451 ఆలౌట్
రాంచీ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 451 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఒంటరి పోరాటం చేశాడు. 178 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 124 పరుగులిచ్చిన జడేజా 5 వికెట్లు తీశాడు.

భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు తీసుకోగా, ఉమేశ్ యాదవ్ 3, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు. 299/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండు రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆసీస్‌కు స్మిత్, మ్యాక్స్‌వెల్ చక్కటి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ సెంచరీలతో కదం తొక్కడంతో ఆసీస్ 137.3 ఓవర్లలో 451 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్:
డేవిడ్ వార్నర్ 19, రెన్‌షా 44, స్మిత్ 178 నాటౌట్, మార్ష్ 2, హ్యాండ్స్‌కోంబ్ 19, మ్యాక్స్‌వెల్ 104, వేడ్ 37, కమ్మిన్స్ 0, ఒకీఫ్ 25, లియాన్ 1, హజెల్‌వుడ్ 0; మొత్తం: 137.3 ఓవర్లలో 451 ఆలౌట్.

భారత్ బౌలింగ్: జడేజా 5, ఉమేష్ 3, అశ్విన్ ఒక వికెట్

ఎనిమిది సార్లు ఐదు వికెట్లు తీసిన జడేజా
రాంచీ టెస్టులో ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక పరుగు మాత్రమే చేసిన లియాన్‌ను జడేజా పెవిలియన్‌కు పంపాడు. ఈ వికెట్‌తో తొలి ఇన్నింగ్స్‌లో జడేజా ఐదు వికెట్లు తీశాడు. టెస్టుల్లో జడేజా ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది ఎనిమిదోసారి. ప్రస్తుతం ఆసీస్ 137 ఓవర్లలో తొమ్మిది వికెట్లను కోల్పోయి 450 పరుగులు చేసింది. స్మిత్ 177, హజెల్‌వుడ్ ఖాతా తెరవకుండా క్రీజులో ఉన్నారు.

ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్
మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఒకీఫ్‌ను ఉమేశ్ పెవిలియన్‌కు పంపాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన ఒకీఫ్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 71 బంతులను ఎదుర్కొన్న ఒకీఫ్ ఐదు ఫోర్ల సాయంతో 25 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ స్మిత్ నెమ్మదిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆసీస్ 135 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 446 పరుగులు చేసింది. స్మిత్ 174, లియాన్ ఖాతా తెరవకుండా క్రీజులో ఉన్నారు.

లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 401/7

రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్ 153, ఓకీఫ్ 1 పరుగుతో ఉన్నారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ల‌లో రెన్ షా 44, వార్న‌ర్‌, 19 మార్ష్‌ 2, హ్యాండ్స్ కోంబ్ 19, మ్యాక్స్‌వెల్ 104, వాడే 37, క‌మ్మిన్స్ 0 ప‌రుగులు చేశారు. భార‌త బౌల‌ర్ల‌లో ఉమేశ్ యాద‌వ్ 2, అశ్విన్ 1 వికెట్లు తీయ‌గా జ‌డేజా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు.

వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్
రాంచీ టెస్టు రెండో రోజు జడేజా సత్తా చాటాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 116వ ఓవర్‌లో ఆసీస్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ 115.4 బంతికి 37 పరుగులు చేసిన కీపర్ మ్యాథ్యూ వేడ్‌ సాహాకు క్యాచ్ ఇవ్వగా, 115.6 బంతికి కమ్మిన్స్(డకౌట్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.రెండో రోజు తొలి సెషన్‌ ప్రారంభంలో ఆసీస్‌ ఆటగాళ్లు వికెట్‌ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతోన్న క్రమంలో జడేజా.. మ్యాక్స్‌వెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత లంచ్‌ విరామానికి ముందు జడేజా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. 37 పరుగుల వద్ద వేడ్‌ను జడేజా పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో స్మిత్‌, వేడ్‌ జోడీ ఆరో వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వేడ్‌ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కమిన్స్‌ను జడేజా డకౌట్‌ చేశాడు.

  

ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 185 బంతులను ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్ 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 104 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. 99వ ఓవర్లో చివరి బంతిని ఫోర్‌గా మలిచి వంద పరుగులు పూర్తి చేశాడు. మ్యాక్స్‌వెల్‌కు ఇది తొలి టెస్టు సెంచరీ.

మూడేళ్ల విరామం తర్వాత టెస్టుల్లో పునరాగమనం చేసిన టెస్టులోనే సెంచరీ సాధించడంతో మ్యాక్స్‌వెల్‌ మైదానంలో ఉద్వేగానికి గురయ్యాడు. మైదానంలో ఉన్న స్మిత్‌... మ్యాక్స్‌వెల్‌ను అభినందించాడు. 2014 తర్వాత మ్యాక్స్‌వెల్‌ టెస్టు ఆడటం ఇదే తొలిసారి. ఆ తర్వాత జడేజా బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌ సాహాకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

దీంతో స్మిత్, మ్యాక్స్‌వెల్ 191 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. మరో వైపు స్మిత్ ఆచితూచి ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆసీస్ 102 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ప్రస్తుతం స్మిత్ 126, వేడ్ ఖాతా తెరవకుండా క్రీజులో ఉన్నారు.

మ్యాక్స్‌వెల్ అద్భుత సెంచరీ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత సెంచరీతో చెలరేగిపోయాడు. 180 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో కెరీర్‌లోనే తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మొదటి రోజు ముగించిన మ్యాక్స్‌వెల్ రెండో రోజు ఆట ప్రారంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో కెప్టెన్ స్మిత్‌తో కలిసి 180 పైచిలుకు పరుగుల భాగస్వామ్యం కూడా నమోదు చేశాడు. ప్రస్తుతం ఆసీస్ 99 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. స్మిత్ 124, మ్యాక్స్‌వెల్ 103 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మ్యాక్స్‌వెల్‌ బ్యాట్‌ విరిగిపోయింది
మూడో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. మ్యాచ్‌ ప్రారంభం కాగానే మైదానంలో నవ్వులు కురిశాయి. ఉమేశ్‌యాదవ్‌ వేసిన తొలి బంతిని ఎదుర్కోనే క్రమంలో మ్యాక్స్‌వెల్‌ బ్యాట్‌ విరిగిపోయింది. దీంతో మైదానంలోని ఆటగాళ్ల ముఖంలో నవ్వులు విరబూశాయి. 92 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 308పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మ్యాక్స్‌వెల్‌ 86, స్మిత్‌ 122 పరుగులతో ఉన్నారు.

రెండో రోజు ప్రారంభమైన ఆట
భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. 299/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్ దూకుడుగా ఆడుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Australia would be hoping to take their score towards a big total against India as they walk out into the middle to resume their innings on the second day of the third Test against India at the JSCA International Stadium here on Friday (March 17).
Please Wait while comments are loading...