గత 13 ఏళ్లలో ఇదే తొలిసారి: మూడో టెస్టులో అరుదైన సన్నివేశం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పల్లెకెలె వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. మూడో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగగా, శ్రీలంక మూడు మార్పులు చేసింది.

ఒక టెస్టు మ్యాచ్ నిషేధానికి గురైన రవీంద్ర జడేజా స్థానంలో భారత చైనామన్ బౌలర్(ఎడమచేతి మణికట్టు స్పిన్నర్) కుల్దీప్ యాదవ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్‌ను కూడా ఆడిస్తారని భావించినప్పటికీ.. అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు.

two chinaman bowlers playing in pallekele

ఇక శ్రీలంక తుది జట్టు విషయానికి వస్తే ధనుంజయ, హెరాత్, నువాన్ ప్రదీప్ స్థానాల్లో లక్షణ్ సండకన్, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండోలు చోటు దక్కించుకున్నారు. శ్రీలంక జట్టులో ఆడుతున్న లక్షణ్ సండకన్ కూడా చైనామన్ బౌలర్ కావడమే ఇక్కడ విశేషం.

ఇరు జట్లు చైనామన్ బౌలర్లతో బరిలో దిగడం గత 13 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతేకాదు ఒక టెస్టు మ్యాచ్‌లో ఇద్దరు చైనామన్ బౌలర్లు ఒకేసారి ఆడటం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది రెండోసారి. 2004లో వెస్టిండీస్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్ టౌన్‌లో జరిగిన టెస్టులో ఇలా చైనామన్ బౌలర్లతో ఆడారు.

విండీస్ చైనామన్ బౌలర్ డేవ్ మొహ్మద్‌తో పాటు దక్షిణాఫ్రికా చైనామన్ బౌలర్ పాల్ ఆడమ్స్‌లు బరిలోకి దిగారు. ఆ తరవాత మళ్లీ ఇన్నాళ్లకు శ్రీలంక-భారత్ జట్ల తరుపున సండకన్, కుల్దీప్‌లు చైనామన్ బౌలర్ లుగా బరిలోకి దిగారు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇది 29వ టెస్టు కావడం విశేషం.

ఇదిలా ఉంటే మూడో టెస్టులో భారత ఆటగాళ్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనతను అందుకున్నాడు. వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన భారత తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు (90, 51, 67, 60, 51(నాటౌట్‌), 57, 67(నాటౌట్‌)) సాధించిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్‌ ఆరో ఆటగాడిగా ఉన్నాడు.

కేఎల్ రాహుల్‌ కంటే ముందు ఎవర్టన్‌ వీకీస్‌, ఆండీ ఫ్లవర్‌, శివ్‌నరైన్‌ చంద్రపాల్‌, కుమార సంగక్కర, క్రిస్‌ రోజర్స్‌ ఈ ఘనతను సాధించారు. మరోవైపు మూడో టెస్టు తొలిరోజు మ్యాచ్‌లో 17.4 ఓవర్లలోనే భారత జట్టు 100 పరుగులను పూర్తి చేసింది.

గతంలో 2010లో ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన టెస్టులో ఓ ఇన్నింగ్స్‌లో భారత్‌ ఇంతకంటే తక్కువ ఓవర్లలోనే వంద పరుగులు నమోదు చేసింది. 2001 నుంచి ఇప్పటి వరకు వేగంగా వంద పరుగులు పూర్తి చేయడం ఇది ఆరోసారి కావడం విశేషం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
two chinaman bowlers playing in pallekele test.
Please Wait while comments are loading...