ధర్మశాల టెస్టు మనదే: భారత్ లక్ష్యం 87, ఒకరోజు మిగిలుంది

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ధర్మశాల వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మూడో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 19 పరుగులు చేసింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ (13), మురళీ విజయ్ (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఒక్కోరోజు ఆట మిగిలుంది. భారత్ చేతిలో 10 వికెట్లు ఉన్నాయి

ఏమైనా అద్భుతాలు జరిగితే తప్ప ఈ టెస్టులో ఆసీస్ ఓటమి పాలవ్వడం అసాధ్యమని తెలుస్తోంది. రేపటి రెండు సెషన్లలో టీమిండియా ఆటగాళ్లు రాహుల్, విజయ్, పుజారా, రహానేపై బ్యాటింగ్ భారం మోయాల్సిన బాధ్యత ఉంది. మూడో రోజు 106 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు ధాటిగా ఆడారు.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ తొలి ఓవర్‌లో మూడు పోర్లు కొట్టాడు. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో వరుసగా రెండు బంతులను బౌండరీకి తరలించిన రాహుల్ తర్వాత ఇంకో బంతిని ఫోర్‌గా మలిచాడు. ఆసీస్ బౌలర్లను టీమిండియా ఆటగాళ్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. చివరి టెస్టులో భారత్ విజయం సాధిస్తే 2-1తో టెస్టు సిరిస్‌ను సొంతం చేసుకుంటుంది.

ధర్మశాల టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 137 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆసీస్, భారత్ కు 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఏమైనా అద్భుతాలు జరిగితే తప్ప భారత్ విజయం సాధించడం తథ్యం.

తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులు చేసిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 137 పరుగులకే ఆలౌటైంది. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ బ్యాట్స్ మన్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు.

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్లు రెన్ షా (8), వార్నర్ (8), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (17), హ్యాండ్స్ కోంబ్ (18), మ్యాక్స్‌వెల్ (45), షాన్ మార్ష్ (1), కుమ్మిన్స్ (12), ఒకీఫ్ (0), లియాన్ (0), హెజెల్ ఉడ్ (0), మాథ్యూ వేడ్ (25) పరుగులు చేశారు. చివర్లో వేడ్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు.

దీంతో 53.5 ఓవర్లకు ఆసీస్ 137 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో మూడేసి వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీశాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేసిన 45 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం.

ధర్మశాలలో సత్తా చాటుతున్న భారత బౌలర్లు
చివరి టెస్టులో టీమిండియా బౌలర్లు ఆకట్టుకున్నారు. ఆసీస్ టాపార్డర్‌ను వేగంగా పెవిలియన్‌కు పంపి షాకిస్తున్నారు. పేస్, బౌన్స్‌కు అనుకూలించే పిచ్‌పై టీమిండియాను ఇబ్బంది పెట్టేందుకు ఐదుగురు బౌలర్ల వ్యూహంతో ఆసీస్ బరిలోకి దిగింది. టీమిండియా కూడా అలాంటి వ్యూహంతోనే కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు కల్పించింది. కాగా, భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకే ఆలౌటైంది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఓపెనర్లు రెన్ షా (8), వార్నర్ (8) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరగా, స్మిత్ (17), హ్యాండ్స్ కోంబ్ (18) కాసేపు ప్రతిఘటించారు. మ్యాక్స్ వెల్ (45) దూకుడు ప్రదర్శించాడు. షాన్ మార్ష్ (1) వస్తూనే పెవిలియన్ చేరాడు. ఇప్పుడు కమ్మిన్స్ (12), ఓకీఫ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు.

ఆరో వికెట్ కోల్పోయి కష్టాల్లో ఆస్ట్రేలియా
ధర్మ‌శాల వేదిక‌గా భారత్‌తో జ‌రుగుతున్న చివ‌రిటెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌ను అశ్విన్ పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 33 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ అవుటైన తర్వాత కమ్మిన్స్ క్రీజులోకి వచ్చాడు. వేడ్ 6, కమ్మిన్స్ ఖాతా తెరవకుండా క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా చేరో వికెట్ తీశారు.

టీ విరామానికి ఆసీస్ 92/5
ధర్మ‌శాల వేదిక‌గా భారత్‌తో జ‌రుగుతున్న చివ‌రిటెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీ విరామానికి ఆస్ట్రేలియా ఐదు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ 37 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
ధర్మ‌శాల వేదిక‌గా భారత్‌తో జ‌రుగుతున్న చివ‌రిటెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఐదు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 6, రెన్‌షా 8, స్మిత్ 17 పరుగులు వద్ద అవుటైన సంగతి తెలిసిందే. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన పీటర్ హ్యాండ్స్ కోంబ్ 18 ప‌రుగుల‌కి అవుట్ కాగా ఆ తర్వాత కొద్దిసేప‌టికే మార్ష్ 1 ప‌రుగుకే వెనుదిరిగాడు. మార్ష్ అవుటైన తర్వాత వేడ్ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ ప్ర‌స్తుతం ఐదు వికెట్ల న‌ష్టానికి 92 ప‌రుగుల‌తో క్రీజులో ఉంది.

మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఆస్ట్రేలియా

ధర్మశాల టెస్టులో భారత్‌తో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్ చెలరేగడంతో ఆసీస్ వరుస ఓవర్లలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. భువీ వేసిన ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన స్మిత్ అదే ఊపులో భారీ షాట్ ఆడబోయి పెవిలియన్‌కు చేరాడు. 17 పరుగులు చేసిన స్మిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఉమేష్ వేసిన తర్వాతి ఓవర్‌లో ఓపెనర్ రెన్‌షా(8) కీపర్‌ సాహాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆసీస్ 10 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది. ప్రస్తుతం మ్యాక్స్‌వెల్, హ్యాండ్స్‌కోంబ్ ఖాతా తెరవకుండా క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్
ధర్మశాల టెస్టులో భారత్‌తో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసిన వార్నర్‌ను ఉమేష్ పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో కరుణ్ నాయర్ ఇచ్చిన లైఫ్‌ను వార్నర్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. భువీ వేసిన ఆ ఓవర్‌లో థర్డ్ స్లిప్‌లో ఉన్న కరుణ్ క్యాచ్ మిస్ చేశాడు. ప్రస్తుతం ఆసీస్ నాలుగు ఓవర్లలో వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. రెన్‌షా 4, స్మిత్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.


తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 332 ఆలౌట్
ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకు అలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌పై 32 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 300 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 248/6తో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్‌కు సాహా-జడేజా జోడి చక్కని ఆరంభాన్ని ఇచ్చింది. ఈ ఇద్దరూ నిలకడగా ఆడుతూ 96 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్ 5, కమ్మిన్స్ 3, హాజెల్ ఉడ్ ఒక వికెట్ తీశారు.

తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్
ధర్మశాల టెస్టులో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సోమవారం ఓవర్ నైట్ ఆటగాళ్లు జడేజా, సాహా చక్కటి శుభారంభాన్నిచ్చినా, ఆ తర్వాత ఆసీస్ బౌలర్లు విజృంభించడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 31 పరుగులు చేసిన సాహాను కమ్మిన్స్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత్ మూడు ఓవర్ల వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 117 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. కుల్దీప్ 6, ఉమేష్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ 31 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్
ధర్మశాల టెస్టులో భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జడేజా వికెట్ కోల్పోయిన అనంతరం క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ ఏడు బంతులను ఎదుర్కొని డకౌట్‌‌గా వెనుదిరిగాడు. ఒకీఫ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం భారత్ 114 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. సాహా 31, కుల్దీప్ ఖాతా తెరవకుండా క్రీజులో ఉన్నారు. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ 18 పరుగుల ఆధిక్యంలో ఉంది.

అర్ధసెంచరీ అనంతరం అవుటైన జడేజా
ఆసీస్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. అర్ధసెంచరీ అనంతరం ఆల్ రౌండర్ జడేజా 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కమిన్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అర్ధసెంచరీ అనంతరం జడేజా తనదైన స్టైల్లో బ్యాట్‌ను కత్తిలా ఊపుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. వృద్ధిమాన్ సాహాతో కలిసి జడేజా ఏడో వికెట్‌కు 96 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓవర్ నైట్ స్కోరు 248/6తో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్‌కు సాహా-జడేజా జోడి చక్కని ఆరంభాన్ని ఇచ్చింది. సాహా ఆచితూచి ఆడగా, జడేజా ధాటిగా ఆడాడు. ఫలితంగా భారత్ ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరును దాటింది. ప్రస్తుతం భారత్ 113 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. సాహా 30, భువనేశ్వర్ ఖాతా తెరవకుండా క్రీజులో ఉన్నారు. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ 17 పరుగుల ఆధిక్యంలో ఉంది.

83 బంతుల్లో రవీంద్ర జడేజా అర్ధసెంచరీ
ధర్మశాల వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అర్ధసెంచరీ నమోదు చేశాడు. 83 బంతులను ఎదుర్కొన్న జడేజా మూడు ఫోర్లు, మూడు సిక్సుల సాయంతో అర్ధసెంచరీ సాధించాడు. ఈ సిరిస్‌లో జడేజాకు ఇది రెండో అర్ధసెంచరీ. జడేజా అర్ధసెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం 109 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ప్రస్తుతం జడేజా 50, వృద్ధిమాన్ సాహా 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.

నిలకడగా ఆడుతోన్న టీమిండియా
ధర్మశాల వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మూడో రోజు టీమిండియా నిలికడగా ఆడుతోంది. 248/6 ఓవర్ నైట్‌తో సోమవారం ఆటను ప్రారంభించిన టీమిండియా 105 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. జడేజా అర్ధసెంచరీకి చేరువలో ఉండగా అతడికి మద్దుతగా సాహా ఆడుతున్నాడు. ప్రస్తుతం జడేజా 42, వృద్ధిమాన్ సాహా 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 9 పరుగుల వెనుకంజలో ఉంది.

తొలి సెషన్‌లో డ్రింక్స్ బ్రేక్
ధర్మశాల వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న చివరి టెస్టులో ఆటగాళ్లు డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. 102 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.
ప్రస్తుతం జడేజా 37, వృద్ధిమాన్ సాహా 23 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 

ధర్మశాల వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, సాహా నిలకడగా ఆడుతున్నారు. ఆసీస్ బౌలర్లు వికెట్లు తీసేందుకు తెగ కష్టపడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Off-spinner Nathan Lyon along with pacers would be eyeing to take all four remaining India wickets quickly on third day of the fourth Test here on Monday (March 27).
Please Wait while comments are loading...